Delhi Blast:ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట (లాల్ ఖిలా) సమీపంలో సోమవారం సాయంత్రం కలకలం రేగింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద ఉన్న గేట్ నంబర్ 1 సమీపంలో పార్క్ చేసిన ఒక కారులో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 8 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఈ పేలుడు ధాటికి ఆ కారు పూర్తిగా దగ్ధమైంది. అంతేకాకుండా, మంటలు వేగంగా వ్యాపించడంతో సమీపంలో పార్క్ చేసి ఉన్న వాహనాలకు కూడా మంటలు అంటుకుని దెబ్బతిన్నట్లు ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కాసేపు భయాందోళన వాతావరణం నెలకొంది. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుడు నేపథ్యంలో ఢిల్లీలో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాల్లో భద్రతను పెంచింది.
సోమవారం ఉదయమే ఢిల్లీలో పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేయగా, ఢిల్లీ శివారులో ఏడుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకొన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. అయినప్పటికీ పేలుడు సంభవించడంపై ఢిల్లీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.