England Team : T20 వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఇంగ్లండ్ బరిలోకి దిగింది. అంచనాలకు తగ్గట్టే తొలిమ్యాచ్ లో సునాయాసంగా ఆఫ్గానిస్థాన్ పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే బట్లర్ సేన రెండో మ్యాచ్ లో పసికూన ఐర్లాండ్ చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. వర్షం ఇంగ్లండ్ ను దెబ్బకొట్టింది. ఈ మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం ఐర్లాండ్ 5 పరుగుల తేడాతో గెలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. మూడు మ్యాచ్ ల్లో 3 పాయింట్లు మాత్రమే ఇంగ్లండ్ కు దక్కాయి. సెమీస్ చేరాలంటే చివరి రెండు మ్యాచ్ లు తప్పక గెలవాల్సిందే. ఈ పరిస్థితుల్లో ఇంగ్లండ్ జట్టు తన సత్తా చాటింది. నాలుగో మ్యాచ్ లో బలమైన ప్రత్యర్థి న్యూజిలాండ్ ను 20 పరుగుల తేడాతో ఓడింది. సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. చివరి లీగ్ మ్యాచ్ లో శ్రీలంకపై 4 వికెట్ల తేడాతో గెలిచి సెమీస్ కు చేరుకుంది.
అదే ఆత్మవిశ్వాసం
లీగ్ దశలో కఠిన సవాళ్లను ఎదుర్కొన్న బట్లర్ సేన ..సెమీస్ లో టీమిండియాను చిత్తు చేసింది. ఈ టీ20 వరల్డ్ కప్ లో ఆ జట్టు సునాయాసంగా గెలిచిన మ్యాచ్ ఇదే. భారత్ నిర్దేశించిన 169 పరుగుల టార్గెట్ ను ఒక్క వికెట్ కోల్పోకుండా చేధించి క్రీడాభిమానులు ఆశ్చర్యంలో ముంచెత్తింది. అదే ఆత్మవిశ్వాసాన్ని ఫైనల్ లోనూ ప్రదర్శించింది. బౌలింగ్ కు అనుకూలించిన మెల్ బోర్న్ మైదానంలో పాకిస్థాన్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. 138 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే చేధించింది. పాకిస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా బెన్ స్టోక్స్ మాత్రం..2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇన్సింగ్స్ ను గుర్తుకు తెచ్చేలా ఆడి ఇంగ్లండ్ కు రెండో టీ20 వరల్డ్ కప్ అందించాడు.
3ఏళ్లలో 2 వరల్డ్ కప్ లు
T20 వరల్డ్ కప్ ను ఇప్పటి వరకు వెస్టిండీస్ మాత్రమే రెండుసార్లు కైవసం చేసుకుంది. ఇప్పుడు ఇంగ్లండ్ రెండోసారి కప్ కొట్టి విండీస్ సరసన చేరింది. పొట్టి ఫార్మేట్ లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా ఒక్కొక్కసారి ప్రపంచ విజేతగా నిలిచాయి. 2019 వన్డే వరల్డ్ కప్ ను దక్కించుకున్న ఇంగ్లండ్ కు మూడేళ్ల వ్యవధిలో ఇది రెండో వరల్డ్ కప్ ట్రోఫి.
టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ ప్రదర్శన
ఫైనల్ పాకిస్థాన్ పై 5 వికెట్ల తేడాతో విజయం
సెమీస్ లో భారత్ పై 10 వికెట్ల తేడాతో గెలుపు
లీగ్ దశ
ఐదో మ్యాచ్: శ్రీలంకపై 4 వికెట్ల తేడాతో గెలుపు
నాలుగో మ్యాచ్: న్యూజిలాండ్ పై 20 పరుగుల తేడాతో గెలుపు
మూడో మ్యాచ్ : ఆస్ట్రేలియాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు
రెండో మ్యాచ్ : ఐర్లాండ్ చేతిలో 5 పరుగుల తేడాతో ఓటమి ( డక్ వర్త్ లూయిస్ విధానం ఆధారంగా)
తొలి మ్యాచ్ : ఆఫ్గానిస్థాన్ పై 5 వికెట్ల తేడాతో గెలుపు