
Congress : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ లోకి నేతలు క్యూ కడుతున్నారు. ఢిల్లీ వెళ్లి మరీ కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. ఇటీవల బీజేపీ, బీఆర్ఎస్ చెందిన పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా మరికొందరు సీనియర్ నేతలు హస్తం గూటికి చేరారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్‌తో పాటు పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత నీలం మధు కాంగ్రెస్ లో చేరారు. ఈ నేతలకు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు.
గురువారం రాత్రి కొందరు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. మనుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్ .. మాణిక్ రావ్ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల చేరికలు కాంగ్రెస్ కు మరింత బలాన్ని ఇస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అవినీతి పాలనను తిరస్కరిస్తున్నారని తెలిపారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.