PM Modi: మహిళా రిజర్వేషన్ బిల్లుపై జాతినుద్దేశించి ప్రధాని మోదీ శనివారం రాత్రి మాట్లాడారు. ఈ ప్రసంగంలో ప్రతిపక్షాలపై మండిపడ్డారు. మహిళల కోసం చేసిన తమ ప్రయత్నాన్ని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ‘భ్రూణహత్య’ చేశాయని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే వంటి పార్టీలే ఈ దురాగతానికి పాల్పడ్డాయన్నారు. వారంతా కలిసి రాజ్యాంగానికి, మహిళలకు వ్యతిరేకంగా నేరం చేశారన్నారు. ఈ పాపం ప్రతిపక్షాలను వదిలిపెట్టదన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ..”మహిళా రిజర్వేషన్‌ను వ్యతిరేకించడం ద్వారా కాంగ్రెస్ మరోసారి సంస్కరణల వ్యతిరేక పార్టీ అని నిరూపించుకుంది. 21వ శతాబ్దపు వికసిత భారత్‌కు అవసరమైన అన్ని నిర్ణయాలను, సంస్కరణలను, దేశం అవసరమైన ఏ నిర్ణయాలనైనా కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. వాటిని తిరస్కరించి, అడ్డంకులు సృష్టిస్తుంది. ఇదే కాంగ్రెస్ చరిత్ర, ప్రతికూల రాజకీయాలు” అని తీవ్ర విమర్శలు చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు సవరణలు చేసేందుకు అవసరమైన బిల్లును శుక్రవారం లోక్‌సభలో ఆమోదం పొందలేకపోయింది. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026ను ఆమోదించడానికి కేంద్రానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం కాగా, బీజేపీ తమ మద్దతుదారులతో ఆ మార్కును చేరుకోలేకపోయింది. ప్రతిపాదిత ఈ చట్టానికి అనుకూలంగా 298 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 230 మంది ఎంపీలు ఓటు వేశారు.
లోక్‌సభ సభ్యుల సంఖ్యను 543 నుంచి 850కి పెంచి, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును తీసుకొచ్చింది. గురువారం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లులు, డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. అయితే, రాజ్యాంగ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందలేదు. దీంతో మిగిలిన రెండు బిల్లులను ఓటింగ్‌కు పెట్టలేదు.
ఈ సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రధాని మోదీ ‘మహిళందరికీ’ క్షమాపణ చెప్పారు. మహిళల పురోగతిని కాంగ్రెస్ ఎలా అడ్డుకుందో దేశమొత్తం చూసిందన్నారు. ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, విజయం సాధించలేకపోయామన్నారు. నారీ శక్తి అధినియమ్‌లో సవరణలు చేయలేకపోయామన్నారు. అందుకు తాను దేశంలోని మహిళలందరికీ క్షమాపణలు చెబుతున్నానని ప్రధాని మోదీ అన్నారు.
Also Read: విపక్షాలు తప్పు చేశాయ్.. పర్యవసానాలు తప్పవు.. ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరిక
కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీల స్వార్థ రాజకీయాల కారణంగా దేశంలోని మహిళలు బాధపడుతున్నారని మోదీ అన్నారు. “మాకు దేశ ప్రయోజనాలే ముఖ్యం. కానీ కొందరు జాతీయ ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దాని పర్యవసానాలను మహిళలు, దేశం భరించాల్సి వస్తుంది. ఈసారి కూడా అదే జరిగింది. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ వంటి పార్టీల స్వార్థ రాజకీయాలతో మహిళలు నష్టపోయారని అన్నారు.