Nupur Bora: పైన కనిపిస్తున్న మహిళ ఇంట్లో భారీగా డబ్బు, బంగారు దొరకడంతో అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఆమె గురించి చర్చించుకోవడం వెనుక అసలు మేటరేంటి? ఈ ఘటన అసొంలో వెలుగుచూసింది. అసొంకి చెందిన ఐఏఎస్ అధికారి నుపుర్ బోరా అరెస్ట్ అయ్యారు.
భూ కుంభకోణానికి సంబంధించి ఆరోపణల నేపథ్యంలో ఆమె ఇంట్లో పోలీసు అధికారులు సోదాలు చేపట్టారు. సోదాల్లో అధికారులకు కళ్లు చెదిరే వాస్తవాలు బయటపడ్డాయి. నుపర్ ఇంట్లో నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు దొరికాయి. వాటి విలువ అక్షరాలా రెండు కోట్ల రూపాయలని అంటున్నారు. ఇది కేవలం బయటకు కనిపించేవి మాత్రమే.
కనిపించకుండా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలీదని అంటున్నారు. సీఎం ప్రత్యేక విజిలెన్స్ సెల్ టీమ్‌లో నుపుర్ బోరా పని చేస్తున్నారు. గౌహతికి చెందిన ఆమెపై రకరకాల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. సీఎం హిమంత బిశ్వశర్మ ఆమెపై ఆరోపణలు చేశారు.
బార్పేట్ జిల్లాలో అధికారిగా ఉన్న సమయంలో డబ్బుకు బదులు భూమిని లంచంగా తీసుకున్నట్లు తేలింది. ఈ క్రమంలో ఆరు నెలలుగా ఆమెపై ప్రభుత్వం నిఘా ఉంచింది. సోమవారం ఉదయం ఆమెతోపాటు బంధువుల ఇళ్లు, మరో మూడు ప్రదేశాల్లో సోదాలు చేపట్టారు. రూ.90లక్షల నగదు, కోటి విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారన్నారు.
ALSO READ: ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్.. రెడ్ అలర్ట్ జారీ
ప్రస్తుతం ఆమెని అరెస్టు చేసి విచారిస్తున్నారు. నుపూర్ ఇంట్లో దొరికిన డబ్బు, నగలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నూపూర్ బోరా 2019లో సర్వీస్‌లో చేరిన అధికారి. మార్చి 31, 1989న జన్మించిన ఆమె, అస్సాంలోని గోలాఘాట్ జిల్లాకు చెందినవారు.
గౌహతి విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లం, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేసింది. కాటన్ కళాశాలలో చదువుకుంది. తొలుత ఆమె కామరూప్ జిల్లాలోని గోరోయిమారిలో సర్కిల్ ఆఫీసర్‌గా నియమించారు. సివిల్ సర్వీసులో చేరడానికి ముందు నూపుర్ బోరా డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్‌లో లెక్చరర్‌గా పని చేశారని ఆమె ఫేస్‌బుక్ ప్రొఫైల్ ద్వారా తెలుస్తోంది.
బోరా కొంతమంది నుండి డబ్బు తీసుకుని భూములను ఇతరులకు బదిలీ చేసినట్లు ఆరోపణలున్నాయి. స్థానిక ఉద్యమ సంస్థ ఆమె అవినీతిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. నుపూర్ సహాయకుడిగా పని చేసిన లాట్ మండల్ని అధికారులు విచారిస్తున్నారు. మరి పోలీసుల విచారణలో బోరా గురించి ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.