Economic Crisis: ప్రస్తుతం దేశ ఆర్థిక ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. కేవలం 48 గంటల వ్యవధిలో వెలుగులోకి వచ్చిన మూడు కీలక పరిణామాలు భారత మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. బంగారం ధరల పెరుగుదల నుంచి పాల విక్రయాల వరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల ప్రభావం భారత్‌పై ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తున్నాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని కఠిన నిర్ణయాలు ఉండబోతున్నాయనే సంకేతాలు వెలువడుతుండటం ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
బంగారంపై సుంకం వాత.. సామాన్యుడి పెళ్లి కలలకు బ్రేక్?
దేశంలో పసిడి ప్రేమికులకు ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని ఏకంగా 15 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయం మార్కెట్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండుతుండటంతో, విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోకుండా కాపాడుకోవడమే దీని వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్. విలాసవంతమైన దిగుమతులను తగ్గించి, రూపాయి విలువ పడిపోకుండా అడ్డుకట్ట వేయాలని కేంద్రం భావిస్తోంది. అయితే, పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిపై తీవ్ర ప్రభావం చూపనుంది.
పాల సెగ.. వంటింట్లో మొదలైన ‘ధరల’ మంట!
నిత్యావసరాల్లో అత్యంత కీలకమైన పాలు ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారాయి. అమూల్, మదర్ డెయిరీ వంటి దిగ్గజాలు లీటరుకు రూ. 5 వరకు ధరలను పెంచడం ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోసినట్లయింది. రవాణా ఖర్చులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని ఆయా సంస్థలు చెబుతున్నప్పటికీ, దీని వెనుక ఉన్న అసలు ముప్పు ఇంధన ధరలే. డీజిల్ ధరల ప్రభావం రవాణా రంగంపై పడటంతో, పరోక్షంగా పాలు, కూరగాయల వంటి నిత్యావసరాల ధరలు సామాన్యుడి బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి.
చక్కెర ఎగుమతులపై నిషేధం..
దేశీయంగా చక్కెర ధరలు ఆకాశాన్ని తాకకుండా ఉండేందుకు ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు ఎగుమతులపై ఉక్కుపాదం మోపింది. ముడి, శుద్ధి చేసిన చక్కెర విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవడం ద్వారా, స్థానిక మార్కెట్లో సరఫరాను పెంచి ధరలను అదుపులో ఉంచాలన్నది ప్రభుత్వ వ్యూహం. ఎన్నికల తదనంతర పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండాలంటే ఇలాంటి ‘ప్రొటెక్షనిజం’ చర్యలు తప్పనిసరని అధికారులు విశ్లేషిస్తున్నారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో భారత్ నుంచి సరఫరా ఆగడం వల్ల గ్లోబల్ ప్రైసెస్ పెరిగే ప్రమాదం ఉంది.
ముంచుకొస్తున్న ముడి చమురు గండం.. నెక్స్ట్ పెట్రోల్ వంతేనా?
ప్రస్తుతం దేశమంతా ఎదురుచూస్తున్న అతిపెద్ద ప్రశ్న.. ‘పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?’ అనేది. ప్రధాని మోదీ స్వయంగా ఇంధన పొదుపు గురించి మాట్లాడటం, వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి సూచనలు చేయడం చూస్తుంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ హెచ్చరించినట్లుగా, పశ్చిమాసియా సంక్షోభం గనుక ముదిరితే చమురు దిగుమతులు భారత్ ఆర్థిక వెన్నెముకను దెబ్బతీసే అవకాశం ఉంది. ప్రస్తుతం చమురు సంస్థలు భరిస్తున్న నష్టాలను ఎంతకాలం ప్రభుత్వం భరించగలదనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
ప్రభుత్వ వ్యూహం.. ప్రజల సిద్ధత.. రాబోయేది గడ్డుకాలమేనా?
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి వ్యాఖ్యలు ఇటు ఊరటనిస్తూనే, మరోవైపు హెచ్చరికగా కనిపిస్తున్నాయి. “ధరలు పెరగవని నేను చెప్పడం లేదు” అని ఆయన అనడం భవిష్యత్తులో ధరల సవరణకు పరోక్ష సంకేతంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ప్రభుత్వం కేవలం ‘డిమాండ్ మేనేజ్మెంట్’ (పొదుపు చర్యలు) ద్వారా గండం గట్టెక్కాలని చూస్తోంది. కానీ, గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ ధర గనుక అదుపు తప్పితే, దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించకముందే ఇంధన ధరల బాదుడు మొదలయ్యే అవకాశం పుష్కలంగా ఉందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: దేవాస్ ఫ్యాక్టరీలో అగ్నిప్రళయం.. భారీ శబ్దంతో దద్దరిల్లిన పరిసరాలు.. నలుగురు కార్మికుల దుర్మరణం!