CM Revanth Reddy: జూబ్లీహల్స్ ఉప ఎన్నిక ప్రచారం క్లయిమాక్స్ నేపథ్యంలో బీఆర్ఎస్‌కు అధికార కాంగ్రెస్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిందా? కేటీఆర్ ఛాలెంజ్‌కు ఒక్కమాటతో సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారా? పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో ఏం చేసిందో విడమరిచి చెప్పారా? ముఖ్యమంత్రి కౌంటర్ ఎటాక్‌కు ప్రత్యర్థులు సైలెంట్ అయిపోయారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
కేటీఆర్‌కు సీఎం రేవంత్ కౌంటర్
జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలన-రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విసిరిన సవాల్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆనాటి కాంగ్రెస్ పదేళ్ల పాలన-కేసీఆర్ పదేళ్ల పాలనను పోల్చి చూపించి విడ మరిచి చెప్పారు. ఇదిగో చరిత్ర అంటూ కొన్ని కీలక విషయాలు బయటపెట్టారు ముఖ్యమంత్రి.
కేసీఆర్ చెరిపేస్తా చెరిగేది చరిత్ర కాదన్నారు సీఎం. 60 వేల కోట్ల మిగులుతో రాష్ట్రాన్ని అప్పగిస్తే.. 10 ఏళ్లలో 8 లక్షల 11 వేల కోట్ల అప్పులు చేసిన మాకు అప్పగించినది వాస్తవం కాదా అంటూ సూటిగా ప్రశ్నలు లేవనెత్తారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉండేదని, పాతాళంలోకి పడిపోయే పరిస్థితిలో రాష్ట్రాన్ని మాకు అప్పగించారని అన్నారు.
తారలతో తిరిగే కల్చర్ ఎవరిది? సీఎం సూటి ప్రశ్న
మీరు కట్టిన కమాండ్ కంట్రోల్-సచివాలయం-ప్రగతి భవన్ వల్ల ఏ ఒక్క ఉద్యోగమైనా ప్రజలకు వచ్చిందా అని ప్రశ్నించారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చారా? కాళేశ్వరం లేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఘటన తెలంగాణకు దక్కిందన్నారు. అంతేకాదు దేశంలో తెలంగాణా నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు.
లక్షా 87 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని, ఆ డబ్బులు ఎక్కడికి పోయాయి? సొంత చెల్లిని-మాగంటి తల్లిని అవమానించిన వాడు ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు? ధృతరాష్టుడు కళ్ళకు గంతలు కట్టుకున్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన ప్రారంభించిన ఏ ఒక్క పథకాన్ని ఆపలేదన్నారు. కేటీఆర్ వద్ద ఉండలేక కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఉంటున్నారని అన్నారు.
ALSO READ: మైసమ్మ ఆలయాల కూల్చివేతపై రాజకీయ రగడ
చివరకు సొంత చెల్లి సైతం వదిలేసి వెళ్లిపోయిందన్నారు. ఎవరిది అగ్రికల్చర్? ఎవరిది డ్రగ్స్ కల్చర్? ఎవరిది పబ్ కల్చర్? ఎవరిది సామాన్యులతో కలిసే కల్చర్? సినీ తారలతో తిరిగే కల్చర్ ఎవరిది? సినీ కార్మికుల కోసం కృషి చేసే కల్చర్ ఎవరిది? ప్రజలు మీరు ఒక్కసారి ఆలోచించాలన్నారు. మూడు నెలలు అవుతున్నా కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదన్నారు. ఈ విషయంలో జగన్ చేసిన తప్పు తాను చేయలేనన్నారు.
పదేళ్లలో హైదరాబాద్ నగరానికి ఒక్క చుక్క అదనంగా తాగునీరు తీసుకొచ్చారా? తాము అధికారంలోకి వచ్చాక 20 టీఎంసీల గోదావరి జలాలు తెచ్చేందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు. అలాగే హైదరాబాద్‌లో 70 శాతం జీసీసీలు ఏర్పాటయ్యాయని వివరించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. గుజరాత్‌కు గులాంగా మారారని, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
అలాంటి కిషన్ రెడ్డి మీకు దగ్గర కాలేదా? మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 వేలకు పైగా నోటిఫికేషన్లు వేశామని, 60 వేలకు పైగా ఉద్యోగాలకు భర్తీ చేశామన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క కొత్త యూనివర్సిటీ రాష్ట్రానికి తీసుకొచ్చారా? కనీసం వీసీలను నియమించే సాహసం చేయలేదన్నారు. పైగా 5 వేల పాఠశాలలు మూసేసిన ఘనత సొంతం చేసుకున్నారని అన్నారు.
పేదలకు- విద్య, రైతులకు-వ్యవసాయం, మహిళలకు-రాజ్యాధికారాన్ని దూరం చేయలేదా? ఉస్మానియా ఆసుపత్రిని కట్టలేదు, చివరకు టిమ్స్ పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. దశ సరిగ్గా లేని వాడి కోసం..వాస్తు పేరుతో దిశ మారిస్తే ప్రయోజనం ఉంటుందా? నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాపై ఉందని, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే.. అభివృద్ధి జరగాల్సిందేనన్నారు.
అక్కడ చెత్త, ఇక్కడ మురికి ఉందని కేటీఆర్ అంటున్నారని, గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రి ఎవరని అన్నారు. రాష్ట్రం-కేంద్రంలో అన్ని మంత్రి పదవులు మీ తోడు దొంగలవే కదా అని అన్నారు. మా ప్రాతినిధ్యం లేని చోట సమస్యకు మమ్మల్ని బాధ్యులను చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. ప్రచారం చివరిరోజు విపక్ష బీఆర్ఎస్‌కు అధికార కాంగ్రెస్ పార్టీ అదిరిపోయే పంచ్ ఇచ్చిందని కాంగ్రెస్ నేతల మాట.
ఎవరిది అగ్రికల్చరో.. ఎవరిది డ్రగ్స్ కల్చరో చూడండి: సీఎం రేవంత్ రెడ్డి
ఒకప్పుడు డ్రగ్స్ అంటే ఎక్కడో వినేవాళ్లం.. ఇప్పుడు గల్లీ గల్లీకి విస్తరించింది
సినీ కార్మికులతో ఎవరు మాట్లాడుతున్నారో.. ఎవరు గెస్ట్ హౌస్ లో ఉంటున్నారో చూసి నిబద్ధతతో తీర్పు ఇవ్వండి
– సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/Bui5TSzSe8
— BIG TV Breaking News (@bigtvtelugu) November 9, 2025