UP : ఉత్తర్‌ప్రదేశ్‌లో జంట హత్యలు కలకలం రేపాయి. పోలీసుల సమక్షంలోనే గ్యాంగ్‌స్టర్,మాజీ ఎంపీ అతీక్ అహ్మద్,అతడి సోదరుడు అష్రాఫ్‌లను దుండగులు కాల్చి చంపారు. ప్రయోగ్ రాజ్ లోని వైద్య కళాశాల వద్ద శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. వైద్య పరీక్షల కోసం అతీక్, అష్రాఫ్‌లను పోలీసులు తరలిస్తుండగా జర్నలిస్టుల ముసుగులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు వారిపై గన్ తో అతి దగ్గరి నుంచి కాల్పులు జరిపారు.ఈ దృశ్యాలు మీడియా కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ కాల్పుల్లో ఒక పోలీసుకు గాయాలయ్యాయి. ముగ్గురు నిందితులను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.అతీక్,అష్రాఫ్ మృతదేహాలను పోలీసులు ఘటనాస్థలి నుంచి తరలించారు.
అతీక్ అహ్మద్ సమాజ్‌వాదీ తరఫున గతంలో ఎమ్మెల్యేగా,ఎంపీగా పనిచేశాడు. అతడిపై 100కుపైగా క్రిమినల్ కేసులున్నాయి. గతంలో హత్యకు గురైన ఉమేశ్ పాల్ కేసు విచారణలో అతీక్ అహ్మద్, అష్రాఫ్ లను కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం తరలిస్తుండగా వారిపై కాల్పులు జరిగాయి. ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న అసద్, అతడి సహచరుడు గులాం గురువారం ఝాన్సీ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్ లో హతమయ్యారు.
అసద్.. అతీక్ కుమారుడే. అసద్ అహ్మద్ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. సకాలంలో కోర్టు అనుమతి లభించని కారణంగా కుమారుడి అంత్యక్రియలకు అతీక్ అహ్మద్ హాజరు కాలేదు. శనివారం అసద్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలోని ధూమన్‌గంజ్ స్టేషన్ అతీక్ అహ్మద్‌ను,అష్రాఫ్‌ను పోలీసులు విచారించారు. అతీక్ అహ్మద్ కు మొత్తం ఐదుగురు కుమారులు.ప్రస్తుతం ఇద్దరు జైల్లో ఉన్నారు. మైనర్లయిన మరో ఇద్దరిని గృహ నిర్బంధంలో ఉంచారు.
అతీక్ అహ్మద్ సోదరుల హత్యతో యూపీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.జంట హత్యలపై ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిషన్‌ను సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.