UP CM Yogi: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ముస్లిం మత నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం యోగిని పాతిపెడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర బీడ్ లో శుక్రవారం జరిగిన ‘ఐ లవ్ మహమ్మద్’ ప్రోగ్రాంలో ముస్లిం మౌలానా ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై మౌలానా అష్పాక్ నిసార్ షేక్ దూషిస్తూ.. మాజల్‌గావ్‌లోని ముస్తఫా మసీదుకు రావాలని డిమాండ్ చేశారు. యోగి గనుక వస్తే అక్కడే పాతిపెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు చాలా రోజుల క్రితం చేసినప్పటికీ తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియోలపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ వీడియో ఉద్దేశపూర్వకంగా రూపొందించారా? ఏఐ టెక్నాలజీ వీడియోనా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇస్లాం మత ప్రవక్త మహమ్మద్ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ కాన్పూరులో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు ముస్లిం నేతలు ‘ఐ లవ్ మహమ్మద్’ ప్రచారం చేపట్టారు. మహమ్మద్ ప్రవక్తపై తమ విశ్వాసాన్ని చాటుకుంటూ ‘ఐ లవ్ మహమ్మద్’ అని రాసి ఉన్న బ్యానర్లు, పోస్టర్లు ప్రదర్శించారు. తమ వాహనాలకు ఈ స్టిక్కర్లు అతికించారు. అయితే కొన్ని హిందూ గ్రూపులు ఈ చర్యను మతసామరస్యాన్ని రెచ్చగొట్టే సంప్రదాయంగా విమర్శలు చేశాయి.
దీంతో పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించారని ముస్లిం నేతలపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. అనంతరం లక్నో, బరేలి, నాగపూర్, హైదరాబాద్‌లో శుక్రవారం ప్రార్థనల తరువాత ఈ తరహా ప్రదర్శనలు జరిగాయి. ముస్లిం యువకులు తమ వాహనాలపై ఐ లవ్ మహమ్మద్ అనే స్టిక్కర్లు అతికించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమ ప్రదర్శనలపై పోలీసు చర్య మత స్వేచ్ఛకు విరుద్ధమని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి.
‘ఐ లవ్ మహమ్మద్’ ఘర్షణలో బరేలీలో పోలీసులపై రాళ్లు రువ్విన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన అనేక వీడియోలు రికార్డ్ చేశామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బరేలీలో ‘ఐ లవ్ మహమ్మద్’ నిరసనలు, రాళ్ల దాడి తర్వాత భద్రతను కట్టుదిట్టం చేసి మార్కెట్లు మూసివేశారు.
‘ఐ లవ్ మహమ్మద్’ నిరసనపై యూపీ మంత్రి సురేష్ కుమార్ ఖన్నా మాట్లాడుతూ.. యోగి ప్రభుత్వంలో ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి అనుమతి లేదన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.