India Top Selling Phone| ప్రపంచంలో భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అంతర్జాతీయ కంపెనీలన్నీ ఇండియాను ఒక పెద్ద మార్కెట్ గా భావిస్తాయి. ఎలెక్ట్రానిక్స్, బట్టల నుంచి సాఫ్టవేర్ యాప్స్ వరకు అన్నింటికీ భారత్ మార్కెట్ కీలకం. అందుకే ఇండియన్ మార్కెట్ లో అత్యధిక వాటా సాధించాలని ప్రతీ కంపెనీ తీవ్రంగా పోటీపడుతోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ రంగంలో తీవ్ర పోటీ నెలకొంది.
2025 మూడో త్రైమాసికంలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 5 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే షిప్‌మెంట్లు పెరిగాయి. షిప్‌మెంట్ పెరుగుదల బాగానే ఉంది కానీ, మార్కెట్ వాల్యూ 18 శాతం గణనీయంగా పెరిగింది. డిస్కౌంట్లు, సులువైన ఫైనాన్స్ స్కీములు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో చాలా కాలంగా కొరియన్ కంపెనీ శాంసంగ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. కానీ ఈ సారి శాంసంగ్ ను ఒక చైనా బ్రాండ్ వెనక్కు నెట్టింది.
తాజా త్రైమాసిక రిపోర్ట్ ప్రకారం.. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చైనీస్ బ్రాండ్ వివో మొదటి స్థానం సాధించింది. ఈ త్రైమాసికంలో దాని మార్కెట్ షేర్ 20 శాతానికి చేరింది. గత ఏడాది ఇది 17 శాతం మాత్రమే. వివో ఫోన్ల రేంజ్ విస్తరణ, అన్ని సెగ్మెంట్లలో బలమైన సేల్స్ దీన్ని ముందుంచాయి. ప్రీమియం, మిడ్ రేంజ్, బడ్జెట్ ఫోన్లు అన్నింటిలోనూ వివో హవా సాగింది.
వివో అగ్రస్థానం కైవసం చేసుకోగా.. శాంసంగ్ ఇప్పుడు రెండో స్థానంలో ఉంది. దాని మార్కెట్ షేర్ 16 శాతం నుంచి 13 శాతానికి పడిపోయింది. అన్ని సెగ్మెంట్లలో తీవ్ర పోటీ ఎదురైంది. అయినా ప్రీమియం సెగ్మెంట్‌లో శాంసంగ్ ఇంకా లీడర్‌గానే ఉంది.
ఆపిల్ మొదటిసారిగా టాప్-5 బ్రాండ్లలో చేరింది. దాని మార్కెట్ షేర్ 9 శాతం, వాల్యూ షేర్ 28 శాతం. కొత్త ఐఫోన్ 17 సిరీస్‌కు డిమాండ్ ఎక్కువ ఉండడం, పాత మోడళ్లపై డిస్కౌంట్లు ఈ విజయానికి దోహదపడ్డాయి.
ఓప్పో మూడో స్థానంలోనే కొనసాగుతోంది – 13 శాతం షేర్. షావోమీ 8 శాతానికి పడిపోయింది. రియల్ మి 9 శాతం సాధించింది. తక్కువ ధర ఫోన్ల సెగ్మెంట్‌లో పోటీ ఎక్కువ, ర్యాంకులు తరచూ మారుతున్నాయి.
ఐక్యూ (iQOO) ఈ త్రైమాసికంలో 54 శాతం ఏటా పెరుగుదల సాధించింది. ఇది అతి పెద్ద జంప్. మోటోరోలా 53 శాతం పెరిగింది. 10 వేల రూపాయల లోపు సెగ్మెంట్‌లో భారత్ బ్రాండ్ అయిన లావా 135 శాతం అభివృద్ధి సాధించి అందరినీ షాక్ చేసింది.
ప్రీమియం ఫోన్ల మార్కెట్ 29 శాతం వాల్యూ పెరుగుదల చూసింది. ఖరీదైన ఫోన్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. సగటు ధర 13 శాతం ఎక్కింది. సులువైన EMI, ఫైనాన్స్ ఆప్షన్లు ఈ ట్రెండ్‌ను మరింత బూస్ట్ చేశాయి.
46 శాతం షేర్‌తో ప్రాసెసర్ మార్కెట్‌లో మీడియాటెక్ ఆధిపత్యం చెలాయిస్తోంది. క్వాల్‌కామ్ 29 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఇవి భారత్‌లో అమ్ముడవుతున్న ఫోన్లలో అత్యధికంగా వినియోగంలో చిప్‌సెట్లు.
Also Read: ఆస్పత్రిలో రూ.1.6 కోటి బిల్లు చూసి షాకైన యువకుడు.. అసలు బిల్లు రూ.29 లక్షలే.. మోసం ఎలా కనిపెట్టాడంటే