Jailer Marriage: ప్రేమకు కులమతాలే కాదు, హోదాలు, ప్రాంతాలు కూడా అడ్డుకావని మరోసారి నిరూపితమైంది. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో జరిగిన ఒక అరుదైన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక వైపు కటకటాల వెనుక జీవిత ఖైదు అనుభవిస్తున్న నేరస్థుడు, మరోవైపు చట్టాన్ని కాపాడే బాధ్యత కలిగిన జైలు అధికారిణి. వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ, అన్ని అడ్డంకులను అధిగమించి చివరకు పెళ్లి పీటల వరకు చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
నేరం నుంచి ప్రేమ వరకు..
ఈ కథలో కథానాయకుడు ధర్మేంద్ర సింగ్. 2007లో సత్నాలో జరిగిన మున్సిపల్ కౌన్సిలర్ కృష్ణ దత్ దీక్షిత్ హత్య కేసులో ధర్మేంద్ర ప్రధాన నిందితుడు. కోర్టు అతడికి జీవిత ఖైదు విధించడంతో సత్నా జైలుకు తరలించబడ్డాడు. అదే సమయంలో, ఫిరోజా ఖాతున్ అనే మహిళ అక్కడ అసిస్టెంట్ జైలరుగా విధుల్లో చేరారు. ఖైదీగా ఉన్న ధర్మేంద్ర ప్రవర్తనలో మార్పు రావడం, క్రమశిక్షణతో ఉండటం గమనించిన ఫిరోజా, అతనిపై సానుకూలత పెంచుకున్నారు. అది కాస్తా కాలక్రమేణా గాఢమైన ప్రేమగా మారింది.
మతం పట్టింపులు వీడి..
వీరి ప్రేమ ప్రయాణంలో అతిపెద్ద సవాలు మతం. ఫిరోజా ఖాతున్ ముస్లిం కావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక నేరస్థుడిని, అది కూడా వేరే మతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడం వారికి నచ్చలేదు. అయితే, ఫిరోజా మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. 2022లో ధర్మేంద్ర బెయిల్ మీద విడుదలైన తర్వాత కూడా వారి మధ్య బంధం కొనసాగింది. తన మనసు మెచ్చిన వాడి కోసమే జీవిస్తానని ఆమె కుటుంబానికి తెగేసి చెప్పారు.
హిందూ సంప్రదాయంలో వైభవంగా వివాహం
ఎదురైన ఆటంకాలన్నింటినీ ఎదిరించి, ఫిరోజా ఖాతున్ తన ప్రేమను గెలిపించుకున్నారు. మతపరమైన భేదాలను పక్కన పెట్టి, ధర్మేంద్ర సింగ్‌ను హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఫిరోజా కుటుంబం దూరం పెట్టినప్పటికీ, ధర్మేంద్ర స్నేహితులు మరియు బంధువులు ఈ పెళ్లికి అండగా నిలిచారు. ఇటీవల ఒక ఆలయంలో వీరి వివాహం అత్యంత వేడుకగా జరిగింది.
కన్యాదానం చేసిన బజరంగ్ దళ్ సభ్యులు
ఈ పెళ్లిలో మరో విశేషం ఏమిటంటే.. ఫిరోజా ఖాతున్ వైపు నుంచి కన్యాదానం చేసే వారు లేకపోవడంతో, బజరంగ్ దళ్ సభ్యులు ముందుకు వచ్చారు. వారే దగ్గరుండి పెళ్లి పనులు చూసుకుని, హిందూ సంప్రదాయం ప్రకారం ఫిరోజాకు కన్యాదానం చేసి పెద్దరికాన్ని పోషించారు. చట్టం దృష్టిలో దోషి అయినప్పటికీ, ఒక మనిషిగా ధర్మేంద్రలోని మార్పును చూసి ఫిరోజా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వీరి సాహసోపేతమైన ప్రేమ కథ మధ్యప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: అలర్ట్: కోవిడ్ కంటే స్పీడ్‌గా కొత్త వైరస్.. ఆ దేశాలన్నీ క్లోజ్? జర జాగ్రత్త మిత్రమా!