Karnataka CM Seat Tussle: కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా మారింది. సీఎం సీటు కోసం అగ్ర సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోరు తీవ్రమైంది. కన్నడ నాటి రాజకీయాలు బిగ్ బాస్ ను మించిపోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య నాయకత్వ పోరు తీవ్రమవుతోంది. తాజాగా సీఎం సీటు పంచాయితీ దిల్లీకి మారింది.
వక్కలిగ వర్గానికి చెందిన శివకుమార్ ఇక తన ఓపిక నశించిందని పరోక్షంగా సూచనలు చేస్తున్నారు. ఓబీసీ నాయకుడు సిద్ధరామయ్య 2028 వరకు తానే సీఎం అంటున్నారు. దీంతో సిద్ధరామయ్య ప్రభుత్వం ఐదేళ్ల పూర్తి చేయడంపై సందేహం నెలకొంది. సిద్ధరామయ్య, శివకుమార్ వర్గాలు దిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టాయి. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు విధేయులైన 10 మంది ఎమ్మెల్యేలు దిల్లీకి బయలుదేరారని సమాచారం. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా చేస్తామని కాంగ్రెస్ అధి నాయకత్వం హామీ ఇచ్చిందని డీకే వర్గం చెబుతోంది.
కర్ణాటక డ్రామా ఇప్పుడు 1,800 కి.మీ దూరంలోని దిల్లీకి మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, శివకుమార్ సహా సీనియర్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ చర్చించి ఈ గందరగోళానికి ముగింపు పలుకుతుందని ఖర్గే అన్నారు.
హైకమాండ్ నిర్ణయిస్తే డీకే శివకుమార్‌ను సీఎంగా అంగీకరించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని సిద్ధరామయ్యకు సన్నిహితుడైన హోంమంత్రి పరమేశ్వర అన్నారు. సిద్ధరామయ్య మద్దతుదారుడు జమీర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. 2028 వరకు సీఎం పదవి ఖాళీగా లేదని స్పష్టంచేశారు.
డీకే శివకుమార్ పరోక్షంగా తన అసహనానికి వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద శక్తి మాట నిలబెట్టుకోవడం’ అని రాశారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ అయిన శివకుమార్ .. గతంలో మాట్లాడుతూ.. పార్టీలోని 5-6 మందికి మాత్రమే అధికారాన్ని పంచుకునే “రహస్య ఒప్పందం” గురించి తెలుసని అన్నారు. తనను ముఖ్యమంత్రిని చేయమని ఏనాడూ అడగలేదన్నారు.
కాంగ్రెస్‌లో ట్రబుల్‌షూటర్‌గా పిలిచే శివ కుమార్ తన ఎత్తుగడలు వేస్తున్నారు. శివకుమార్ మంగళవారం సిద్ధరామయ్య సహాయకుడు సతీష్ జార్కిహోలితో అర్ధరాత్రి సమావేశం అయ్యారు. సిద్ధరామయ్యను విడిచిపెట్టనని జార్కిహోళి ఆయనకు చెప్పారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. శివకుమార్ ఇటీవల బెంగళూరుకు వచ్చినప్పుడు కాంగ్రెస్ చీఫ్ ఖర్గేను కలవలేదు. ఖర్గే సిద్ధరామయ్యతో గంటసేపు సమావేశం అయ్యారు. రాహుల్ గాంధీతో కూడా శివ కుమార్ మాట్లాడలేకపోయారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
Also Read: Delhi Blast Case Update: ఢిల్లీ బ్లాస్ట్ కేసు, వాళ్లిద్దరు భార్యాభర్తలే, ఆపై నిధులు సేకరణ కూడా
అయితే ఇద్దరు నాయకులు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటన చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు జరగనున్నాయని బీజేపీ ప్రచారం చేస్తుండడంతో.. ఆ వాదనలను ఇరువురు నేతలు తోసిపుచ్చారు. 140 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉన్నారని చెబుతున్నారు.