Steel Spoons In Stomach: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చాడు. స్కానింగ్ తీసిన వైద్యులు షాక్ కు గురయ్యారు. ఆ వ్యక్తి కడుపులో స్టీల్ స్పూన్లు, టూత్ బ్రష్ లు, పెన్నులు చూసి షాకయ్యారు. డీ-అడిక్షన్ సెంటర్ లో చికిత్స తీసుకుంటున్న 40 ఏళ్ల సచిన్ కోపంతో స్పూన్లు, టూత్ బ్రష్ లు మింగేశాడని తెలుస్తోంది. అతడికి ఆపరేషన్ చేసి 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్‌లు, రెండు పెన్నులను తొలగించారు వైద్యులు.
బులంద్‌షహర్ కు చెందిన సచిన్ ను అతడి కుటుంబ సభ్యులు ఒక నెల క్రితం ఘజియాబాద్‌లోని ఒక డీ-అడిక్షన్ సెంటర్‌లో చేర్పించారు. అతనికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అల్ట్రాసౌండ్ స్కాన్‌లో అతడి కడుపులో లోహ వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో సెప్టెంబర్ 17న వైద్యులు ఆపరేషన్ చేశారు.
సచిన్ కడుపులోంచి తొలగించిన వస్తువుల సంఖ్య చూసి వైద్య బృందం షాక్‌కు గురైంది. అయితే అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో గురువారం డిశ్చార్జ్ చేశారు వైద్యులు. ఇలాంటి ప్రవర్తన మానసిక స్థితితో ముడిపడి ఉందని వైద్యులు తెలిపారు. మానసిక పరిస్థితి సరిగ్గా లేనివారు హానికరమైన వస్తువులను హఠాత్తుగా మింగేస్తారని చెప్పారు.
ఆందోళనలో ఆ వస్తువులను మింగినట్లు సచిన్ వైద్యులకు చెప్పారు. “నా కుటుంబ సభ్యులు నన్ను డీ-అడిక్షన్ కేంద్రంలోని వైద్యుడికి చూపించడానికి తీసుకెళ్లారు. కానీ నన్ను అక్కడే వదిలేశారు” అని అతడు చెప్పాడు. అయితే అక్కడి వాళ్లు తనను సరిగ్గా చూసుకోలేదని, ఆహారం అందించలేదన్నారు. దీంతో కోపం, నిస్సహాయక స్థితిలో తనను తాను గాయపరచుకోవడానికి వస్తువులను మింగడం ప్రారంభించానని సచిన్ వైద్యులతో చెప్పారు.
‘పునరావాస కేంద్రంలో రోగులకు చాలా తక్కువ ఆహారం ఇస్తారు. రోజులో కొన్ని చపాతీలు, కూరగాయలు ఇస్తారు. ఇంటి నుండి ఏదైనా వస్తే, చాలా వరకు మాకు చేరవు. కొన్నిసార్లు మాకు రోజులో ఒక బిస్కెట్ మాత్రమే ఇస్తారు’ అని సచిన్ వాపోయారు.
ఆహారం దొరక్క కోపంగా స్టీల్ స్పూన్లను దొంగిలించి, వాటిని బాత్రూంలోకి తీసుకెళ్లి ముక్కలుగా చేసి మింగినట్లు సచిన్ చెప్పారు. వైద్యులు ముందుగా ఎండోస్కోపీ ద్వారా వస్తువులను తొలగించడానికి ప్రయత్నించారు. కానీ అది సఫలం కాకపోయే సరికి, శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి వచ్చిందన్నారు.
Also Read: Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్
2022లో ఇలాంటి ఒక ఘటన యూపీలోని ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి కడుపు నుంచి 63 స్పూన్లు బయటతీశారు వైద్యులు. మత్తు పదార్థాలకు బానిసైన విజయ్ అనే వ్యక్తిని డీ-అడిక్షన్ సెంటర్‌లో చేర్పించారు. అతడు అక్కడ ఒక సంవత్సరం పాటు చెంచాలు తిన్నాడు. అయితే, పునరావాస కేంద్రంలోని సిబ్బంది అతనికి బలవంతంగా చెంచాలు తినిపించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.