ఆపరేషన్ సిందూర్ తో భారత్ లో దాడులు చేయాలంటేనే ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టేలా చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పట్లో దేశంలో బాంబుదాడులు ఉండకపోవచ్చు అనుకుంటున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో కారు బాంబు పేలుడు ఘటన జరిగింది. ఇవాళ (నవంబర్ 10) సాయంత్రం సుమారు 6:55 గంటల సమయంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెం. 1 దగ్గర నెమ్మదిగా కదులుతున్న కారులో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మంది దుర్మరణం చెందారు. 24 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో సమీపంలోని వాహనాలు తునాతునకలయ్యాయి. పేలుడు ధాటికి సుమారు 700 మీటర్ల వరకు ప్రకంపనలు సంభవించాయి. ఈ ఘటనతో ఢిల్లీలో పూర్తి అలర్ట్ ప్రకటించారు. యూపీ, ముంబై, హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. సెన్సిటివ్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ పెంచారు.
ఢిల్లీ బాంబు దాడికి ముందు నవంబర్ 9, 10న ఫరీదాబాద్‌లో 2,900 కేజీల పేలుడు పదార్థాలు, ఆయుధాలను పోలీసులు పట్టుకున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీస్, హర్యానా పోలీసులు జాయింట్ గా ఈ ఆపరేషన్ చేపట్టారు. పేలుడు పదార్థాలను తయారు చేస్తున్న డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై, డాక్టర్ ఆదిల్ అహ్మద్ రతర్ ను అరెస్ట్ చేశారు. ఢిల్లీలో జరిగిన పేలుడును ఉగ్రవాద దాడిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్న దాడుల్లో పట్టుడిన వారికి ఈ ఘటనతో సంబంధం ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ దాడి 2025లో ఢిల్లీలో జరిగిన అతి పెద్ద ఘటన. ముందు డిసెంబర్ 2023లో ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో చిన్న పేలుడు జరిగింది.
⦿ ఫిబ్రవరి 14, 2019- పుల్వామా దాడి
ఫిబ్రవరి 14, 2019న జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో CRPF కాన్వాయ్‌పై సూసైడ్ బాంబు దాడి. ఈ ఘటనలో 40 మంది జవాన్లు చనిపోయారు. 20 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనకు జైష్-ఇ-మొహమ్మద్ బాధ్యత వహించింది. సైన్యం పై జరిగిన పెద్ద దాడులలో ఈ ఘటన ఒకటి కాగా, భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తలకు కారణం అయ్యింది.
⦿ అక్టోబర్ 29, 2023- కేరళ దాడి
అక్టోబర్ 29, 2023న కేరళలోని కలమస్సేరీలో సీరియల్ ఐఈడీ దాడులు జరిగాయి ఈఘటనలో 8 మంది చనిపోగా, 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి లోకల్ తీవ్రవాద సంస్థకు చెందిన మార్టిన్ అనే వ్యక్తి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
⦿ అక్టోబర్ 2023- మణిపూర్ బాంబుదాడులు
మణిపూర్ లో 2023లో ఏకంగా 200 పైగా ఐఈడీ బాంబుదాడులు జరిగాయి. ఈ ఘటనల్లో 10 మందికి పైగా చనిపోగా, 20 మందికి పైగా గాయపడ్డరు.
⦿ ఏప్రిల్ 22, 2025- పహాల్గామ్ దాడి
జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో హిందూ పర్యాటకులు టార్గెట్ గా జైష్-ఇ-మహ్మద్ టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 28 పర్యాటకులు చనిపోగా, 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘనటకు ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ మీద ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.
మొత్తంగా 2020-2025 మధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల్లో మొత్తం 100కు పైగా పేళ్లు జరిగాయి. 200 మందికి పైగా చనిపోయారు. 500 మందికి పైగా గాయపడ్డారు.
Read Also: కదులుతున్న కారులో బ్లాస్ట్.. ఉగ్రవాదులు ఎలా ప్లాన్ చేశారంటే?