
Ravichandran Ashwin : వరుసగా పది మ్యాచ్ లు.. అప్రహతిహితంగా టీమ్ ఇండియా జైత్రయాత్ర సాగిపోతోంది. ఇక ఒకటే తిరుమల కొండ చివరిది ఉంది. అది మోకాళ్ల పర్వతం.. ఇక్కడి వరకు గెలిచినదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఆడాల్సిన ఒక్క మ్యాచ్ ఒక ఎత్తుగా మారింది.
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా అహ్మాదాబాద్ లో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే టీమ్ ఇండియా కష్టపడి, కలిసికట్టుగా ఆడి విజయం సాధిస్తున్నారు. అదే ఆస్ట్రేలియా విషయానికి వస్తే వారికి అదృష్టం కొంచెం ఫేవర్ చేస్తున్నట్టుగా ఉంది.
ఎందుకంటే మొదటి రెండు మ్యాచ్ లు ఓడిపోయి, పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి వెళ్లిన ఆస్ట్రేలియా మిగిలిన జట్ల పేలవ ప్రదర్శనతో ముందడుగు వేసింది. ఆఖరికి సౌతాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ లో కూడా వారిది అదృష్టమేనని చెప్పాలి. బలవంతుడితో గెలవచ్చు, తెలివైన వాడితో గెలవచ్చుగానీ అదృష్టవంతుడితో ఆడి గెలవలేమని అంటారు.
కాకపోతే ఆ.. అదృష్టవంతుడిని కూడా సమష్టిగా కష్టపడితే గెలవచ్చు అనేది ఒక సత్యం. ఇప్పుడు ఇండియావైపు ఆ కష్టం ఒకటే ఉంది. ఈ సమయంలో ఫైనల్ జట్టులో విన్నింగ్ జట్టు నుంచి సూర్య కుమార్ ని తప్పించి, అశ్విన్ ని తీసుకురావాలని జట్టు మేనేజ్మెంట్ ఆలోచనగా ఉందని అంటున్నారు.
ఎందుకంటే టాప్ ఆర్డర్ భీకరమైన ఫామ్ లో ఉంది. నిజానికి ఏడో బ్యాటర్ గా సూర్యకుమార్ కి పెద్ద పని ఉండటం లేదు. హార్దిక్ పాండ్యా వెళ్లాక జట్టులోకి వచ్చిన సూర్య ఆడిన ఆరు మ్యాచ్ ల్లో ఒక్క ఇంగ్లండ్ పైనే అవకాశం వచ్చింది. అది చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. తర్వాత అంతా కూడా టాప్ ఆర్డర్ భారం మోసింది.
ఈ నేపథ్యంలో అశ్విన్ ని తీసుకుంటే ఒనగూరే లాభాలేమిటంటే ఆస్ట్రేలియాలో ఎడమ చేతి బ్యాటర్లు వార్నర్, ట్రావిస్ హెడ్, స్టార్క్, హేజల్ వుడ్ అని నలుగురు ఉన్నారు. టీమ్ ఇండియా బౌలింగ్ విభాగంలో ఆరుగురు బౌలర్లు ఉంటే, ఒకవేళ వారిలో ఒకరు ఫెయిలైనా, అశ్విన్ ని వాడొచ్చు. లేదంటే తనే క్లిక్ అయితే ఇక ఇండియాకి తిరుగే ఉండదు.
కెప్టెన్ కి కూడా ఆరుగురు బౌలర్లని సమయానుకూలంగా మార్చి మార్చి వాడేందుకు అవకాశం ఉంటుంది. కివీస్ తో జరిగిన సెమీఫైనల్ లో సిరాజ్ ని తుక్కు రేగ్గొట్టారు. అప్పటికే 70 పరుగులు పైనే ఇచ్చాడు. అయినా మరొకరి చేత చేయించడానికి రోహిత్ కి ఆప్షన్ లేదు. చచ్చినట్టు తనకే బౌలింగ్ ఇచ్చాడు.
అది ఫైనల్ లో ప్రమాదకరం. అదే హార్దిక్ ఉంటే ఆ ఆప్షన్ దొరికేది. ఇప్పుడది లేదు. అయితే తర్వాత సిరాజ్ వికెట్ తీశాడనుకోండి. కాకపోతే నెదర్లాండ్ పై చేసినట్టు కొహ్లీ, గిల్, సూర్య తో ఫైనల్ లో ప్రయోగాలు చేయలేడు. చివరిగా చెప్పేదేమిటంటే అశ్విన్ బ్యాటింగ్ కూడా చేస్తాడు. ఆ సంగతి అందరికీ తెలిసిందే. అందువల్ల బాగా ఆలోచించి టాప్ ఆర్డర్ పై నమ్మకం ఉంచి, అశ్విన్ తీసుకుంటే రోహిత్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టవుతుందని సీనియర్లు తేల్చి చెబుతున్నారు. మరికొందరు మాత్రం విన్నింగ్ టీమ్ ని అస్సలు మార్చొద్దని అంటున్నారు.