Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా గడిచిన మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. ఇక హైదరాబాద్ నగరం నుంచి చెప్పనక్కర్లేదు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వర్షం ఓ మోత మోగించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
సోమవారం ఉదయం నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. రానున్న 48 గంటలు తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశించింది. ఏజెన్సీ ప్రాంతాలు, పల్లపు ప్రాంతాల వాగులు, వంకలు దాటేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. రామన్న 48 గంటలు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలపై భారీ వర్షాలు నమోదయ్య అవకాశం ఉండడంతో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
ఇక తెలంగాణ విషయానికి వద్దాం. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావం తెలంగాణపై పడింది. మెదక్, సిద్దిపేట, మేడ్చల్-మల్కాజిగిరి, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తెల్లవారుజామున నుంచి ఇదే పరిస్థితి కొనసాగింది. మరో 2 గంటల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా. రానున్న 3 గంటల్లో యాదాద్రి-భువనగిరి, జనగాం, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయి. ఉదయం 9 గంటలకు మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలకు వర్షాలు పడే అవకాశముందని, వర్షాలు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఇక హైదరాబాద్ సిటీలో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి భారీ వర్షాలు పడ్డాయి. పటాన్‌చెరు, లింగంపల్లి, మియాపూర్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, కుత్బుల్లాపూర్, గాజులరామారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం నమోదు అయ్యింది. ఆ తర్వాత హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్, మణికొండ, అత్తాపూర్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, నాంపల్లి, బేగంపేట్, జూబ్లీహిల్స్, గోల్కొండ, టోలిచౌకి వంటి ప్రాంతాల్లో ఉదయం 6 గంటల వరకు వర్షం కుమ్మేసింది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో వర్షం తగ్గడం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. కప్రా, అల్వాల్, ఈసీఐఎల్, సైనిక్‌పురి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఘట్‌కేసర్, కీసర, బోడుప్పల్ ప్రాంతాలలో వర్షాలు తగ్గుముఖం పడతాయి. ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్ నగరం అంతటా తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
ALSO READ: కేటీఆర్ పీఏ, పీఆర్వోలకు సైఫాబాద్ పోలీసుల నోటీసులు.. నేడే విచారణ!
ఉత్తర హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం 60 నుంచి 70 మి.మీ దాటినట్టు అంచనా. భారీ వర్షాలు నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు అధికారులు. అల్పపీడనం నేపథ్యంలో మరో రెండురోజులు ఇదే విధంగా ఉంటుందని చెబుతున్నారు అధికారులు. మరోవైపు గడిచిన మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోటు తగ్గింది. ప్రస్తుతం 51.6 నుంచి 55 శాతానికి పెరిగింది వర్షపాతం.
స్వల్పంగా లోటు తగ్గడంతో పంటలకు కాస్త ఊపిరి వచ్చిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
8 గంటల వరకు వర్షాలు
హైదరాబాద్ నగరంలో కాప్రా, అల్వాల్, ఈసీఐఎల్, సైనిక్‌పురి, కుత్బుల్లాపూర్, మెడ్చల్, ఘట్‌కేసర్, కీసర, బోడుప్పల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం 8 గంటల వరకు నగరం అంతటా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి… pic.twitter.com/miXCnakFlh
— BigTV APP (@BigtvApp) September 14, 2026