Telangana Transgenders: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి.. సామాజిక న్యాయం వైపు ముందడుగు వేసింది. మెట్రో రైలు సర్వీసుల్లో ట్రాన్స్‌జెండర్లను.. సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
నియామక పత్రాల అందజేత
ఈ క్రమంలో సుమారు 20 మంది ట్రాన్స్‌జెండర్లకు.. నియామక పత్రాలను మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్లకు అవకాశాలు కల్పించడం మా ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం. సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన గౌరవం దక్కాలి అని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి దృక్పథం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ట్రాన్స్‌జెండర్ల అభివృద్ధి కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ పోలీసులుగా నియమించడం, వారికి వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు.. కల్పించడం వంటి కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.
ప్రయాణికులకు భద్రతతో పాటు అవగాహన
మెట్రోలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నారు. వారందరికీ సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు సెక్యూరిటీ బలగాల పాత్ర కీలకం. ట్రాన్స్‌జెండర్లను ఈ రంగంలో భాగం చేయడం ద్వారా ప్రభుత్వం రెండు ప్రయోజనాలను సాధిస్తోంది. ఒకవైపు ప్రయాణికులకు భద్రతా సేవలు అందుతుండగా, మరోవైపు ట్రాన్స్‌జెండర్లకు ఆత్మగౌరవం కలిగించే వృత్తి దొరుకుతోంది.
కృతజ్ఞతలు తెలుపుతున్న ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ
ఈ అవకాశాన్ని పొందిన ట్రాన్స్‌జెండర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఇంతకాలం సమాజం మమ్మల్ని విస్మరించింది. మాకు చిన్న చిన్న పనులు తప్ప పెద్ద అవకాశాలు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మా కోసం ముందుకు వచ్చి ఇలాంటి గౌరవప్రదమైన ఉద్యోగాలను ఇచ్చింది. ఇది మా జీవితాలను మార్చే అడుగు వారు చెబుతున్నారు.
సామాజిక సమానత్వానికి సంకేతం
తెలంగాణలో అమలవుతున్న ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలవనుంది. సాధారణంగా ట్రాన్స్‌జెండర్లు విద్య, ఉద్యోగాల్లో వెనుకబడి ఉంటారు. కానీ ప్రభుత్వం చూపుతున్న కట్టుబాటు వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంది.
Also Read: కొత్త పార్టీని ప్రకటించిన తీన్మార్ మల్లన్న
ట్రాన్స్‌జెండర్ల నియామకం కేవలం ఉద్యోగావకాశం మాత్రమే కాదు. అది ఆత్మగౌరవానికి, సమాజంలో గుర్తింపుకి ప్రతీక. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయంతో మళ్లీ ఒకసారి సమాజానికి గొప్ప సందేశం ఇచ్చింది.
ఈ చర్యతో ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో.. వెలుగులు నింపబడతాయనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని రంగాల్లో వారికి అవకాశాలు దక్కి, వారు సమాజంలో మరింత ప్రభావవంతంగా నిలుస్తారని నిపుణులు భావిస్తున్నారు.