Delhi Jantar Mantar: జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల్లో అల్లర్లు సృష్టించాలని ఉగ్రవాదులు స్కెచ్ వేశారా? ఎలాగైతే అక్కడ విధ్వంసం సృష్టించాలన్న ప్లాన్.. చివరి నిమిషంలో బెడిసి కొట్టిందా? ఈ వ్యవహారంలో అరడజనుకు పైగానే అరెస్టు అయ్యారా? దీంతో తీగలాగితే డొంక కదులుతోంది. అసలు దీన్ని పోలీసులు ఎలా పసిగట్టారన్నది అసలు ప్రశ్న.
పాకిస్థాన్ గూఢచార సంస్థ- ఐఎస్ఐ మద్దతుతో భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు భారీ నెట్‌వర్క్‌ను పంజాబ్ పోలీసులు ఛేదించారు. ఈ వ్యవహారంలో వేర్వేరు ఉగ్ర ముఠాలకు చెందిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు అమృత్‌సర్ పోలీసులు. అరెస్టయిన వారిలో నలుగురు మైనర్లు ఉండటం కాసింత ఆందోళన కలిగించే అంశం. నిందితుల నుంచి పెట్రోల్ బాంబులు, పిస్టళ్లు, కార్ట్రిడ్జ్లు, లైటర్లు, కెమెరాలు వంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
అమృత్‌సర్ పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉగ్ర నెట్‌వర్క్ కార్యకలాపాలు జంతర్ మంతర్ వరకు విస్తరించినట్లు గుర్తించారు. పోలీసుల అదుపులో ఉన్న పలువురు తమ సహచరులతో కలిసి జంతర్ మంతర్‌కు వెళ్లినట్లు తేలింది. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని లక్ష్యంగా ఉగ్ర దాడికి కుట్ర పన్నినట్లు వెల్లడైంది. యూపీకి చెందిన ఓ వ్యక్తి ద్వారా ఆయుధాలు, పేలుడు పదార్థాలు సమకూర్చేందుకు ఐఎస్ఐ హ్యాండ్లర్లు ప్రయత్నించారట. అయితే భద్రతా సంస్థలు అప్రమత్తం కావడంతో ఆ ప్రణాళిక భగ్నమైంది.
ఫలితం లేదని భావించిన సదరు వ్యక్తులు.. చివరకు పంజాబ్‌కు చేరుకున్నట్లు తేలింది. తొలుత ఉగ్ర ముఠాకు సంబంధించి రాజస్థాన్‌కు చెందిన సుఖ్‌మన్ సింగ్‌తోపాటు ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు బాటిల్ బాంబులు, రెండు పిస్టళ్లు, తొమ్మిది కార్ట్రిడ్జ్లు స్వాధీనం చేసుకున్నారు. సుఖ్‌మన్ సింగ్ ఐఎస్ఐ హ్యాండ్లర్లతో నిరంతరం సంబంధాలు కొనసాగించినట్లు విచారణలో తేలింది. పంజాబ్‌లోని పోలీస్ భవనాలు, కీలక అధికారుల కదలికలపై రెక్కీ నిర్వహించి సమాచారాన్ని సేకరించారట.
ALSO READ: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇన్సురెన్స్ లేకపోతే ఆయిల్ బంద్, రంగంలోకి పోలీసులు
పేటీఎం సహా డిజిటల్ చెల్లింపుల ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలను గుర్తించారు. పాకిస్తాన్‌కు చెందిన హ్యాండ్లర్లకు స్థానిక సహచరుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. రైల్వే ట్రాక్‌ల సమీపంలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి వాటిలోని ఫుటేజీని విదేశాలలో ఉన్న ఐఎస్ఐ హ్యాండ్లర్లతో పంచుకుంటున్నట్లు దర్యాప్తులో గుర్తించారు అధికారులు. ప్రభుత్వం హామీతో నిరసనకారులు తమ ఆందోళనను విరమించారు. అది కంటిన్యూ అయితే ఊహించని నష్టం జరిగేదని అంటున్నారు.