రాష్ట్రమంతా బీజేపీ పార్టీది ఓ తీరైతే. నిజామాబాద్ జిల్లాలో మరో తీరుగా మారింది. ఇక్కడ బీజేపీని అర్వింద్ బీజేపీకిగా పిలుస్తారట. కారణం… అంతా ఆయనదే పెత్తనం. ఎప్పుడైతే కవితపై ఎంపీగా గెలిచాడో అప్పట్నుంచి తన వల్లే పార్టీ ఇంతలా పెరిగిందని, బలోపేతమైందని బాహాటంగానే ఆయన కామెంట్స్ చేస్తున్నారు.
మొదటిసారి ఎంపీగా గెలిచిన తరువాత అక్కడంతా అర్వింద్ బీజేపీనే స్ట్రాంగ్ అవుతూ వస్తోందట. సీనియర్లకు, హార్డ్‌కోర్ బీజేపీ శ్రేణులకు ఇందూరు అర్వింద్ బీజేపీలో స్థానం దొరకడం లేదు. ఓ రకంగా మెడలు పట్టుకు బయటకు గెంటేసిన చందంగానే మారిందట అక్కడి పార్టీ పరిస్థితి. సీనియర్ నేత, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనాయరణను పార్టీ నుంచే బయటకు వెళ్లగొట్టినంత పనిచేశాడని ప్రచారం ఉంది.
గడిచిన ఎన్నికల్లో పార్టీకి ఏమాత్రం ఉనికి లేని బాన్సువాడ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పంపించేశాడు. ఆ తరువాత జిల్లా బీజేపీ కమిటీలో ఆయనకు ప్రయార్టీ ఇవ్వలేదు. స్టేట్ పార్టీలో పదవి ఇవ్వడం మూలంగా హైదరాబాద్‌కే ఆయనను పరిమితం చేసి.. ఆయన వర్గాన్ని కూడా తొక్కేశాడనే కామెంట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే..నిజామాబాద్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో రెండు చోట్ల బీజేపీ గెలిచింది. నిజామాబాద్ అర్బన్ నుంచి ధన్‌పాల్ సూర్యనారయణ, ఆర్మూర్ నుంచి పైడి రాకేశ్‌రెడ్డి గెలిచారు.
అయితే కొద్ది రోజుల్లోనే వీరంటే అర్వింద్‌కు గిట్టలేదంట. ఇంకేముంది..? వీరిని దూరం పెట్టేశారాయన. ఏ పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదు. వారంతట వారే వచ్చి.. అయ్యా బాంచన్ అనే విధంగా వంగి వంగి సలాములు కొడితే ఓకే. మీరెలా చెబితే అలా.. మీ మాట జవదాటం అనే వంగి ఉంటే సరే. కానీ ఈ ఇద్దరూ అలా చేయడం లేదట. అందుకే ఆయనకు అంత కోపం. అందుకే వీరిద్దరూ ఇప్పుడు అర్వింద్‌తో టచ్ మీ నాట్ లాగే ఉంటున్నారట.
ధన్ పాల్ సూర్యనారాయణ కొంతలో కొంత నాయమట. కలుపుకుని పోయేందుకు .. పిలవని పేరంటానికి వెళ్లినట్టు వెళ్లి వస్తున్నారట. కానీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డైతే.. అర్వింద్ అయితే నాకేంటీ? ఎంపీ అయితే నాకేంటీ? నాకు విలువనియ్యనప్పుడు నేనెందుకు అతన్ని కలవాలి? అని తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నాడట.
రానున్న రోజుల్లో వీరిద్దరికీ టికెట్ల వస్తాయా? అర్వింద్ చేతిలోనే ఆ పార్టీ బంధీ అయి ఉన్న సమయంలో .. టికెట్లు ఇచ్చే అవకాశం లేదనే వాదనలు ఇప్పట్నుంచే ఆ ఇందూరు బీజేపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే గతంలో ఓసారి తనకు బీజేపీ టికెట్ కేటాయించకపోతే.. పార్టీ ఆఫీసుపైనే రాళ్ల దాడి చేయించిన నేపథ్యం ధన్‌పాల్ సూర్యనారాయణకు ఉంది.
కొత్తగా పైడి ఎమ్మెల్యే అయినా.. ఢిల్లీ పెద్దలతో సంబంధాలున్నాయి. టికెట్ ఎలా రాదో చూసుకుంటాను… నేనే పార్టీని వదిలి పెట్టి పోయేదే లేదు.. ! అని బాజాప్తా తన అనుచరగణంతో చెప్పేస్తున్నారట.