ఉదయం 8.37 గంటలకు శంకర్ అయ్యర్ అనే ఉద్యోగి నుంచి ఆయన బాస్ కేవీ అయ్యర్ ఫోన్ కి ఒక మెసేజ్ వెళ్లింది. తనకు తీవ్రమైన వెన్ను నొప్పి ఉందని, ఈరోజు సెలవు కావాలని బాస్ ని మెసేజ్ లో అభ్యర్థించాడు శంకర్. సరే విశ్రాంతి తీసుకోండని రిప్లై ఇచ్చాడు బాస్. ఇంకేముంది ఈరోజు సిక్ లీవ్ తో హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అని భావించాడు శంకర్. కానీ 10 నిమిషాలకే అతడు గుండె పోటుతో కుప్పకూలాడు. ఇంట్లోనే ప్రాణాలు వదిలాడు. తిరిగి బాస్ కి వెంటనే ఫోన్ వెళ్లింది. శంకర్ ఇక లేడు అన్న వార్త విన్న అయ్యర్ షాకయ్యాడు. 10 నిమిషాల క్రితమే తనకు అతను మెసేజ్ చేశాడని చెప్పాడు. నిర్థారించుకోడానికి మరో ఉద్యోగికి ఆ సమాచారం తెలిపాడు. వెంటనే శంకర్ ఇంటికి పరుగు పరుగున చేరుకున్నాడు. విగత జీవిగా పడి ఉన్న శంకర్ ని చూసి కన్నీరు పెట్టుకున్నాడు.
ఆ మెసేజ్ లు సహజం..
రోజు ప్రారంభం అయ్యే సమయంలో బాస్ లకు ఉద్యోగుల నుంచి సెలవు కోరుతూ అభ్యర్థనలు రావడం సహజం. అలాగే శంకర్ నుంచి కూడా తనకు అభ్యర్థన రావడంతో సెలవు తీసుకోవాలని చెప్పాడు అయ్యర్. కానీ అంతలోనే అతడు చనిపోయాడన్న వార్త విని బాస్ షాకయ్యాడు. ఇలాంటి మెసేజ్ లు తనకు సహజం అని, అయితే అంతలోనే వచ్చిన ఫోన్ కాల్ మాత్రం తనను కలవరపాటుకి గురి చేసిందని అన్నాడాయన. 10 నిమిషాల క్రితం తనకు మెసేజ్ పెట్టిన ఉద్యోగి, ఇలా చనిపోతాడని కలలో కూడా ఊహించలేదన్నాడు. అతడు ఆఫీస్ లో కూడా చురుకుగా ఉంటాడని, ఫిట్ ఉద్యోగి అని చెప్పుకొచ్చాడు.
అకాల మరణాలు..
శంకర్ వయసు కేవలం 40 సంవత్సరాలు. ఇటీవలే పెళ్లైంది, ఒక చిన్నబిడ్డకు తండ్రి అయ్యాడు. అంతలోనే మృత్యువు అతడిని తీసుకెళ్లింది. పెళ్లి తర్వాత మందు, ధూమపానం మానేశాడు శంకర్. కానీ అతడిని మృత్యువు వదిలిపెట్టలేదు. ఇటీవల ఇలాంటి అకాల మరణాలు తరచూ జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా 40 ఏళ్ల వయసున్న వారే హఠాత్తుగా చనిపోతున్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఉన్నట్టుండి కుప్పకూలిపోవడం, చనిపోవడం.. దీంతో తెలిసినవారంతా షాకవుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ అని అంటున్నారు కానీ.. దీనికి గల కారణాలను వైద్యులు కూడా సరిగా వివరించలేకపోతున్నారు. ఒక్కోసారి వైద్య రంగంలోని వారు కూడా ఇలా హఠాన్మరణాలకు గురవుతున్నారు.
కారణం ఏంటి?
తీవ్రమైన శారీరక శ్రమ చేస్తూనో, ఆటలాడుతూనో, జిమ్ లో వ్యాయామం చేస్తూనో చాలామంది కుప్పకూలి మరణిస్తున్నారు. దీనికి పూర్తి కాంట్రాస్ట్ గా.. అంటే మాట్లాడుతూనో, నిలబడి ఏదయినా చిన్న చిన్న పనులు చేస్తూనో.. కూడా మనుషులు చనిపోతున్నారు. అంటే పని ఒత్తిడి అనేది ఇక్కడ ప్రాధాన్యత కాదు. అప్పటి వరకు బాగా మాట్లాడుతున్నవారు, ఆరోగ్యకరమైన జీవితం గడుపుతున్నవారు కూడా సడన్ గా చనిపోవడం సంచలనంగా మారుతోంది. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అయితే ఆరోగ్యంగా ఉన్నవారు, గతంలో ఎలాంటి సమస్యలకు గురికానివారు కూడా సడన్ గా చనిపోతుండటంతో ఇలాంటి కేసుల గురించి విన్నప్పుడల్లా జనంలో మరింత ఆందోళన పెరుగుతోంది.