Hyderabad Traffic Diversions: హైదరాబాద్ సిటీవాసులకు ముఖ్య గమనిక. హైదరాబాద్ సిటీలో ప్యారడైజ్ చౌరస్తా నుంచి డెయిరీ ఫారం వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులు ఇవాళ (అక్టోబర్ 30) నుంచి మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. ఆ మార్గం మూసివేత కారణంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని జాయింట్ కమిషనర్ వెల్లడించారు.
హైదరాబాద్‌లో ఎలివేటెడ్ కారిడార్ పనులు మొదలు
సికింద్రాబాద్ ఏరియాలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది రేవంత్ సర్కార్. గురువారం నుంచి ప్యారడైజ్ చౌరస్తా నుంచి డెయిరీ ఫారం వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులు మొదలయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యంలో తొమ్మిది నెలల పాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ఈ విషయాన్ని జాయింట్ కమిషనర్ వెల్లడించారు.
ట్రాఫిక్ మళ్లింపులో భాగంగా ప్రధాన రహదారి రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్- బాలంరాయ్ మధ్య రెండు దిశలలో ఉన్న మార్గం మూసి వేయబడుతుంది. ఈ మార్గం మూసివేత కారణంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు అధికారులు.
తొమ్మిదినెలలపాటు ట్రాఫిక్ మళ్లింపు
తొలుత పంజాగుట్ట, ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనదారులు బాలానగర్, న్యూబోయిన్‌పల్లి, సుచిత్ర వైపు నుంచి వచ్చే వాహనాలు వివిధ ప్రాంతాల మీదుగా మళ్లించి ఎస్‌బీఐ చౌరస్తాకు చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే తాడుబంద్ వైపు వెళ్లే వాహనదారులు ట్యాంక్‌బండ్, రాణిగంజ్, పంజాగుట్ట, రసూల్ పురా, ప్లాజా, సీటీఓ మీదుగా రావాల్సి వుంటుంది.
తాడుబంద్ వైపు వచ్చే వాహనాలు బాలంరాయి, రాజీవ్‌గాంధీ విగ్రహం చౌరస్తా నుంచి మళ్లించి అన్నానగర్ మీదుగా తాడుబంద్ చౌరస్తా వైపు వెళ్లాల్సి ఉంటుంది.అన్నానగర్ ప్రాంతవాసులు పంజాగుట్ట, ట్యాంక్‌బండ్ వైపు వెళ్లడానికి అంతర్గత రహదారులను ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు చెప్పుకొచ్చారు.
ALSO READ: తెలంగాణకు మొంథా ముప్పు, నీటిలో వరంగల్ సిటీ
నిర్మాణ సమయంలో ప్రయాణికులు తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో సహకరించాలని అభ్యర్థించారు. ప్రయాణ అత్యవసర పరిస్థితుల్లో 9010203626లో ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించండి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ-HMDA ఆధ్వర్యంలో ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ పనులు చేపడుతోంది.
దాదాపు 5.32 కిలోమీటర్ల మేరా ఈ కారిడార్ నిర్మాణం జరగనుంది. ఇది పూర్తయితే ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్ సిటీలోకి వచ్చే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరసర ప్రాంతాల్లోని రక్షణ శాఖ భూముల అడ్డంకి తొలగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణం పనులు మొదలయ్యాయి. ఇక సికింద్రాబాద్, తాడ్‌బంద్, బోయినపల్లి చౌరస్తాల మీదుగా రద్దీ తగ్గనుంది.