IKEA Phone Bed| మోడ్రన్ ఫర్నిచర్, గృహోపకరణాలు విక్రయించే ఐకియా తాజాగా ఒక స్పెషల్ మినీ బెడ్‌ను తీసుకొచ్చింది. ఈ బెడ్ కేవలం స్మార్ట్‌ఫోన్‌ల కోసం మాత్రమే ప్రత్యేకంగా రూపొందించబడింది. టెక్నాలజీ, ఆధునిక జీవనశైలి వల్ల క్వాలిటీ నిద్రను కోల్పోతున్న వారికి మంచి నిద్ర అందించడానికే దీన్ని తయారు చేశారు.
చాలా మంది రాత్రి పడుకునే ముందు ఫోన్‌లో స్క్రోల్ చేస్తారు. ఈ అలవాటు వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. ఈ సమస్యను తగ్గించేందుకు ఐకియా ఈ మినీ బెడ్‌ను తీసుకొచ్చింది. ఈ చిన్న బెడ్‌పై మీ ఫోన్‌ను రాత్రివేళ “పడుకోబెట్టవచ్చు”. ఇదేదో పిల్లల ఆట వస్తువు కాదు. ఒక ఆహ్లాదకరమైన టెక్నికల్ పరిష్కారం.
ఈ మినీ బెడ్ ఐకియా ఫర్నిచర్ లాగా కనిపిస్తుంది. ఇందులో చిన్న మ్యాట్రెస్, చిన్న బ్లాంకెట్ ఉంటాయి. ఈ బెడ్ లో ఒక NFC చిప్ ఉంటుంది. ఇది ఒక యాప్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. ఫోన్ బెడ్‌పై ఉంచగానే NFC చిప్ యాక్టివేట్ అవుతుంది. ఫోన్‌లో ‘డు నాట్ డిస్టర్బ్ మోడ్’ ఆన్ అవుతుంది.
ఈ యాప్ మీ ఫోన్ ఎంతసేపు బెడ్‌పై ఉందో ట్రాక్ చేస్తుంది. ఇది స్లీప్ ట్రాకర్ లాగా పనిచేస్తుంది. డిజిటల్ డిటాక్స్‌ను ప్రోత్సహిస్తుంది. ఇది మీకు ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్లను అలవర్చుకోవడానికి సహాయపడుతుంది.
ఈ క్యాంపెయిన్‌లో భాగంగా.. ఐకియా “7 రాత్రుల చాలెంజ్” నిర్వహిస్తోంది. ఈ చాలెంజ్‌లో.. ఏడు రాత్రుల పాటు ఫోన్‌ను ఉపయోగించకుండా.. రాత్రికి కనీసం 7 గంటలు ఫోన్‌ను మినీ బెడ్‌పై ఉంచాలి. ఈ చాలెంజ్‌ను పూర్తి చేసిన వారికి బహుమతులు లభిస్తాయి.
చాలెంజ్ పూర్తి చేసిన వారు 100 AED విలువైన ఐకియా షాపింగ్ వోచర్ లేదా క్రెడిట్స్ పొందుతారు. ఈ వోచర్‌ను ఏ ఐకియా స్టోర్‌లోనైనా ఉపయోగించవచ్చు. ఈ వోచర్ బహుమతి చాలెంజ్‌కు మరింత ఉత్సాహాన్ని జోడిస్తుంది.
ఈ మినీ బెడ్ కేవలం పడుకోవడానికి మాత్రమే కాదు. ఇది ఛార్జింగ్ స్టేషన్‌గా కూడా పనిచేస్తుంది. ఫోన్‌ను బెడ్‌పై ఉంచితే.. చాలు అది ఛార్జ్ అవుతుంది.
ఈ క్యాంపెయిన్ కేవలం సరదాగా ఉండే ఆలోచన కాదు. ఇది ఒక తెలివైన డిజిటల్ వెల్‌నెస్ ఇనిషియేటివ్. ఐకియా మీరు బాగా నిద్ర పోవడానికి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి.. డివైస్‌ల నుండి దూరంగా ఉండేలా ప్రోత్సహిస్తుంది.
ఈ మినీ బెడ్‌ను నేరుగా కొనుగోలు చేసే అవకాశం లేదు. ఐకియా స్టోర్‌లో కనీసం 750 AED – దుబాయ్ కరెన్సీ (సుమారు 18,000 రూపాయలు) విలువైన కొనుగోలు చేస్తేనే ఈ మినీ బెడ్‌ను పొందవచ్చు.