Palnadu Lightning: పల్నాడు జిల్లాలో పిడుగుపడి నలుగురు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పిడుగుపాటు కారణంగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని సీఎం పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
రేపు పలు జిల్లాల్లో వర్షాలు.. ప్రజలకు అప్రమత్తత హెచ్చరిక
మరోవైపు రాష్ట్రంలో వాతావరణం మారనుంది. రేపు (సోమవారం) పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. రైతులు, పొలం పనుల్లో ఉన్నవారు మరీ ముఖ్యంగా చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తలు వహించాలని అధికారులు స్పష్టం చేశారు.
Also Read: కారు కొనడానికి వచ్చి.. పిస్టల్ చూపించి కారుతో ఉడాయించారు!