మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది జాగ్రత్త..
మీ ప్రాంతంలో భారీ వర్షాలు పడతాయి జాగ్రత్తగా ఉండండి..
మీ ప్రాంతంలో తీవ్రమైన ఎండ ఉంది, బయటకు రావొద్దు..
ఇలాంటి వాతావరణ హెచ్చరికలు స్మార్ట్ ఫోన్లలో చూస్తూనే ఉంటాం. చాలామంది వాటిని పెద్దగా పట్టించుకోరు. కానీ వర్షాలకు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రాంతాల్లో ఉన్నవారు మాత్రం ఆ హెచ్చరికలను చూసి జాగ్రత్తపడుతుంటారు. అలాంటిదే ఈ హెచ్చరిక కూడా ఇది భూకంప హెచ్చరిక. స్మార్ట్ ఫోన్లు కూడా భూకంపాల గురించి హెచ్చరించే టెక్నాలజీకి అప్డేట్ అయ్యాయి. గూగుల్ సంస్థ ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ హెచ్చరికలను జారీ చేస్తుంది. అయితే ఇవి అందరికీ రావు. ఎందుకంటే హెచ్చరికల నోటిఫికేషన్లను సహజంగా మనం డిజేబుల్ చేసుకుని ఉంటాం.
ఎనేబుల్ చేయండిలా..?
భూకంపాల గురించి హెచ్చరికలు అందరికీ అవసరం లేదు. భూకంప ప్రభావం ఉండే ప్రాంతాల్లో ఉన్నవారికి మాత్రం అవి కచ్చితంగా మేలు చేస్తాయి. మన దేశంలో ఢిల్లీ కూడా భూకంప జోన్ లోనే ఉంది. అక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. కానీ ఇటీవల కాలంలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన దాఖలాలు అరుదు. అయినా కూడా భూమి కంపిస్తుంటే మిన్ను విరిగి మీదపడిపోతున్నట్టుగా మనం వణికిపోతుంటాం. అలాంటి సందర్భాల్లో దాని తీవ్రత ఎంత? మనం ఏంచేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలపై అలర్ట్ మెసేజ్ లు వస్తే బాగుంటుంది కదా. అందుకే గూగుల్ ఈ ప్రయత్నం మొదలు పెట్టింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు వాడేవారు ముందుగా సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళ్లాలి. అక్కడ సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్, అన్ నోన్ ట్రాకర్ అలర్ట్స్, వైర్ లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్, ఎమర్జెన్సీ అలర్ట్ హిస్టరీ అనే ఆప్షన్లు ఉంటాయి. ఆండ్రాయిడ్ 5.0 వెర్షన్ లేదా దానికి అప్డేటెడ్ వెర్షన్స్ లో ఎర్త్ క్వేక్ అలర్ట్స్ ఉంటాయి. ఆ ఆప్షన్ ని మీరు డిజేబుల్ చేసుకుని ఉంటే వెంటనే ఎనేబుల్ చేసుకోండి. ఆ తర్వాత భూకంపాలకు సంబంధించిన అలర్ట్స్ నేరుగా మీ ఫోన్ కే వస్తాయి.
గూగుల్ తో ఎలా..?
భూకంపాల గురించిన సమాచారాన్ని ముందుగా ఫోన్ ల ద్వారానే గూగుల్ నెట్ వర్క్ కి చేరుతుంది. ఆ తర్వాత దాన్ని క్రోడీకరించి హెచ్చరికల ద్వారా అది మన ఫోన్ కి పంపిస్తుంది. అసాధారణ కదలికలను గుర్తించే సాఫ్ట్ వేర్ల ద్వారా గూగుల్ భూకంపాలను కనిపెడుతుంది. కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్ వంటి ప్రాంతాలలో, భూకంపాలను గుర్తించడానికి భూకంప సెన్సార్లను ఉపయోగిస్తుంటారు. ఈ సెన్సార్లను ఉపయోగించే షేక్ అలర్ట్ నెట్‌వర్క్‌తో గూగుల్ భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ సెన్సార్లు ఆండ్రాయిడ్ సిస్టమ్‌లోకి డేటాను పంపిస్తాయి. ఈ డేటాని గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్లకు పంపిస్తుంది.
రెండు రకాల హెచ్చరికలు..
ఆండ్రాయిడ్ ఫోన్లకు గూగుల్ రెండు రకాల హెచ్చరికలను జారీ చేస్తుంది. 1. బి అవేర్ అలర్ట్. తక్కువ తీవ్రత ఉన్న భూకంపాలు సంభవిస్తే.. ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ అలర్ట్ మెసేజ్ వస్తుంది. 2. టేక్ యాక్షన్ అలర్ట్. అంటే తీవ్రత ఎక్కువగా ఉన్న భూకంపాలు సంభవించే సమయంలో ఈ అలర్ట్ మెసేజ్ వస్తుంది. పెద్ద శబ్దంతో ఫోన్ మనం అలర్ట్ అయ్యే వరకు హెచ్చరిస్తుంది. వెంటనే మనం సురక్షిత ప్రాంతానికి వెళ్తే భూకంప ప్రభావాన్ని తప్పించుకునే అవకాశం ఉంటుంది.