
Climate Change : పర్యావరణ మార్పులు ప్రపంచానికి ఇప్పుడు పెను సవాల్ విసురుతున్నాయి. రుతువులు గతి తప్పడంతో పాటు పంటనష్టాన్ని కలగజేస్తున్నాయి. సముద్ర మట్టాల పెరుగుదలకూ అదే కారణం. ప్రతి ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అంశమే ఇది. మరి ఎంతమందిని దీనిని ముప్పుగా భావిస్తున్నారు? పర్యావరణ మార్పులపై ఎందరు భయపడుతున్నారు? లాయడ్స్ రిజిస్టర్ ఫౌండేషన్ దీనిపై గాలప్ సర్వే చేపట్టింది.
వరల్డ్ రిస్క్ పోల్ నిర్వహించింది. 121 దేశాల్లోని 1,25,911 మంది అభిప్రాయాలను తెలుసుకుంది. రానున్న 20 ఏళ్లలో పర్యావరణ మార్పులతో ముప్పు అధికమని భావిస్తున్నారా? కొద్ది మేర నష్టం ఉంటుందని అనుకుంటున్నారా? అసలు భయపడాల్సిన అవసరమే లేదని అభిప్రాయపడుతున్నారా? అంటూ మూడు ప్రశ్నలు సంధించింది.
ఉత్తర, పశ్చిమ యూరప్‌లో 90 శాతం రెస్పాండెంట్లు దీని వల్ల పెను ముప్పు తప్పదని చెప్పారు. అత్యధికంగా ఇటాలియన్లు 95.4 శాతం మంది పర్యావరణ మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ మార్పులతో పెనుముప్పు తప్పదని స్విటర్లాండ్‌లో 95.3% మంది, స్పెయిన్ 93.7%, చిలీ 93.5%, గ్రీస్ 92.6%, జపాన్ 92.5%, ఫ్రాన్స్ 92.3%, పోర్చుగల్ 92.3%, దక్షిణ కొరియా 91.6%, జర్మనీలో 91.3% మంది స్పష్టం చేశారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రం దీనిని పెద్ద ముప్పుగా పరిగణించలేదు. మయన్మార్‌లో 54% మంది, చైనా 53.7%, ఇండొనేషియా 53.4%, మొజాంబిక్ 48.9%, మొరాకో 48.7%, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 48.6, ఈజిప్టు 47.8%, జోర్డాన్ 46.6%, లావోస్ 37.5, సౌదీ అరేబియాలో 30.9% మంది మాత్రమే పర్యావరణ మార్పుల పట్ల ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా ప్రపంచ జనాభాలో మూడొంతుల మంది రానున్న 20 ఏళ్లలో పర్యావరణ మార్పులతో పెను ప్రమాదం తప్పదని చెప్పారు. ఇక క్లైమేట్ ఛేంజ్‌తో కలిగే అనర్థాలు ఏమిటో 2 బిలియన్ల మందికి తెలియనే తెలియదు.