Snapchat AI Search: సోషల్ మీడియా దిగ్గజం స్నాప్ ఇన్‌క్‌తో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ పెర్‌ప్లెక్సిటీ కీలక ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం.. పర్‌ప్లెక్సిటీ రూపొందించిన ఏఐ సర్చ్ చాట్‌బాట్ ఇకపై స్నాప్‌చాట్ యాప్‌లో అందుబాటులోకి రానుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు యాప్‌లోనే ప్రశ్నలు అడిగి, తమకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ప్రస్తుతం 943 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్న స్నాప్‌చాట్‌కి ఇదొక కీలక అప్డేట్‌గా మారనుంది.
స్నాప్‌చాట్ సీఈఓ ఇవాన్ స్పీగెల్ మాట్లాడుతూ.. ‘మేము ఏఐని మరింత వ్యక్తిగతం, సరదాగా, స్నేహితులతో అనుసంధానమయ్యేలా తీర్చిదిద్దుతున్నాం. పర్‌ప్లెక్సిటీతో భాగస్వామ్యం ద్వారా ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం’ అని తెలిపారు.
పర్‌ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘ప్రపంచంలోని జిజ్ఞాసను తీర్చడం మా యొక్క లక్ష్యం. కోట్లాది మంది ప్రజలు స్నాప్‌చాట్ ద్వారా ప్రపంచంలో ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మేము వారి ఆసక్తిని అదే ప్లాట్‌ఫార్మ్‌లో తీర్చబోతున్నాం’ అని చెప్పారు.
ప్రస్తుతం స్నాప్‌చాట్‌ను దాదాపు ఒక బిలియన్ మంది యూజర్లు వాడుతున్నారు. కొత్త ఏఐ సిస్టమ్‌తో యూజర్లు యాప్‌లోనే ప్రశ్నలు అడిగి, స్పష్టమైన, సులభమైన సమాధానాలు పొందగలుగుతున్నారు. స్నాప్ ఏఐని మనుషుల మధ్య కమ్యూనికేషన్‌లో సహజంగా మిళితం చేసే దిశగా ఇది తీసుకున్నపెద్ద అడుగుగా భావిస్తున్నారు. పెర్‌ప్లెక్సిటీ సంస్థ.. ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించే సమయంలో, స్నాప్‌కు క్యాష్, ఈక్విటీ రూపంలో $400 మిలియన్లను చెల్లించనుంది.
ఇప్పటికే స్నాప్‌లో ఉన్న My AI చాట్‌బాట్‌తో పాటు ఇప్పుడు పెర్‌ప్లెక్సిటీ ఏఐ కూడా పనిచేయనుంది. ఇది నిజమైన, నమ్మదగిన, రియల్ టైమ్ సమాచారం ఇవ్వగలిగే అన్సర్ ఇంజిన్ మాదిరి పనిచేస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా స్నాప్‌చాట్‌ను ఏఐ ఆధారిత డిస్కవరీ, లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్‌గా మార్చే ప్రయత్నం జరుగుతోందని సంస్థ తెలిపింది. భవిష్యత్తులో మరిన్ని AI సంస్థలతో ఇలాంటి ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.