Mohammed Shami : ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 09 న ప్రారంభమై సెప్టెంబర్ 28న ఫైనల్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో పలు జట్లు టీమ్ లను ఇప్పటికే ప్రకటించాయి. వీటిలో టీమిండియా కూడా టీమ్ ను ప్రకటించింది. వారిలో కొంత మంది టీమిండియా బౌలర్లు ఆసియా కప్ కి ఎంపిక కాలేదు. వారిలో మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ ఉన్నారు. వీరిద్దరూ కీలక బౌలర్లు అయినప్పటికీ ఆసియా కప్ కి వీరిని ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, అజింక్య రహానే వంటి ప్లేయర్లను రిటైర్ మెంట్ కావాలని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ స్పందించాడు. తనను విమర్శించే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు మహ్మద్ షమీ.
Also Read : Ind vs Pak : “బై కాట్” సోనీ స్పోర్ట్స్.. టీమిండియా అభిమానులు సీరియస్
నేను ఎందుకు రిటైర్ అవ్వాలి : షమీ
భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. ” నేను ఎందుకు రిటైర్ అవ్వాలి..? మీకు ఏమైనా సమస్య ఉంటే చెప్పండి. నా రిటైర్మెంట్ తో ఎవ్వరికీ మేలు కలుగుతుంది..? బోర్ కొట్టిన రోజు వెళ్లిపోతా. జాతీయ జట్టుకు తీసుకోకపోతే డొమెస్టిక్ క్రికెట్ ఉంది. ఎక్కడో ఒక చోట ఆడుతూనే ఉంటాను. నన్ను సెలెక్ట్ చేయనందుకు ఎవ్వరినీ నిందించను. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా సత్తా చాటుతా. అందుకోసమే కష్టపడుతున్నా” అని వెల్లడించారు మహ్మద్ షమీ. ఈ బెంగాల్ స్టార్ చివరగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా తరపున ఆడాడు. కానీ ఆసియా కప్ కి ఎంపిక కాలేదు. గత కొంత కాలంగా ఫిట్ నెస్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మరోవైపు ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ కి ప్రాతినిధ్యం వహించిన తన బౌలింగ్ తో మ్యాజిక్ చేయలేకపోయాడు. భారీగానే పరుగులు సమర్పించుకున్నాడు.
వన్డే వరల్డ్ కప్ కి తిరిగి వస్తా..
సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున వికెట్లు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ విఫలం చెందడంతో కొన్ని మ్యాచ్ లకు బెంచ్ కే పరిమితం కావడం గమనార్హం. ఇక ఆ తరువాత ఇంగ్లాండ్ తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కి ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ షమీని సెలెక్ట్ చేయలేదు. అతని స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్ దీప్ సింగ్ యువపేసర్లను సెలెక్ట్ చేశారు. మరోవైపు వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పై కూడా స్పందించాడు షమీ. తనకు ఒకే కల మిగిలి ఉందని.. అది వన్డే వరల్డ్ కప్ గెలవడం అని తెలిపాడు. అద్భుతమైన ప్రదర్శన కనబరిచి తిరిగి భారత్ కి వన్డే వరల్డ్ కప్ ను తీసుకురావాలనుకుంటున్నానని తెలిపాడు. ప్రపంచ కప్ -2023 టైటిల్ ను తృటిలో చేజార్చుకున్నామని.. ఆ టోర్నీలో అన్ని మ్యాచ్ లు గెలిచి ఫైనల్ కి చేరామని.. ఫైనల్ లో ఆస్ట్రేలియా పై విజయం సాధించలేకపోయామని తెలిపాడు.