Uttarakhand Cloud Burst: ఉత్తరాఖండ్ మళ్లీ ప్రకృతి ఆగ్రహానికి గురైంది. రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ పరిసరాల్లో మంగళవారం తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ సంభవించింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు.. ఇప్పటికే పరిస్థితిని కష్టతరం చేశాయి. ఇప్పుడు క్లౌడ్ బరస్ట్ కారణంగా తంసూ నది ఉధృతంగా పొంగిపొర్లుతోంది. అధికారులు వెంటనే రెడ్ అలర్ట్ ప్రకటించారు.
వరదల ఉధృతి
క్లౌడ్ బరస్ట్ జరిగిన వెంటనే పరిసర ప్రాంతాల్లో.. వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా తంసూ నది రోడ్డుపైకి వచ్చి రవాణా పూర్తిగా ఆగిపోయింది. వరద ఉధృతికి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారని స్థానిక అధికారులు తెలిపారు. వారి ఆచూకీ కోసం ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్‌డిఆర్‌ఎఫ్ (SDRF) బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ఆస్తి నష్టం
వరద జలాలు నివాసాలు, దుకాణాలు, వాహనాలను ముంచెత్తాయి. డెహ్రాడూన్ సమీపంలోని పలు కాలనీలు పూర్తిగా మునిగిపోయాయి. దుకాణ సముదాయాలు నీటిలో మునిగి వ్యాపారస్తులకు భారీ నష్టం కలిగించింది. పలు కార్లు, బైక్‌లు కొట్టుకుపోయాయి.
విద్యాసంస్థలకు సెలవు
అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని.. జిల్లా కలెక్టర్ ఇవాళ డెహ్రాడూన్ సహా వరద ప్రభావిత ప్రాంతాల్లోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రతను కాపాడే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అధికారులు అప్రమత్తం
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టింది. రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అన్ని విభాగాలు హై అలర్ట్‌లో ఉన్నాయి. కుప్పకూలిన రహదారులను మరమ్మత్తు చేయడానికి.. రోడ్డు విభాగం బృందాలు పని చేస్తున్నారు. విద్యుత్ లైన్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో పవర్ సప్లై నిలిపివేశారు.
అధికారులు వరద ప్రభావిత గ్రామాల ప్రజలను.. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అవసరమైన చోట్ల రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఆహారం, తాగునీరు, ఔషధాలు అందించే ప్రయత్నం జరుగుతోంది.
ప్రజలకు హెచ్చరికలు
మెటిరియాలజికల్ డిపార్ట్‌మెంట్ ఇప్పటికే.. భారీ వర్షాలకు సంబంధించి హెచ్చరిక జారీ చేసింది. వచ్చే 24 గంటలు అత్యంత కీలకమని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని, నదుల, వాగుల దరిదాపుల్లోకి వెళ్లరాదని సూచించారు.
తరచూ విరుచుకుపడుతున్న ప్రకృతి
గత కొన్ని సంవత్సరాలుగా ఉత్తరాఖండ్ తరచూ క్లౌడ్ బరస్ట్, కొండచరియలు విరిగిపడటం, ఫ్లాష్ ఫ్లడ్స్ వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. హిమాలయ ప్రాంతం భూభాగ నిర్మాణం సున్నితంగా ఉండటంతో భారీ వర్షాలు పడినప్పుడు నష్టం ఎక్కువగానే ఉంటుంది.
ప్రజల్లో ఆందోళన
ఇప్పటికే వరదల ధాటికి ఇళ్లు కోల్పోయిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణ సహాయం అందాలని కోరుతున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇస్తున్నా, బాధితుల పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.
Also Read: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. 75 శాతం హాజరు కావాల్సిందే