Bank Employee: అనారోగ్యంతో ఒక రోజు సెలవు పెట్టిన ఓ బ్యాంకు ఉద్యోగికి వింత అనుభవం ఎదురైంది. ఒక రోజు సిక్ లీవ్ తీసుకున్నందుకు హెచ్ఆర్ నుంచి వార్నింగ్ ఈ-మెయిల్ వచ్చినట్లు ఒక ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే, ముందస్తు అనుమతి లేకుండా సెలవు తీసుకోవడం వల్ల తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణిస్తూ వార్నింగ్ మెయిల్ పంపారని ఉద్యోగి స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నారు.
మూడు రోజుల్లోపు ఈ-మెయిల్‌కు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని హెచ్ఆర్ మెయిల్ లో పేర్కొన్నారు. ఉద్యోగి వివరణ సంతృప్తికరంగా లేకపోతే తీవ్రమైన చర్యలు ఉంటాని హెచ్ఆర్ పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగా ఒక రోజు సెలవు తీసుకున్నానని, అందుకు వార్నింగ్ మెయిల్ వస్తుందని భావించలేదని ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
“ప్రభుత్వ బ్యాంకులలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండడంలేదు” అనే పేరుతో బ్యాంకు ఉద్యోగి రెడ్డిట్ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. “నేను అనారోగ్యంతో ఉండడంతో ఒక రోజు సెలవు తీసుకున్నాను. ఆ మరుసటి రోజు నాకు వార్నింగ్ మెయిల్ వచ్చింది. మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగం పొందడం అదృష్టంగా భావించే వారందరూ మళ్లీ ఒకసారి ఆలోచించండి” అని ఆయన పోస్టులో రాసుకొచ్చారు.
ఈ పోస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలలో కఠినమైన సెలవు విధానాలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల గురించి చర్చకు దారితీసింది. ఇటీవల మరో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగి షేర్ చేసిన రెడ్డిట్ పోస్ట్ కూడా వైరల్ అయింది. అందులో అతడు ఉద్యోగం నుండి తప్పుకోవడానికి దారితీసిన ఇబ్బందుల గురించి వివరించారు.
Also Read: BSNL 4G Network: రేపటి నుంచే దేశంలో 4జీ సేవలు ప్రారంభం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ
భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు భారీ పోటీ ఉంటుంది. ప్రభుత్వ సంస్థల్లో వాచ్ మ్యాన్ ఉద్యోగానికి సైతం లక్షల్లో దరఖాస్తులు వచ్చిన సందర్భాలు లేకపోలేదు. ఎంతో కష్టపడితే గానీ ప్రభుత్వ కొలువు సొంతం కాదు. రాత్రింబవళ్లు కష్టపడి ఉద్యోగం సాధిస్తుంటారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం సాధించాలంటే ఓ మహా తపస్సు చేయాల్సిందే. కలలు కన్న ఉద్యోగం సాధించి, ఆ రంగంలో అడుగుపెట్టిన వారు ఇప్పుడు వింత అనుభవాలను ఎదుర్కొంటున్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో ఒత్తిడికి గురవుతున్నారు.