Naxal Couple Arrested: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులపై జరుగుతున్న దర్యాప్తు.. మరింత వేగంగా ముందుకు సాగుతోంది. రాయ్‌పూర్‌లో ఇటీవల జరిగిన ప్రత్యేక ఆపరేషన్‌లో దర్యాప్తు సంస్థ (SIA) ఒక మావోయిస్టు జంటను అరెస్టు చేసింది.
అరెస్టైన వారు ఎవరు?
పోలీసులు అరెస్టు చేసిన జంట జగ్గు అలియాస్ రమేష్ కుర్సామ్ (28), అతని భార్య కమల (27). వీరు బీజాపూర్ జిల్లా గంగలూర్ ప్రాంతానికి చెందినవారు. సమాచారం మేరకు, జగ్గు కిడ్నీ సమస్యల చికిత్స కోసం రాయ్‌పూర్‌కి వచ్చి అంబేద్కర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదే అవకాశంగా తీసుకుని నగరంలో స్థిరపడేందుకు ప్రయత్నించాడు.
రహస్య ఆపరేషన్‌లో పట్టుబడిన జంట
SIAకి నిఘా వర్గాల ద్వారా ఈ జంటపై పక్కా సమాచారం అందింది. వెంటనే ఆపరేషన్ ప్రారంభించి.. రాయ్‌పూర్ DD నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంగోరభట్ ప్రాంతంలో.. వీరద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సమాచారాన్ని గోప్యంగా ఉంచారు పోలీసులు. రాజధాని భద్రత దృష్ట్యా ఈ జాగ్రత్త తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
నకిలీ ఆధార్‌తో అద్దె ఇల్లు
దర్యాప్తులో బయటపడిన కీలక అంశం ఏమిటంటే, ఈ జంట నకిలీ ఆధార్ కార్డును ఉపయోగించి.. DD నగర్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు.
జగ్గు గతంలో ప్రభుత్వ అధికారుల ఇళ్లలో గార్డుగా అలాగే డ్రైవర్‌గా పనిచేసినట్లు సమాచారం. ఈ విషయమే ఇప్పుడు నిఘా సంస్థలకు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే అలాంటి ఉద్యోగాల ద్వారా అధికారుల కదలికలు, భద్రతా వివరాలు మావోయిస్టులకు చేరే అవకాశం ఉంటుంది.
స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు
దాడి సమయంలో పోలీసులు జంట నివాసం నుంచి కొన్ని ముఖ్యమైన పత్రాలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ప్రస్తుతం ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఈ పత్రాల్లో పట్టణ నెట్‌వర్క్ వివరాలు, నిధుల లావాదేవీలు, మరికొన్ని కీలకమైన ఆదేశాలు ఉన్నాయనే అనుమానం ఉంది.
కోర్టు కస్టడీ & రిమాండ్
అరెస్టు తర్వాత కమలను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. జగ్గును మాత్రం పోలీసులు రిమాండ్‌కి తీసుకెళ్లి మరింత విచారణ జరుపుతున్నారు. జగ్గు నుండి మావోయిస్టుల పట్టణ కార్యకలాపాలపై.. మరింత సమాచారాన్ని సేకరించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.
పట్టణ నెట్‌వర్క్‌పై దర్యాప్తు
రాయ్‌పూర్‌లో మరికొందరు నక్సలైట్లు నకిలీ గుర్తింపులతో దాక్కుని ఉండవచ్చని. వీరు విద్య, వైద్య రంగాలను వాడుకుని తమ కార్యకలాపాలను కొనసాగించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
Also Read: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!
భవిష్యత్ చర్యలు
SIA ఇప్పుడు రాయ్‌పూర్ సహా ఇతర ప్రధాన పట్టణాల్లో కూడా.. ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. ఇటీవల పట్టుబడిన మొబైల్ ఫోన్లలోని కాంటాక్టు నెంబర్లు, కాల్ రికార్డులు, చాట్ హిస్టరీ ఆధారంగా మరిన్ని అనుమానితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.