Korean Action Comedy Series OTT : ఒకప్పుడు దేశం కోసం ప్రాణాలకు తెగించి రహస్య ఆపరేషన్లు చేసిన వ్యక్తి, ఇప్పుడు హోటల్ లో వంటలు చేస్తుంటే ఎలా ఉంటుంది… శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన యోధుడు సాధారణ ఉద్యోగిగా బతుకుతుంటే… మాఫియా ప్రపంచంలో తనకంటూ ఓ పేరు సంపాదించుకున్న వ్యక్తి చిన్న దుకాణం నడుపుకుంటూ కాలం గడుపుతుంటే… వీళ్లంతా మళ్లీ తమ గతంలోకి అడుగు పెట్టాల్సి వస్తే కథలో అసలు ఆట మొదలవుతుంది. వయసు పెరిగినా పాత నైపుణ్యాలు, యాక్షన్, కామెడీతో తెరకెక్కిన దక్షిణ కొరియా సిరీస్ ‘ఫిఫ్టీస్ ప్రొఫెషనల్స్’ (Fifties Professionals).
ఈ కథ ముగ్గురు మధ్య వయస్కులైన వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. జియోంగ్ హో మియోంగ్ ఒకప్పుడు దేశ గూఢచారి విభాగంలో అత్యంత సమర్థుడైన రహస్య ఏజెంట్ అతను. ఎలాంటి ప్రమాదకరమైన ఆపరేషన్నైనా పూర్తి చేయగల నైపుణ్యం అతని సొంతం. కానీ పదేళ్ల క్రితం జరిగిన ఓ రహస్య ఆపరేషన్ విఫలమవడంతో అతని జీవితం తలకిందులవుతుంది. ఆ ఘటన తర్వాత అతనిపై దేశద్రోహి అనే ముద్ర పడుతుంది. తన పాత గుర్తింపును పక్కన పెట్టి, ఇప్పుడు ఓ రెస్టారెంట్లో వంటవాడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంటాడు.
ఒకప్పుడు దేశ భద్రతకు సంబంధించిన కీలక పనులు చేసిన వ్యక్తి, ఇప్పుడు కుటుంబ అవసరాలు తీర్చేందుకు రోజంతా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే పదేళ్ల క్రితం జరిగిన ఆపరేషన్ తాలూకు జ్ఞాపకాలు అతడిని పూర్తిగా విడిచిపెట్టవు. ఆ సమయంలో మాయమైన ఓ కీలక వస్తువు గురించి నిజం బయట పడితే తన జీవితాన్ని మార్చేసిన ఘటన వెనుక ఉన్న రహస్యాలు కూడా వెలుగులోకి వస్తాయని అతడు భావిస్తాడు.
మరోవైపు బాంగ్ జే సన్ ఒకప్పుడు ఉత్తర కొరియాకు చెందిన శక్తిమంతమైన ప్రత్యేక యోధుడు. శత్రువులను ఎదుర్కోవడం, రహస్యంగా చొరబడటం, చేతితో పోరాడటంలో అతనికి మంచి నైపుణ్యం ఉంటుంది. కానీ ఓ ఆపరేషన్ సమయంలో జరిగిన పరిణామాలు అతని జీవితాన్ని మార్చేస్తాయి. జ్ఞాపకశక్తిని కోల్పోయిన అతడు ఇప్పుడు ఉక్కు కర్మాగారంలో సాధారణ ఉద్యోగిగా పని చేస్తుంటాడు. అక్కడ కూడా యజమాని వేధింపులను ఎదుర్కొంటూ తన జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. తనలో ఒకప్పుడు ఉన్న అసాధారణ సామర్థ్యాలను గుర్తించలేని స్థితిలో అతని జీవితం సాగుతుంది.
ఇక గాంగ్ బామ్ ర్యోంగ్ గతంలో నేర ప్రపంచంలో పేరున్న ముఠాకు కీలక నాయకుడిగా వ్యవహరించాడు. అతని మాటకు ఒకప్పుడు ఎంతో విలువ ఉండేది. కానీ ఇప్పుడు చిన్న దుకాణం నడుపుకుంటూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. గతాన్ని వెనక్కి వదిలేసినట్టు కనిపించినా, అతనిలోని అనుభవం, పాత పరిచయాలు మాత్రం పూర్తిగా మాయమవ్వలేదు.
పదేళ్ల క్రితం జరిగిన రహస్య ఆపరేషన్కు సంబంధించిన కీలక వస్తువు కోసం ఈ ముగ్గురి జీవితాలు మళ్లీ కలుస్తాయి. తమ గతాన్ని వెంటాడుతున్న ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడానికి కలిసి పని చేయాల్సి వస్తుంది. అప్పట్లో ఏం జరిగింది ? తమ జీవితాలు తలకిందులవడానికి కారణమైనది ఎవరు ? ఆ రహస్య వస్తువు వెనుక ఉన్న అసలు విషయం ఏమిటి ? పదేళ్ల క్రితం జరిగిన ఆపరేషన్ వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఆ ముగ్గురి జీవితాలను మార్చేసిన కుట్రలో అసలు దోషి ఎవరు? తమ పాత సామర్థ్యాలను ఉపయోగించి నిజాన్ని బయటపెట్టగలరా? ఈ ప్రశ్నలకు సమాధానాలు సిరీస్ లో చూడాల్సిందే.
Also Read : భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్కు కొత్త యానిమే ట్రీట్
‘ఫిఫ్టీస్ ప్రొఫెషనల్స్’ దక్షిణ కొరియా యాక్షన్ కామెడీ సిరీస్. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో తెలుగు ఆడియో అందుబాటులో ఉంది. పాత జీవితాన్ని వదిలేసి సాధారణ మనుషులుగా మారిపోయిన ముగ్గురు వ్యక్తులు, తమ గతం మళ్లీ ఎదురైనప్పుడు ఎలా స్పందిస్తారనే ఆసక్తికరమైన అంశంతో ఈ సిరీస్ సాగుతుంది. యాక్షన్తో పాటు హాస్యం, రహస్యాలు కలిసిన కథలను ఇష్టపడేవారికి ఈ సిరీస్ నచ్చవచ్చు. హాన్ డోంగ్ హ్వా (Han Dong-hwa) దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో షిన్ హా క్యున్ (Shin Ha-kyun), ఓ జంగ్ సె (Oh Jung-se), హియో సంగ్ టే (Heo Sung-tae) ప్రధాన పాత్రల్లో నటించారు.