Check For Stray Dogs: దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా వీధి కుక్కలు గుంపులు గుంపులుగా కనిపిస్తాయి. వీలు చిక్కినప్పుడల్లా మనుషులపై దాడులు చేసిన ఘటనలు కోకొల్లలు. ఈ సమస్యని తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశారు ఇంజనీరింగ్ విద్యార్థులు. ఈ విషయంలో ఓ అడుగు ముందుకేశారు. Sens-k9 పేరుతో రెడీ చేసిన స్మార్ట్‌వాచ్‌తో వీధి కుక్కలకు చెక్ పెట్టవచ్చు. అదెలా సాధ్యం?
స్మార్ట్‌వాచ్‌తో వీధి కుక్కల కష్టాలకు చెక్-చెంగన్నూర్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు కొత్త పరికరాన్ని రూపొందించారు. బ్లెస్సన్ మాథ్యూ విల్సన్, బిన్సన్, సావియో జాయ్, ఆర్ శ్రీరాగ్, ప్రవీణ్ కుమార్ కలిసి కొత్త పరికరాన్ని అభివృద్ధి చేశారు. కుక్కలను తరిమికొట్టే పరికరాలు ఇప్పటివరకు అందుబాటులో ఉన్నా, స్మార్ట్‌వాచ్ రూపంలో దీన్ని అభివృద్ధి చేశారు.
కేరళలో ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఘనత-త్రిస్సూర్ జిల్లా వెల్లరక్కడ్‌లో ఓ వృద్ధురాలిపై వీధి కుక్క దాడి చేసి చంపేశాయి. ఆ దాడిలో ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై దృష్టి సారించారు ఇంజనీరింగ్ ఆఖరి ఇయర్ చదువుతున్న విద్యార్థులు. ఇలాంటి దాడులు జరగకుండా ఉండేలా టెక్నాలజీ ఆధారంగా వస్తువు రూపొందించాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆ విద్యార్థులు తమ విభాగం హెడ్‌కు తెలిపారు.
మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు-వీధి కుక్క వేగంగా తమను చుట్టి ముట్టినప్పుడు స్మార్ట్‌వాచ్‌లో ప్రత్యేక బటన్ నొక్కితే చాలు. వెంటనే 20-40 కిలో హెర్ట్జ్ మధ్య అల్ట్రాసోనిక్ శబ్ద తరంగాల్ని విడుదల చేస్తుంది. ఈ శబ్ద తరంగాలు కుక్కలకు అసౌకర్యంగా ఉంటాయి. ఆ శబ్దానికి మనిషికి దూరంగా వెళ్లేలా చేస్తాయి. ఆ శబ్దం మనుషులకు ఎలాంటి ఇబ్బంది కలిగించదని ఇంజనీరింగ్ విద్యార్థులు వెల్లడించారు.
రానున్న రోజుల్లో ఏఐ ద్వారా అప్‌డేట్-స్మార్ట్‌వాచ్‌లో సమయాన్ని చూపించే క్లాక్.. ఎల్ఈడీ ఇండికేషన్, వైబ్రేషన్ అలర్ట్, డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. చిన్నారులు, మహిళలు, వృద్ధులు వంటివారు సులభంగా ఉపయోగించవచ్చని చెబుతున్నారు. చిన్న పరికరమే అయినా అధిక ఫ్రీక్వెన్సీ శబ్ద తరంగాల్ని విడుదల చేయడం తొలుత సవాల్‌గా మారిందన్నారు. కేవలం 2 నెలల్లో ప్రోటోటైప్‌ను తయారు చేసి సక్సెస్ చేశామని అంటున్నారు.
గతేడాది సెప్టెంబర్‌లో తుది రూపం ఇచ్చామని, యాజమాన్యం చొరవతో ఈ పరికరానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో పేటెంట్ వచ్చేలా కృషి చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. కేరళ స్టార్టప్ మిషన్ సీఈఓతో చర్చలు కూడా జరిపినట్లు కళాశాల వర్గాలు తెలిపాయి.
ALSO READ: రూ.3,299కే క్లాసీ స్మార్ట్‌వాచ్.. ప్రీమియం లుక్, అదిరిపోయే ఫీచర్లు!
రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీ జోడించాలని విద్యార్థులు ఆలోచన చేస్తున్నారు. ఏఐ కెమెరాతో కుక్కను గుర్తించడం, అది మొరిగే శబ్దం, దాని ప్రవర్తనను బట్టి ఆటోమేటిక్‌గా అల్ట్రాసోనిక్ తరంగాలు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చేలా, జీపీఎస్ లొకేషన్ షేరింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
కొంచెం పెద్ద పరికరాన్ని తయారు చేసి కాలేజీలు, ఇళ్లు, ఆఫీసులు, ఆసుపత్రుల ప్రాంగణాలను ఏర్పాటు చేస్తే సరిపోతుందని అంటున్నారు. వీధి కుక్కల రహిత ప్రాంతాలుగా మార్చేందుకు పని చేస్తామన్నారు. ఎలాంటి హాని చేయకుండా శబ్ద తరంగాల ద్వారా కుక్కల్ని దూరంగా ఉంచడం ఈ సాంకేతికత ప్రత్యేకత.