మొబైల్ మార్కెట్ లో రోజుకో కొత్త మోడల్ సందడి చేస్తుంది. కొత్త మోడల్స్, కొత్త ఫీచర్స్.. ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇక ఐఫోన్ల సంగతి చెప్పేదేముంది. ఏడాదికేడాది సరికొత్త ఫీచర్స్ తో ఐఫోన్లు మార్కెట్లోకి వస్తుంటాయి. ధరలో కూడా కొత్త మోడళ్లదే పైచేయి. ధర విషయంలో రాజీపడలేనివారు కొత్త మోడల్స్ కొనుక్కుంటారు. మరి బడ్జెట్ లెక్కలు వేసుకునేవారు ఏం చేయాలి..? కంపెనీ విషయంలో రాజీ పడాలి. చైనా కంపెనీలతో సరిపెట్టుకోవాలి. కానీ వారికో బెస్ట్ ఆప్షన్ ఉంది. అదే సెకండ్ హ్యాండ్ ఫోన్స్. ఐఫోన్లతో సహా అన్ని ఫోన్లు ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో దొరుకుతున్నాయి. సెకండ్స్ అంటే పనికి రానివి అంటగడతారనుకుంటే పొరపాటే. ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ లలో చాలా వరకు పాత ఫోన్లు ఆకర్షణీయమైన ధరతో, పూర్తి నాణ్యతతో దొరుకుతున్నాయి. అయితే ఏ ఫోన్ అయినా సెకండ్స్ లో తీసుకోవాలంటే ఆరు విషయాలను గమనించాలి.
1. నమ్మకమైన విక్రేతల ఎంపిక..
సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకోవాలంటే నమ్మకమైన అమ్మకందారుల్ని ఎంపిక చేసుకోవాలి. ఇంటర్నెట్ లో ఏ సైట్ పడితే ఆ సైట్ లో ఫోన్లు కొనకూడదు. బయట మన ఫ్రెండ్స్ చెప్పారని, లేదా ఊరూ పేరూ లేని షాప్ లో సెల్ ఫోన్లు తీసుకోకూడదు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి నమ్మకమైన ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ లో లభించే సెకండ్ హ్యాండ్ ఫోన్స్ ని కొనడం మంచిది.
2. కస్టమర్ రివ్యూ..
ఆన్ లైన్ పోర్టల్స్ లో ఫోన్లు కొనే సమయంలో కస్టమర్ల రివ్యూలు ఇంపార్టెంట్. అయితే ఇటీవల ఈ రివ్యూలు కూడా ఆయా కంపెనీలు తమకి అనుకూలంగా మార్చుకుంటున్నాయి. అయితే దారుణంగా రివ్యూ ఉంటే మాత్రం ఆ ప్రోడక్ట్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. రివ్యూలు బాగుంటే వాటివైపు మనం కూడా ఓ లుక్కేయొచ్చు.
3. రిటర్న్ పాలసీ..
ఏ వస్తువు అయినా రిటర్న్ పాలసీ బాగుంటేనే దాన్ని మనం నమ్మకంగా కొనొచ్చు. ఒకవేళ అది మనకు నచ్చకపోయినా వెంటనే తిరిగి ఇచ్చేయవచ్చు. రిటర్న్ పాలసీ బాగుంటేనే ఆర్థికంగా మనం నష్టపోకుండా ఉంటాం. ఒకవేళ సెకండ్ హ్యాండ్ ఫోన్ మనల్ని ఇబ్బంది పెట్టినా, వెంటనే దాన్ని రిటర్న్ చేసి మనం సేఫ్ అవ్వొచ్చు.
4. బ్యాటరీ లైఫ్..
సెకండ్ హ్యాండ్ ఫోన్ విషయంలో ప్రధానంగా చెక్ చేయాల్సింది బ్యాటరీ. రీ ఫర్బిష్డ్ ఫోన్లలో ఎక్కువగా కొత్త బ్యాటరీలు ఉపయోగిస్తున్నారు. వాటికి వారంటీ కూడా ఇస్తున్నారు. సో ఫోన్ రీఫర్బిష్డ్ అని వెనకడుగు వేయొద్దు. బ్యాటరీకి వారెంటీ ఉంటే మాత్రం తక్కువ రేటులో మంచి మోడల్ మనం సెలక్ట్ చేసుకోవచ్చు.
5. లేటెస్ట్ మోడల్ అవునా కాదా..?
సెకండ్ హ్యాండ్ ఫోన్ అయినా కూడా లేటెస్ట్ మోడల్ తీసుకోవడం బెస్ట్. లేకపోతే ఒకవేళ రిపేర్ వస్తే వాటి విడిభాగాలు లభించడం చాలా కష్టం. అందుకే పాత ఫోన్ కొన్నా.. ఆయా కంపెనీల లేటెస్ట్ వెర్షన్లు తీసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. కొత్త మోడల్స్ మోజులో.. అప్పటి వరకు తాము వాడిన ఫోన్లను సెకండ్ హ్యాండ్ సేల్స్ లో పెడుతుంటారు చాలామంది. అవి కూడా లేటెస్ట్ మోడల్సే కానీ, కొత్త మోడల్ రావడంతో అవి పాతబడిపోతుంటాయి. అలాంటి వాటిని మనం సెలక్ట్ చేసుకోవాలి.
6. ఇక చివరిది, ముఖ్యమైనది.. నీటి వల్ల ఫోన్ డ్యామేజ్ అయిందా లేదా తెలుసుకోవడం. చాలామంది ఫోన్ నీటిలో పడి డ్యామేజ్ అయితే దాన్ని వదిలించుకోవాలని చూస్తుంటారు. అప్పటి వరకు అది బాగా పనిచేస్తున్నా కూడా ఎప్పుడో ఓసారి స్టక్ అయిపోతుంది. అందుకే నీటిలో పడిన ఫోన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సిమ్ కార్డ్ ట్రే ప్రాంతంలో లిక్విడ్ కాంటాక్ట్ ఇండికేటర్ (LCI) ఉంటుంది. ఫ్లాష్ లైట్ లో దాన్ని చూస్తే అది తెలుపు రంగులో ఉండాలి. ఒకవేళ ఎరుపు రంగులో ఉంటే మాత్రం దానిలోకి నీరు చేరిందని గుర్తించాలి. అలాంటి ఫోన్లను అవాయిడ్ చేయాలి.