అంచెలంచెలుగా ఎదిగాడు. ఇప్పుడు ఒంటరివాడిని చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో కాదు.. ఆ పార్టీ నేతలే! బండి సంజయ్‌కు బయట పార్టీలనే కాదు.. ఇంటిపార్టీలో కూడా శత్రువులున్నారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. అంతా అతనికి బద్ద శత్రువులే. కారణం బండి.. తనకంటూ ఓ ప్రత్యేక శైలిని అలవర్చుకోవడం. రాష్ట్రంలో ఏ అంశాన్నైనా తన రాజకీయ కోణంలో ఖండించడం… దూకుడుగా వ్యవహరించడం.. ఇదే అతనికి ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. బండి సంజయ్ ఏదైనా ఆందోళన చేయాలన్నా.. ఇతర పార్టీ నేతలకు కౌంటర్ ఇవ్వాలన్నా అధిష్టానం పిలుపు ఇచ్చే దాకా.. వచ్చేదాకా ఆగే పరిస్థితి లేదు. అంతే తనకు తాను క్షణాల్లో డిసైడ్ అవుతాడు. మీడియా ముందు ప్రత్యక్షమవుతాడు. సందర్బోచితంగా మాట్లాడుతాడు. తిట్టేస్తాడు. సూటిగా విమర్శలు ఈటెల్లా గుచ్చుకునేలా చేస్తాడు. క్షణాల్లో ఆ వార్త వైరల్ అయిపోతుంది.
ఇక దీనిపై ఏమీ చేయాలని నిస్సహాయ స్థితిలో అధిష్టానం చూస్తుండిపోతుంది. బీజేపీ అంటే బండి సంజయ్… బండి సంజయ్ అంటే బీజేపీ… అనే రీతిలో అతని దోరణి ఉంటుంది. దీంతో హేమాహేమీలుగా తమకు తాము చెలామణి అయ్యే కొంత మంది లీడర్లకు, సీనియర్లుగా చెప్పుకునే ఆ పార్టీ నేతలకు ఇది మింగుడు పడలేదు. దీనిపై చాలా సార్లు అధిష్టానానికి చెప్పి చూశారు. కానీ అధిష్టానం కూడా వద్దని వారించలేదు.. పరోక్షంగా ప్రోత్సహించినట్టే చేసింది. రాష్ట్రంలో ఉనికి అంతంత మాత్రంగానే ఉన్న పార్టీకి కనీసం ఈ విధంగానైనా జవజీవాలందుతాయోమోనని ఎదురుచూసింది. అధిష్టానం ఆశించిందే చాలా సందర్బాల్లో నిజమైంది కూడా. దీంతో అధిష్టానం వద్ద బండి సంజయ్ పరపతి పెరిగింది.
ఇది సీనియర్లకు మరింత కడుపు మంటనే మిగిల్చింది. అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న బండి పట్ల ఈర్ష్య , అసూయ పెంచుకుంటూ పోయారు. ఎడముఖం పెడముఖంగా ఉంటూ వచ్చారు. బండికి రాష్ట్ర పగ్గాలిచ్చిన తరువాత ఇక పార్టీలో తమ ఉనికే క్రమంగా గల్లంతయి.. అంతా బండి జపమే చేస్తారా? అనే దాకా పోయింది పరిస్థితి. అతన్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తరువాతే ఊపిరి పీల్చుకుంది సీనియర్ల గణం. కానీ బండి ఎక్కడా తగ్గలేదు. ఫ్లాట్‌ఫామ్ ఏదైనా .. తనదైన గొంతును వినిపించే విషయంలో వెనక్కి తగ్గలేదు. కార్యకర్తల అంచనాలకు ఎప్పుడూ తగ్గి ప్రవర్తించలేదు. వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు.. పార్టీకి జవజీవాలందించేందుకు నిత్యం రాజకీయాల్లో లైవ్‌గా ఉండే లీడర్‌గా బండికి పేరుంది. తనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చినా.. జాతీయ రాజకీయాలపై ఎప్పుడూ మక్కువ చూపలేదు.
వాటిపై స్పందించిన దాఖలాలూ లేవు. రాష్ట్ర రాజకీయాలపై .. అదీ కేసీఆర్, కేటీఆర్‌లపై బండి విసిరే విమర్శనాస్త్రాలు కాంగ్రెస్ నేతల వల్ల కూడా కాలేదు. ఒంటి చేత్తో రాష్ట్ర పార్టీ ఉనికిని కాపాడటంతో పాటు… పార్టీని బలపేతం చేసేందుకు పన్నే వ్యూహాలు కూడా కరుడుగట్టిన కార్యకర్తలకు నచ్చేవి. అందుకే అతని వెంట కలిసి నడిచేందుకు ఇష్టపడేవారు. తమకు పేరు రావాలె.. నేను కదా సీనియర్.. నాకు సమచారం లేదు.. నన్ను అడిగి కదా మట్లాడాలి.. ! అని పార్టీ లైన్, నిబంధనలుతో అడ్డు తగిలినా బండి డోన్ట్ కేర్ అనడం .. ఆ పార్టీలోని సీనియర్లకు మరింత కడపుమంటను రాజేసింది. ఈ క్రమంలో అతనితో పార్టీ పరమైన వైరుధ్యం కంటే.. వ్యక్తిగత వైరుధ్యాన్నే ఎక్కువ పెంచుకున్నారు.
తమకు రావాల్సిన క్రెడిబిలిటీ బండి అప్పనంగా కొట్టేస్తున్నాడనేది వారి కోపానికి, ఈర్ష్యకు ప్రధాన కారణంగా ఉండేది. ఇప్పుడు కొడుకు కేసు విషయంలో కూడా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు చలిమంటలు కాసుకుంటున్నారే తప్ప.. నష్ట నివారణకు దిగడం లేదు. పైపెచ్చు ఆఫ్ ది రికార్డుగా బండి సంజయ్‌కు మరింత డ్యామేజీ కావాలనేది వారి ఆశగా కనిపిస్తున్నది ప్రస్తుతం. కానీ కార్యకర్తలు బండి సంజయ్ పట్ల ఉన్న క్రేజ్‌ను ఏ మాత్రం తగ్గించుకోలేదు. అధిష్టానం కూడా అంతే. కేసు విషయం బయటకు పొక్కి బీఆరెస్ దీన్ని రచ్చ రంబోలా చేసినా… స్వయంగా మోడీ సభా వేదికగా.. అప్పటి దాకా ఏ నేత స్పీచ్‌కు ముందు రాని ఈలలు, కేరింతలు, నినాదాలు.. అక్కడ బండి సంజయ్‌కే వచ్చాయి. నివ్వెరపోవడం సీనియర్ల వంతైంది. ఇప్పటికీ అమిత్ షాకు బండి సంజయ్‌పై అపారమైన నమ్మకం ఉంది. ఇప్పుడు బండి భవితవ్యం కూడా ఆయన చేతుల్లోనే ఉందంటున్నారు ఆయన అభిమానాలు, కషాయ దళం..