BigTV English

Lal Bahadur Shastri : జాతి నిత్య స్పూర్తి.. మన శాస్త్రి!

Lal Bahadur Shastri : జాతి నిత్య స్పూర్తి.. మన శాస్త్రి!

Lal Bahadur Shastri : భారత రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి యూపీలోని మొగల్‌సరాయ్‌లో 1904వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన జన్మించారు. తల్లిదండ్రులు శారదా ప్రసాద్ శ్రీవాస్తవ, రామదులారి దేవి. వీరిది శ్రీవాస్తవ కాయస్థ కుటుంబం. శాస్త్రీజీ తండ్రి టీచరుగా పనిచేసి తర్వాతి రోజుల్లో అలహాబాద్ రెవిన్యూ కార్యాలయంలో గుమాస్తాగా రిటైరయ్యారు. లాల్ బహదూర్ కన్నుతెరచిన ఏడాదిలోనే ఆయన తండ్రి కన్నుమూశారు. దీంతో శాస్త్రీజీ తల్లి రామదులారి, పిల్లలను తీసుకుని పుట్టింటికి చేరింది. శాస్త్రిజీ చదువంతా మొగల్‌సరాయి, వారణాసిలలో కొనసాగింది.


1926లో కాశీ విద్యాపీఠం నుంచి ఫస్ట్‌క్లాసులో డిగ్రీని సంపాదించారు. ఆ రోజుల్లో కాశీ విద్యాపీఠం డిగ్రీని “శాస్త్రి” అనేవారు. దీంతో ఈయన పేరు వెనక శాస్త్రి అనేది చేరిపోయింది. గాంధీ, తిలక్ వంటి నేతల ప్రభావంతో శాస్త్రీజీ 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. కానీ అప్పటికి ఆయన మైనర్ కావటంలో బ్రిటిష్ సర్కారు ఆయన్ను జైలు నుండి విడుదల చేసింది. శాస్త్రి గారి వివాహం 1928 మే 16వ తేదీన మీర్జాపూర్‌లో లలితా దేవితో జరిగింది.

1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రెండున్నర ఏళ్ల పాటు జైలు పాలైన శాస్త్రీజీ 1937లో యూపీ పార్లమెంటరీ బోర్డుకు ఆర్గనైజింగ్ సెక్రెటరీగా పనిచేసారు. 1940లో స్వాతంత్ర సమరంలో చురుకుగా పాల్గొనడంవల్ల తిరిగి ఏడాది జైలు శిక్షననుభవించారు. జైలు నుండి విడుదలయ్యాక గాంధీ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమంలో, అలహాబాద్‌లో నెహ్రుతో కలసి అనేక స్వాతంత్రోద్యమ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. దీంతో 1946 వరకు జైల్లోనే గడపాల్సివచ్చింది. తన 9 ఏళ్ల జైలు కాలంలో శాస్త్రి గారు ఎక్కువ సమయాన్ని పుస్తకాలు చదవడంలో గడిపారు.


స్వాతంత్రం వచ్చాక.. యూపీ పార్లమెంటరీ సెక్రెటరీగా నియమితులై, కొద్ది రోజుల తర్వాత.. నాటి సీఎం గోవింద వల్లభ్ పంత్ ప్రభుత్వంలో హోం, రవాణా మంత్రిగా సేవలందించారు. ఆయన రవాణా మంత్రిగా ఉండగా, యూపీలో తొలిసారి ప్రభుత్వ బస్సుల్లో మహిళా కండక్టర్లను నియమించారు. అల్లరి మూకలను చెదరగొట్టడానికి లాఠీలకు బదులు నీటి ప్రవాహాన్ని వాడాలని ఆదేశించారు. మత కలహాలను అరికట్టి, నిరాశ్రయులకు ఆశ్రయాన్ని కల్పించి అందరిచేత శభాష్ అనిపించుకున్నారు.

1951లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శాస్త్రీజీ కాంగ్రెస్ బలోపేతానికి కృషిచేశారు. 1952, 1957, 1962 లో పార్టీ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. 1952లో యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. మే 13, 1952 నుండి డిసెంబర్ 7, 1956 వరకు కేంద్ర రైల్వే, రవాణా మంత్రిగా పనిచేసారు. 1956 సెప్టెంబరులో మహబూబ్‌నగర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. అయితే నాటి ప్రధాని నెహ్రూజీ ఆ రాజీనామాను తిరస్కరించారు. కానీ.. 3 నెలల తర్వాత మళ్లీ తమిళనాడులోని అరియాలూరులో జరిగిన మరో ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకున్నారు.

1957 ఎన్నికల్లో తిరిగి గెలిచి రవాణా మరియు సమాచార శాఖ మంత్రిగాను, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖా మంత్రి, తరవాత హోం శాఖ మంత్రి (1961) గాను సేవలనందించారు. 1964, మే 27న నెహ్రూజీ మరణంతో జూన్ 9న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఇంగ్లీష్ భాషను అధికార భాషగా చేసి, తమిళనాడులో రేగిన హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని శాంతియుతంగా పరిష్కరించారు. పాల ఉత్పత్తిని పెంచేందుకు శ్వేత విప్లవాన్ని ప్రోత్సహించి, జాతీయ పాడిపరిశ్రామాభి వృద్ది సంస్థను (నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు) మరియు అముల్ సహకార సొసైటీ ఏర్పాటు చేశారు.

1965లో జరిగిన 22 రోజుల భారత పాకిస్తాన్ యుద్ధంలో విజయం సాధించి మరో ఘనతను సాధించారు. ‘జై జవాన్, జై కిసాన్’ అనే నినాదంతో భారత వ్యవసాయ, రక్షణ రంగాలను బలోపేతం చేశారు. చైనాతో వచ్చిన సమస్యలను శాంతియుతంగా, సమయస్పూర్తితో పరిష్కరించారు. పాకిస్తాన్‌తో యుద్ధం తర్వాత శాంతి స్థాపనకై నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు మొహమ్మద్ ఆయూబ్ ఖాన్‌తో కలిసి నాటి రష్యాలోని తాష్కెంట్ (నేటి ఉజ్బెకిస్తాన్) శిఖరాగ్ర సమావేశానికి హాజరై 1966 జనవరి 10న శాస్త్రీజీ, ఖాన్ తాష్కెంట్ డిక్లరేషన్ మీద సంతకాలు చేశారు. కానీ.. ఆ మరుసటి రోజే (1966 జనవరీ 11వ తేదీ) శాస్త్రి గారు తాష్కెంట్ లోనే గుండెపోటుతో కన్నుమూశారు.

శాస్త్రీజీ ఆకస్మిక మరణాన్ని జాతి జీర్ణించుకోలేక పోయింది. నేటికీ ఆయన మరణంపై ఇప్పటికీ ఎన్నో సందేహాలు మరియు అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. ఏది ఏమైనా భరత మాత ముద్దుబిడ్డగా, జాతి జనుల్లో లాల్ బహుదూర్ ఒక ధ్రువతారగా నిలిచిపోయారు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×