OTT Movies: మీకు రొమాంటిక్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే.. ఈ మూవీ చూసేయండి. మరో విషయం.. ఇది మైండ్ నుంచి అస్సలు బయటకు పోదు. అలాగే ఈ కథ చదివేప్పుడు పక్కనే టిష్యూ పేపర్లు కూడా పెట్టుకోండి. ఎందుకంటే.. సినిమా చూసినప్పుడే కాదు.. చదువుతున్నప్పుడు కూడా మీకు తెలియకుండా కన్నీళ్లు వచ్చేస్తాయి. అవి ఆనంద భాష్పాలు కావచ్చు లేదా.. బాధతో బయటకు వచ్చే కన్నీళ్లు కూడా కావచ్చు. ఇక కథలోకి వెళ్లిపోదామా.
కథ ఏమిటంటే..
‘ది మ్యాప్ దట్ లీడ్స్ టు యు’ (The Map That Leads To You) అనే ఈ రొమాంటిక్ డ్రామా మూవీని J.P. మోనింగర్ రాసిన నవల ఆధారంగా రూపొందించబడింది. ఇది హీథర్ (మాడెలిన్ క్లైన్) అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఆమె తన కాలేజీ గ్రాడ్యుయేషన్ తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్స్ కనీ (కాన్‌స్టాన్స్), అమీతో కలిసి రెండు వారాల యూరప్ ట్రిప్‌కు వెళ్తుంది. అంతకు ముందే హీథర్ తన జీవితాన్ని చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటుంది. న్యూయార్క్‌లో బ్యాంకింగ్ జాబ్, కొత్త అపార్ట్‌మెంట్ ఇలా అన్నీ ఒక ప్లానింగ్‌తో ముందుకు వెళ్తుంది. కానీ, ఈ ట్రిప్ మాత్రం ఆమె జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుతుంది.
ప్రయాణంలో అపరిచితుడు పరిచయం
హీథర్ ఒక బ్రైడల్ సూట్‌లో రెడీ అవుతున్న సీన్‌తో ఈ కథ మొదలు అవుతుంది. అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్‌కు వెళ్తుంది. కట్ చేస్తే.. ఆమె తన స్నేహితురాళ్లతో కలిసి ట్రైన్‌లో పారిస్ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌కు ప్రయాణమవుతుంది. అక్కడ హీథర్‌కు జాక్ (కె.జె. అపా) అనే వ్యక్తి పరిచయం అవుతాడు. అతడు న్యూజిలాండ్‌కు చెందిన ట్రావెలర్. జాక్ తన ముత్తాత రాసిన పాత ట్రావెల్ జర్నల్‌ను అనుసరిస్తూ.. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో ట్రావెల్ చెయ్యడానికి వస్తాడు. హీథర్, జాక్.. ఎర్నెస్ట్ హెమింగ్‌వే రాసిన ‘ది సన్ అల్సో రైజెస్’ పుస్తకాన్ని చదువుతుంటారు. ఇద్దరూ ఒకే పుస్తకం చదవడంతో.. ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు.
ప్రేమ.. ఆపై అన్నీ…
జాక్ తన ఫ్రెండ్ రాఫ్‌తో కలిసి ఉంటాడు. ట్రావెలింగ్‌లో హీథర్ గ్రూప్ కూడా జాక్ గ్రూప్‌తో జాయిన్ అవుతుంది. వారంతా కలిసి ఆమ్‌స్టర్‌డామ్, బార్సిలోనా, పాంప్లోనాలోని బుల్ రన్నింగ్ ఫెస్టివల్, పోర్టో, రోమ్ వంటి నగరాల్లో ప్రయాణిస్తారు. ఈ ప్రయాణంలో హీథర్, జాక్ మధ్య ప్రేమ మొదలవుతుంది. మరోవైపు వారి ఫ్రెండ్స్.. కనీ, రాఫ్ కూడా ప్రేమించుకుంటారు. ఇంకేముంది ప్రేమ పక్షుల విహారం చాలా ఆహ్లాదకరంగా సరదాగా సాగుతుంది. చివరికి శారీరకంగా కూడా కలుస్తారు. ఇక ఎక్కడి పడితే అక్కడ అదే పనిలో బిజీగా ఉంటారు.
జాక్ ఏమైపోతాడు?
ట్రిప్ ముగిసిన తర్వాత.. హీథర్‌తో కలిసి న్యూయార్క్‌కు వెళ్లేందకు సిద్ధమవుతాడు జాక్. ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కేందుకు సెక్యూరిటీ కూడా పాస్ చేస్తారు. కానీ జాక్ రెస్ట్‌రూమ్‌కు వెళ్తానని చెప్పి.. మళ్లీ కనిపించడు. దీంతో హీథర్ ఒంటరిగానే న్యూయార్క్‌కు వెళ్తుంది. చివరికి.. జాక్ నుంచి “ఐమ్ రియల్లీ సారీ” అనే మెసేజ్ వస్తుంది. దీంతో జాక్ తనని వాడుకొని వదిలేశాడని కుంగిపోతుంది. కానీ, జాక్.. ఆమె వద్ద చాలా బాధాకరమైన విషయాన్ని దాచి పెడతాడు. (అది ఇక్కడ చెప్పేస్తే కిక్కు మిస్ అవుతారు). ఆ కారణం వల్లే ఎంతో గాఢంగా ప్రేమించిన హీథర్‌ను వదిలేస్తాడు. కానీ, ఆమెతో శారీరకంగా కలవడానికి ముందే.. ఆ పని ఎందుకు చెయ్యలేదనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో తలెత్తవచ్చు. కారణం తెలియాలంటే.. క్లయిమాక్స్ వరకు వేచి చూడాల్సిందే. ముందే చెబుతున్నాం.. సెకండాఫ్ చాలా ఏడిపించేస్తుంది.
ఆ లెటర్‌లో ఏం ఉంది?
జాక్ హ్యాండ్ ఇచ్చాక.. హీథర్ చాలా బాధలో ఉంటుంది. చివరికి తనకు ఎంతో ఇష్టమైన జాబ్ కూడా ఆమెకు అసంతృప్తిగా అనిపిస్తుంది. క్రిస్మస్ సమయంలో ఇంటికి వెళ్ళి తన తండ్రితో మనసులో బాధను కక్కేస్తుంది. చివరికి తన జాబ్‌ను వదిలేయాలని నిర్ణయించుకుంటుంది. తర్వాత తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ పెళ్లికి వచ్చిన జాక్ ఫ్రెండ్ రాఫ్ కూడా వస్తాడు. దీంతో జాక్ గురించి అడుగుతుంది. అతడు ఏమయ్యాడో తనకు కూడా తెలియదని రాఫ్ చెబుతాడు. అయితే, ఆమె కోసం తనకు ఒక గిఫ్ట్, లెటర్ ఇచ్చాడని తెలుపుతాడు. ఆ లెటర్‌లో జాక్ అసలు విషయం చెబుతాడు. అది ఏమిటనేది స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుంది. ఆ లెటర్ చదివాక హీథర్ ఏం చేస్తుంది. జాక్ ఏమయ్యాడు. అసలు బతికే ఉన్నాడా? ఉంటే ఇద్దరూ కలుస్తారా? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడిలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో కూడా ఉంది. తప్పకుండా చూసేయండి.