పుట్టినరోజున కేక్ కటింగ్ అనేది సహజం. ఆ తర్వాత ఫ్రెండ్స్ తో పార్టీలు, సోషల్ మీడియాలో ఫొటోలు ఇలా చాలా హంగామా ఉంటుంది. రాజకీయ నాయకుల స్టైల్ వేరేలా ఉంటుంది. వారి పుట్టునరోజులకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు తండోపతండాలుగా వస్తుంటారు, శుభాకాంక్షలు చెబుతుంటారు. పెద్ద పెద్ద కేక్ లు కట్ చేస్తుంటారు. మరి ప్రధానమంత్రి పుట్టినరోజు అంటే మాటలా? మామూలు రాజకీయ నాయకులందరికంటే అది ఇంకా గొప్పగా ఉండాలి, అతి పెద్ద కేక్ తో హడావిడి చేయాలి. కానీ మోదీ వాటికి దూరం. ఇప్పుడే కాదు, ప్రధానిగా ఆయన అధికారంలోకి వచ్చినప్పటినుంచి పుట్టినరోజు హడావిడికి దూరంగానే ఉన్నారు మోదీ. కనీసం కేక్ కటింగ్ కూడా చేయరు.
ఇంతకీ ఏం చేస్తారు?
పుట్టినరోజున కేక్ కట్ చేయరు కానీ, ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన ఉత్సాహం చూపిస్తుంటారు. తల్లి బతికి ఉన్నంత కాలం పుట్టినరోజున ఇంటికి వెళ్లి ఆమెను కలసి వచ్చేవారు. తల్లి చనిపోయాక పూర్తిగా ప్రజలతోనే ఆయన మమేకం అవుతున్నారు. 2014 నుంచి మోదీ పుట్టినరోజున జరిగిన కార్యక్రమాల్ని ఓసారి పరిశీలిస్తే ఆయన పుట్టినరోజున ఎంత నిరాడంబరంగా ఉంటారో అర్థమవుతుంది.
2014లో తన 64వ పుట్టినరోజు మోదీకి ఎంతో కీలకం. ప్రధానిగా అది ఆయనకు తొలి పుట్టినరోజు. ఆ రోజున తల్లి హీరాబెన్‌ను కలవడానికి అహ్మదాబాద్ నుండి గాంధీనగర్‌కు ఒంటరిగా ప్రయాణించారు మోదీ, ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ ఏడాది బీజేపీ ‘సేవా సప్తాహ్’ పేరుతో మోదీ పుట్టినరోజు వారోత్సవాలు చేసింది. దేశమంతా రక్తదాన శిబిరాలు, హెల్త్ క్యాంప్ లు ఏర్పాటు చేసింది. అయితే ఆ ఏడాది పార్టీ కార్యకర్తలంతా ఉత్సవాలకు దూరంగా ఉండాలని, వరద బాధిత జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని మోదీ పిలుపునిచ్చారు.
2015లో ఇలా..
2015లో తన 65వ పుట్టినరోజు సందర్భంగా మోదీ వికలాంగ పిల్లలతో సమయం గడిపారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కి చెందిన వికలాంగ పిల్లలను పిలిపించుకుని వారితో ముచ్చటించారు. 1965 భారతదేశం-పాకిస్తాన్ యుద్ధం యొక్క స్వర్ణోత్సవాన్ని గుర్తుచేసుకుంటూ ఏర్పాటు చేసిన శౌర్యాంజలి సైనిక ప్రదర్శనను తిలకించారు.
2016లో పుట్టినరోజు సందర్భంగా మోదీ తన తల్లి ఆశీర్వాదం కోసం గుజరాత్‌కు వెళ్లారు. దేశవ్యాప్తంగా బీజేపీ రక్తదాన శిబిరాలు, పరిశుభ్రతా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించింది. 2017లో కూడా తన తల్లి వద్దకు వెళ్లి ఆమె ఆశీర్వాదం తీసుకున్న మోదీ.. అదేరోజు సర్దార్ సరోవర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. అనంతరం దభోయ్‌లో జరిగిన బహిరంగ సభలో జాతీయ గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియంకు శంకుస్థాపన చేశారు. నర్మదా మహోత్సవ్ ముగింపు కార్యక్రమం కూడా అదే రోజు జరిగింది.
తొలిసారి తన నియోజకవర్గంలో..
ప్రధాని అయనన తర్వాత మోదీ 2018లో తొలిసారి తన నియోజకవర్గంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రార్థనలు చేశారు. కాశీ విద్యాపీఠ్ బ్లాక్‌లోని రోహనియాలోని నరూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు స్టేషనరీ, స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు.
2019లో తన పుట్టినరోజున గుజరాద్ లోని కెవాడియా వద్ద ఉన్న ఐక్యతా విగ్రహం వద్ద సభలో పాల్గొన్నారు మోదీ. నర్మదా ఆనకట్ట వద్ద పూర్తి స్థాయి జలాశయ మట్టానికి నీరు చేరుకున్న సందర్భంగా జరుపుకునే ‘నమామి నర్మదా’ ఉత్సవంలో పాల్గొన్నారు.
కొవిడ్ కారణంగా..
2020లో కొవిడ్ కారణంగా ప్రధాని మోదీ తన పుట్టినరోజున ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అయితే బీజేపీ మాత్రం సేవా సప్తాహ్ నిర్వహించింది. పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు బీజేపీ నేతలు. బ్లడ్ క్యాంప్స్, ఐ క్యాంప్స్ నిర్వహించారు. 2021లో మోదీ పుట్టినరోజు నాటికి కొవిడ్ టీకా వచ్చేసింది. మోదీ 71వ పుట్టినరోజున ఒకే రోజులో రికార్డు స్థాయిలో 2.26 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను ఇచ్చారు.
2022లో తన పుట్టినరోజున కునో నేషనల్ పార్క్ లో చీతాలను వదిలి పెట్టారు మోదీ. చీతా పునః పరిచయం ప్రాజెక్ట్ కింద మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించారు. 8 నమీబియన్ చిరుతలను విడుదల చేశారు.
2023లో మోదీ తన పుట్టినరోజు సందర్భంగా విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ‘పీఎం విశ్వకర్మ యోజన’ను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కళాకారుల్లో నైపుణ్యాలను పెంచేందుకు ఆర్థిక సాయం అందిస్తారు. ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (ఐఐసీసీ), ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్ విస్తరణ పనుల్ని ప్రారంభించారు. అదే రోజు వారణాసిలో మోదీ పుట్టినరోజు సందర్భంగా 73 కేజీల లడ్డూని పంచి పెట్టారు బీజేపీ నేతలు.
2024లో మోదీ తన పుట్టినరోజు సందర్భంగా ఒడిశాకు వెళ్లారు. అక్కడ పేదలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 26 లక్షల ఇళ్ల పంపిణీని ప్రారంభించారు. భువనేశ్వర్ సమీపంలోని మురికివాడను సందర్శించారు. మహిళల ఆర్థిక సహాయం, డిజిటల్ అక్షరాస్యత కోసం రూపొందించిన సుభద్ర యోజనను ప్రారంభించారు.
ఈ ఏడాది ఎలాగంటే..
ఈ ఏడాది కూడా మోదీ పుట్టినరోజున కేక్ కట్ చేయలేదు. ప్రసూతి, శిశు ఆరోగ్య సంరక్షణపై దృష్టిపెట్టారు. పోషకాహార లోపాన్ని ఎదుర్కోడానికి 8వ జాతీయ పోషకాహార మాసాన్ని ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాకు వెళ్లిన ఆయన ‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ను ప్రారంభించారు.