Free AI: ఉచితం.. ఉచితం.. ఉచితం.. అనేది మన దేశంలోని వినియోగదారుల బలహీనత. ఇప్పుడు అదే బలహీనతను అసరాగా చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్ కంపెనీలు భారత యూజర్లను తమ బుట్టలో వేసుకుంటున్నాయి. పర్‌ప్లెక్సిటీని రూపొందించిన అరవింద్ శ్రీనివాసన్ మొదటగా ఫ్రీ ప్లాన్‌ను తీసుకొచ్చి, ఏఐ రంగంలో విప్లవాత్మకం తీసుకొచ్చారు. ఇప్పుడు అదే బాటలో జెమిని ఏఐ, చాట్ జీపీటీ ఉచిత ప్లాన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టెక్ కంపెనీలు అందిస్తున్న ఉచిత ఏఐ సేవలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఇది నిజంగా ఉచితం కాదని, యూజర్లు తమ విలువైన డేటాను ఫీజుగా చెల్లిస్తున్నారని పలువురు నిపుణులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రముఖ టెక్ సంస్థలు తమ బిలియన్ డాలర్ల విలువైన తదుపరి ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడం కోసమే యూజర్ల డేటాను భారీగా సేకరిస్తున్నాయని “ది లాజికల్ బయ్యర్” అనే యూజర్ పేర్కొన్నారు. “ప్రపంచంలో ఏదీ ఉచితంగా రాదు” అనే విషయాన్ని గుర్తుచేశారు. “ఉచితం అనేది నిజంగా ఉచితం కాదు, అది ఒక వ్యాపార ఒప్పందం. మీరు డబ్బుతో కాకుండా మీ డేటాతో చెల్లిస్తున్నారు. భారతదేశంలో, ఆ డేటా విలువ ఏ సబ్‌స్క్రిప్షన్ కన్నా ఎక్కువ” అని ఓ యూజర్ వ్యాఖ్యానించారు.
మనం చేసే ప్రతీ క్లిక్, వారి తదుపరి మోడల్‌ను మెరుగుపరచడానికే ఉపయోగపడుతుందని మరో యూజర్ అభిప్రాయపడ్డారు. “భారతీయులే వారి ప్రొడక్ట్ (వస్తువు)” అని విదేశీ యూజర్ ఘాటుగా స్పందించగా, “మనం ఈ కొత్త నూనెను (డేటాను) సంతోషంగా ఉచితంగా ఇచ్చేస్తున్నాం” అని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, ఈ పరిస్థితిని మరో కోణంలో చూడాలని కొందరు వాదిస్తున్నారు. “ఉచిత ఏఐ అనేది ఒక ఉచ్చు, కానీ అదే సమయంలో అది ఒక ఉత్ప్రేరకం (catalyst) కూడా. భారతదేశం దీనిని స్వీకరించే విధానంపై ఇది మంచి ప్రభావం చూపవచ్చు” అని పేర్కొన్నారు. ఈ వాదనను సమర్థిస్తూ, “అవును, అందుకే ఈ దశ భారతదేశానికి చాలా కీలకం. శక్తివంతమైన ఉచిత ఏఐ, దానికి తోడు మన వద్ద ఉన్న అపారమైన డేటా… ఇదొక భారీ అవకాశం. మనం దీన్ని ఎంత తెలివిగా వాడుకుంటామన్నదానిపై అంతా ఆధారపడి ఉంటుంది” అని ట్వీట్ చేశారు.
ఇటీవల అందుబాటులోకి వచ్చిన ‘ChatGPT Go’ వెర్షన్‌పై మరో యూజర్ స్పందిస్తూ, ఇది ఒక అప్‌గ్రేడ్ కాదని విమర్శించారు. “ఇది సరిగ్గా ఏడాది క్రితం ఉన్న ఉచిత వెర్షన్‌లాగే ఉంది. అప్పుడు ఎక్కువ మెసేజ్‌లు, ఫైల్ అప్‌లోడ్స్ ఉండేవి. వాటన్నిటినీ పరిమితం చేసి, ఇప్పుడు ‘Go’ పేరుతో మళ్లీ ఉచితంగా ఇవ్వడం విమోచన మాత్రమే, అప్‌గ్రేడ్ కాదు” అని వారు పేర్కొన్నారు.