Warangal Floods: మొంథా తుఫాను ప్రభావం ఉమ్మడి వరంగల్‌ని అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా హనుమకొండా, మహబూబాబాద్, వరంగల్ , జనగామ జిల్లాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లాలో మొత్తం 45 కాలనీలు ముంపు నీటితో నిండిపోయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. డోర్నకల్ వద్ద రైల్వే ట్రాక్ పైకి వరద నీరు చేరడంతో పలు రైళ్లు నిలిచిపోయాయి.
మున్సిపల్ అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, పోలీసులు మునిగిపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. అధికారులు అత్యవసర పరిస్థితుల దృష్ట్యా 12 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల నుంచి సుమారు 1,200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
వరంగల్ నగరంలో బీరన్నకుంట పాఠశాల, కాశీకుంట చర్చి, పోతనరోడ్ మార్వాడీ భవన్, ఎనుమాముల శుభం గార్డెన్, కొత్తవాడ లక్ష్మీ గార్డెన్, లెనిన్ నగర్ సామాజిక భవనం, నందీశ్వర గార్డెన్‌లలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
హనుమకొండ పరిధిలో కూడా తీవ్ర జలమయం ఏర్పడింది. సుబేదారి ఎస్ఎస్ గార్డెన్, సాయిబాబా గుడి, పోచమ్మకుంట ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా అధికారులు సహాయక బృందాలతో కలసి ముంపు బాధితులకు అవసరమైన సాయం అందిస్తున్నారు.
తెలంగాణలో నమోదైన వర్షపాతం వివరాలు..
భీమదేవరపల్లిలో 42.2 సెం.మీ వర్షం, వరంగల్ జిల్లా పర్వతగిరిలో 41.5 సెం.మీ వర్షపాతం నమోదు అయింది.
హన్మకొండ జిల్లా ధర్మసాగర్లో 33.8 సెం.మీ వర్షం, వరంగల్ జిల్లా సంగెంలో 33.8 సెం.మీ, నెక్కొండలో 35 సెం.మీ వర్షం, ఖిలా వరంగల్‌లో 34.3 సెం.మీ వర్షపాతం నమోదు.
వర్ధన్నపేట్ లో 32.8 వర్షపాతం నమోదు,సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 30.3 సెం.మీ, అక్కన్నపేట్‌లో 28 సెం.మీ వర్షం,జనగామ జిల్లా పాలకుర్తిలో 29.4 సెం.మీ వర్షపాతం,కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో 26.3 సెం.మీ వర్షపాతం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 25.8 సెం.మీ వర్షం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
కాగా జనగామ జిల్లా పాలకుర్తి కొడకండ్ల దేవరుప్పులమండల మండల కేంద్రాలలో.. మొంథ తుఫాన్ ప్రభావంతో నిన్న ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాలలో చెరువులు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పాలకుర్తి దేవరుప్పుల మండల కేంద్రాలలో వరద ప్రభావంతో అక్కడక్కడ రోడ్లు కల్వర్టులు తెగిపోవడంతో.. జలదిగ్బంధంలో కొన్ని గ్రామాలు మండల కేంద్రానికి చేరుకోలేక ఎక్కడ వాళ్ళ అక్కడే ఉండి పోవడం జరిగింది.
మొంథ తుఫాన్ ప్రభావంతో చేతి కంది, పత్తి, వరి పంట అధిక మొత్తంలో నష్టం వాటిలినట్టు రైతులు వాపోతున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, మొలకెత్తిన వారి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతుల కోరుతున్నారు.