
Bhubaneshwar Road Accident : దట్టమైన చీకటిలో.. భువనేశ్వర్ నుంచి జార్సుగూడకు బయల్దేరిన బస్సు టైర్ ఉన్నట్టుండి పంక్చర్ అయింది. దాంతో బస్సులో ప్రయాణికులు దిగి రోడ్డుపై నిలబడ్డారు. అదే సమయంలో వేగంగా వచ్చిన లారీ.. నలుగురు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. దాంతో గమ్యం చేరుకోకముందే ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అంగోల్ జిల్లా సరిహద్దులో గురువారం అర్థరాత్రి ఈ ఘోరప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనుగోల్ జిల్లా కిషోర్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్గపాలి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి ఝార్సుగూడకు కాలీ ప్రాచి అనే ప్రైవేట్ బస్సు ప్రయాణికులతో వెళ్తుండగా.. అర్థరాత్రి వేళ బర్గపాలికి సమీపంలో బస్సుటైర్ పంక్చర్ అయింది. ఏం జరిగిందో చూసేందుకు ప్రయాణికులు బస్సు దిగి రోడ్డుపైకి రాగా.. వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. నలుగురికి తీవ్రగాయాలవ్వగా.. వారిని కిషోర్ సిటీ ఆసుపత్రిలో చేర్చారు.
నలుగురి ఆరోగ్యపరిస్థితి విషమించడంతో.. సంబల్ పూర్ జిల్లా రెబాచోల్ ఆసుపత్రికి తరలించారు. కిషోర్ నగర్ ఆసుపత్రిలో ఒకరు మరణించగా.. మరో ఇద్దరు రెబాచోల్ ఆసుపత్రిలో మరణించారు. ఇంకొకరు చికిత్స పొందుతున్నారు. మృతులు సుందర్ గఢ్ కు చెందిన ఆనంద్ ప్రధాన్, జార్సుగూడకు చెందిన నయన్ నాయక్, ఘనశ్యామ్ బారిక్ గా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.