సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు చేస్తే ఆయా వర్గాల ఓట్లను ఒడిసిపట్టడం సులభం అవుతుంది. మరి యువతను ఆకర్షించడం ఎలా? ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఎంత ఎక్కువగా చూపించగలిగితే ఆ ప్రభుత్వంపై యువతకు అంత నమ్మకం పెరుగుతుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆల్రడీ మెగా డీఎస్సీ పూర్తి చేసింది, నియామకాలు కూడా చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. సకాలంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగ, ఉపాధి రంగంలో పెను మార్పులు తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా నైపుణ్యం పోర్టల్ అభివృద్ధి చేసి మరో ముందడుగుకి శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్.
నైపుణ్య విభాగం అధికారులతో ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించాను. నైపుణ్యం పోర్టల్ ను దేశానికే రోల్ మోడల్ గా నిలిచేలా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించాను. సెప్టెంబర్ లో పోర్టల్ ప్రారంభానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. పీఎం ఇంటర్నషిప్ స్కీమ్ తో నైపుణ్యం పోర్టల్ ను… pic.twitter.com/6zHLLyS663
— Lokesh Nara (@naralokesh) August 22, 2025
నైపుణ్యాలు పెంచేందుకు..
సాంప్రదాయ విద్యను అభ్యసిస్తున్న చాలామంది నైపుణ్యాలులేక ఉద్యోగాల వేటలో వెనకబడిపోతున్నారు. అలాంటి వారందరికీ నైపుణ్యాలు అందించి ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం సిద్ధపడింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతకు ఇది ఎక్కువ లబ్ధి చేకూర్చే అవకాశముంది. యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు నైపుణ్యం పోర్టల్ ని తెరపైకి తెస్తున్నారు. దేశానికే రోల్ మోడల్ గా నైపుణ్యం పోర్టల్ అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు మంత్రి నారా లోకేష్. ఏడాదికి 50వేల మంది యువతకు నైపుణ్య శిక్షణకు అవకాశం కల్పిస్తామన్నారు. ప్రధాన మంత్రి ఇంటర్నషిప్ స్కీమ్ తో నైపుణ్యం పోర్టల్ ని అనుసంధానిస్తామని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి లోకేష్ పోర్టల్ డెమోను పరిశీలించారు.
ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం యువత, పరిశ్రమలను అనుసంధానించేదిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, దీనికోసం నైపుణ్యం పోర్టల్ ని రూపొందిస్తున్నామని తెలిపారు మంత్రి లోకేష్. సెప్టెంబర్ లో ఈ పోర్టల్ ని ప్రారంభిస్తామని, ఆ దిశగా అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పోర్టల్ ను అభివృద్ధి చేయలేదని తెలిపారు. రాష్ట్రంలోని నైపుణ్య కేంద్రాలతో పాటు న్యాక్, సీడాప్ ను పోర్టల్ తో అనుసంధానించబోతున్నట్టు చెప్పారు.
ఏడాదికి 50వేలమందికి శిక్షణ..
నైపుణ్యం పోర్టల్ ద్వారా ఏడాదికి 50వేల మంది యువతకు శిక్షణ ఇస్తామని అంటున్నారు అధికారులు. 36 రంగాలకు సంబంధించి 3వేలకు పైగా జాబ్ కేటగిరీలను పోర్టల్ లో నమోదు చేశామన్నారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా యువతను సన్నద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. టెక్నాలజీ విప్లవంతో వివిధ నూతన రంగాలలో ఉపాధి అవకాశాలు వెల్లువలా అందుబాటులోకి వస్తాయని, వాటికి తగినట్టుగా శిక్షణ తీసుకుని సన్నద్ధంగా ఉండాలని యువతకు సూచించారు మంత్రి లోకేష్. ఆ దిశగా ప్రభుత్వమే చొరవ తీసుకుని, యువతలో నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.
యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాల విషయంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం కృషి చేసినా తగిన ఫలితాలు రాలేదనే చెప్పుకోవాలి. నిరుద్యోగ భృతితో యువత సంతృప్తి చెందలేదు. ఇక వైసీపీ హయాంలో నిరుద్యోగ భృతి ఆగిపోయింది, ఉపాధి విషయంలో వైసీపీ ప్రభుత్వ ప్రయత్నలోపం కూడా స్పష్టంగా బయటపడింది. దీంతో యువత మరోసారి కూటమికి పట్టం కట్టారు. మరి ఈ దఫా వారి ఆశలు, ఆశయాలు ఎంతవరకు నెరవేరతాయో చూడాలి.