Big Stories

NASA Gold Mission : బంగారు కొండపైకి నాసా పయనం

NASA Gold Mission

NASA Gold Mission : అది ఉత్తుత్తి గ్రహశకలం కాదు. బంగారు కొండ. అపార లోహరాశులకు నిలయం.అందుకే ఇప్పుడు అందరి దృష్టీ దానిపైనే. భూమికి 55 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉందా ఆస్టరాయిడ్. పేరు 16 సైకీ. దానిని అందుకోవాలని, లోతుపాతులను తెలుసుకోవాలని నాసా తహతహలాడుతోంది. 12వ తేదీ గురువారం నాడు సైకీ మిషన్‌ను చేపట్టడానికి కారణమిదే. 960.6 మిలియన్ డాలర్ల వ్యయంతో సైకీ ఆస్టరాయిడ్‌ దగ్గరికి స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపుతోంది.

- Advertisement -

అంగారక, గురుగ్రహాల మధ్య 16సైకీ ఆస్టరాయిడ్ ఉంది. ఆ రెండు గ్రహాల మధ్య ఇతర గ్రహశకలాలతోనే కలిసి సైకీ కూడా తిరుగుతోంది. స్పేస్-ఎక్స్ ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా నాసా పంపే వ్యోమనౌక 2026లో ఆ గ్రహశకలాన్ని చేరుతుంది. 26 నెలల పాటు దాని చుట్టూ పరిభ్రమించి ఫొటోలు తీసి మ్యాపింగ్ చేస్తుంది. గురువారం ఉదయం 10 గంటల 16 నిమిషాలకు ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి సైకీ స్పేస్‌క్రాఫ్ట్ నింగిలోకి దూసుకుపోనుంది.

- Advertisement -

సైకీ ఆస్టరాయిడ్ విశేషాలు చెప్పుకోవాలంటే బోలెడు. మిగిలిన గ్రహశకలాలు ఉత్తుత్తి రాళ్లే అయినా.. సైకీ మాత్రం ఎంతో భిన్నం. ఇనుము, నికెల్, బంగారం లోహాలతో పాటు మట్టి కలగలసి ఉన్న ఆస్టరాయిడ్ ఇది. ఆ లోహాలు ఏ స్థాయిలో ఉన్నాయన్నదీ నాసా తాజా మిషన్ ద్వారా తేలనుంది. అంతే కాదు.. మన సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలు ఎలా ఏర్పడ్డాయో కూడా తెలుసుకోవచ్చని, మన భూమి మధ్యభాగం(core) ఎలా ఉందో ఓ అంచనా‌కు రావొచ్చని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఏ గ్రహం రూపొందాలన్నా.. అందుకు లోహాలు అవసరం. లోహాలను బలంగా లాక్కొనేందుకు అయస్కాంత శక్తి కావాలి. సైకీకి కూడా ఆ అయస్కాంత శక్తి ఉంది. అందువల్ల అది లోహాలను పట్టి ఉంచింది. అయితే కోర్‌లోని లోహ పదార్థానికి పైన ఉండే.. మట్టి, రాళ్లు వంటివి లేకపోవడం ఈ గ్రహశకలం ప్రత్యేకత. ఇదే నాసా శాస్త్రవేత్తలను ఆకట్టుకుంది. గ్రహం లాగా ఏర్పడే సమయంలో సైకీని మరో రాయి బలంగా ఢీకొట్టిందని, అందుకే దానిపై ఉన్న రాళ్లు, మట్టి అంతా పోయి.. చివరకు కేంద్రంలోని గట్టి లోహ పదార్థమే మిగిలి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇంతకీ సైకీపై లభించే ఖనిజాల విలువ ఎంత ఉండొచ్చు? అనే కదూ మీ అనుమానం. నాసా మిషన్ విజయవంతమైతే.. సైకీ అపార లోహరాశులతో భూమ్మీద ప్రతి ఒక్కరూ బిలియనీర్ కావడం ఖాయమని చెబుతున్నారు. దాని విలువ 10,000 క్వాడ్రిలియన్ డాలర్లని అంచనా. క్వాడ్రిలియన్ (ఒకటి పక్కన 15 సున్నాలు చేరిస్తే వచ్చే సంఖ్య) అంటే.. 10 కోట్ల కోట్ల డాలర్లు. అది మన కరెన్సీలో 832.53 కోట్ల కోట్ల రూపాయలకు సమానం. సైకీ ఆస్టరాయిడ్ ఇనుము, నికెల్, బంగారం లోహాలతో 95 శాతం మేర నిండి ఉందని, అందుకే అంత విలువను నిర్ధారించినట్టు నాసా చెబుతోంది.

అయితే మరికొందరు పరిశోధకులు మాత్రం ఇందుకు భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. ఆస్టరాయిడ్‌లో 35 శాతం ఖాళీగానే ఉందని, విలువైన లోహాలు ఏవీ లేవని కూడా చెబుతున్నారు. 183 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ఆస్టరాయిడ్‌ను ఇటలీకి చెందిన అంతరిక్ష శాస్త్రవేత్త అన్నిబేల్ గస్ఫారిస్ 1852లో తొలిసారి గుర్తించారు. గ్రీకు ఆత్మదేవత సైకీ పేరు‌నే ఈ గ్రహశకలానికి పెట్టారు. 16 అనే అంకెను నాసా జోడించి.. 16 సైకీ ఆస్టరాయిడ్‌గా వ్యవహరిస్తున్నారు. సైకీ గ్రహశకలానికి సంబంధించిన ఈ ఆసక్తికర అంశాల నిగ్గు తేలేది మూడేళ్ల తర్వాతే!

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News