భూమికి ఉపగ్రహం చంద్రుడు. కానీ ఆ ఉపగ్రహం వల్ల భూమికి ఎన్ని లాభాలో మీకు తెలుసా? పోనీ చంద్రుడు లేకపోతే భూమికి ఎన్ని కష్టాలు వస్తాయో తెలుసా? వాస్తవానికి సూర్యుడు లేకపోతే భూమిపై జీవం ఉండదని మనం అందరం నమ్ముతాం. కానీ సూర్యుడితోపాటు చంద్రుడు కూడా ఉంటేనే భూమిపై జీవానికి మనుగడ ఉంటుంది. చంద్రుడు లేని భూమిని మనం అస్సలు ఊహించుకోలేం.
నెంబర్1 – సముద్ర అలలపై ప్రభావం
సముద్రపు అలల ఆటుపోట్లకు కారణం భూమిపై సూర్య చంద్రుల గురుత్వాకర్షణ శక్తి. అయితే చంద్రుడి ఆకర్షణ శక్తి మరింత బలంగా పనిచేయడం వల్ల అలలు ఏర్పడుతుంటాయి. అందుకే పౌర్ణమి, అమావాస్యలకు ఆటుపోట్ల పరిణామం బాగా పెరుగుతుంది. ఇదంతా చంద్రుడి గురుత్వాకర్షణ బలమే. చంద్రుడే లేకపోతే భూమిపై సముద్రం అల్ల కల్లోలం అయిపోయే ప్రమాదం ఉంది. అంతే కాదు, పోషకాల మిశ్రమం చెందేందుకు, సముద్ర జీవుల జీవిత చక్రాలతో సహా వివిధ పర్యావరణ ప్రక్రియలకు ఈ అలల కదలికలు మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు అటున్నారు. భూమి చుట్టూ వేడిని పంపిణీ చేయడం ద్వారా భూమి యొక్క వాతావరణాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
నెంబర్2 – అక్షాన్ని స్థిరీకరించడం
భూమి తన అక్షానికి 23.5 డిగ్రీలు వంగి భ్రమణం చేస్తుంటుంది. దీనివల్ల రుతువులు ఏర్పడుతుంటాయి. రుతువుల్లో మార్పుల వల్లే మనకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. భూమిపై జీవం అభివృద్ధి చెందడానికి ఇదే కారణం. అంటే దీనికి కూడా చంద్రుడే పరోక్ష కారణం అని చెప్పాలి. చంద్రుడి వల్లే భూమి అక్షం 23.5 డిగ్రీలు వంగి స్థిరంగా ఉంటోంది. భూమిపై వాతావరణం ఏర్పడటానికి అది సాయం చేస్తోంది.
నెంబర్3 – భూమి అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేయడం
భూమిపై చంద్రుడి ఆకర్షణ శక్తి, దాని ద్వారా సముద్రంలో ఏర్పడే అలలు భూమి అంతర్భాగాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. భూమి తన అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకోడానికి దోహదం చేస్తాయి. టైడల్ శక్తులచే ప్రభావితమైన భూమి, కేంద్రకంలోని వాహక పదార్థాల కదలిక ద్వారా అయస్కాంత క్షేత్రాన్ని నిర్వహించుకుంటుంది. సౌర, విశ్వ వికిరణం దుష్ప్రభావాలనుండి రక్షించుకోడానికి ఈ అయస్కాంత క్షేత్రం పనిచేస్తుంది.
నెంబర్4 – జీవిత చక్రాలను ప్రభావితం చేయడం
భూమిపై నివశించే చాలా జీవులు చంద్రుని చక్రాలపై ఆధారపడి పరిణామం చెందాయి. చేప జాతులు, కొన్ని ఉభయచరాలు వాటి పునరుత్పత్తి కార్యకలాపాలను చంద్ర దశలతో సమానంగా ఉండేలా చేస్తాయి. గుడ్లు పెట్టడం, వలస వెళ్లడం వంటివి చంద్రుడి గమనాలను బట్టే అవి నిర్థారించుకుంటాయి. అంటే చంద్రుని కాంతి, గురుత్వాకర్షణ ప్రభావాలు భూమిపై జీవ కార్యకలాపాలను నియంత్రిస్తాయనమాట.
నెంబర్5 – భూ భ్రమణం నెమ్మదించడం..
భూ భ్రమణ కాలం క్రమక్రమంగా నెమ్మది కావడానికి కారణం కూడా చంద్రుడే. గతంలో భూమి భ్రమణానికి 18 గంటలు సమయం పట్టేది. అంటే భూమిపై ఒక రోజు 18 గంటలుగా ఉండేది. చంద్రుడి గురుత్వాకర్షణ కారణంగా కాలక్రమంలో ఈ సమయం పెరిగి 24గంటలుగా మారింది. 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రికావడం వల్ల భౌగోళిక కాల పరిమితి సమన్వయం ఏర్పడింది. భూమి వాతావరణ గతిశీలతకు కారణం అయింది.