Rishabh Shetty: కన్నడ సినీ నటుడు రిషబ్ శెట్టి (Rishabh Shetty)త్వరలోనే కాంతారా చాప్టర్ 1 (Kantara Chapter1)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా మరొక రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో అన్ని భాషలలోనూ ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో కూడా ఎంతో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Ntr) ముఖ్యఅతిథిగా హాజరై సందడి చేశారు.
ఇలా ఈ సినిమా తెలుగులో ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకున్న నేపథ్యంలో కాంతార సినిమాపై పెద్ద ఎత్తున నెగెటివిటీ ఏర్పడటమే కాకుండా, ఈ సినిమాని బాయ్ కాట్(Boycott) చేయాలంటూ సోషల్ మీడియాలో తెలుగు సినీ ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా నటుడు రిషబ్ పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు . నిన్నటి వరకు ఈ సినిమా పట్ల ఎంతో పాజిటివ్ బజ్ ఉన్నప్పటికీ ఒక్కసారిగా ఇలా నెగెటివీటి రావడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారు. ఇక ఈ వేడుకలో నటుడు రిషబ్ శెట్టి కన్నడలో మాట్లాడటంతోనే ఈయన విమర్శలకు గురి అయ్యారని చెప్పాలి.
రిషబ్ భార్య ప్రగతి సైతం తెలుగులో కొన్ని ముక్కలు మాట్లాడి అనంతరం ఇంగ్లీషులో మాట్లాడారు కానీ రిషబ్ శెట్టి మాత్రం పూర్తిగా కన్నడ భాషలో మాట్లాడటంతో తెలుగు ప్రేక్షకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిషబ్ చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ తమిళంలో మాట్లాడారు. అలాగే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ముంబై వెళ్ళినప్పుడు అక్కడ హిందీలో మాట్లాడారు, కానీ తెలుగులో ఈవెంట్ నిర్వహిస్తూ కన్నడ భాషలో మాట్లాడటం ఏంటి అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఒకవేళ తెలుగు సరిగ్గా రాకపోయిన ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చు కానీ ఈయన స్పష్టంగా కన్నడ భాషలో మాట్లాడటంతోనే తెలుగు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కచ్చితంగా తెలుగు భాషను అవమానించినట్లేనంటూ మరికొంతమంది విమర్శలు కురిపిస్తున్నారు.
వివాదంలో కాంతార హీరో…
ఇలా హీరో తీరుపై తెలుగు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై రిషబ్ శెట్టి స్పందిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈయన దర్శకుడిగా కన్నడ ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే కాంతార సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కావడంతో నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఇక కాంతార మంచి విజయం కావడంతో ఈ సినిమాకు ప్రీక్వెల్ చిత్రంగా కాంతర చాప్టర్ 1 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కూడా భారీ హైప్ పెంచేసింది. ఇక ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కావడంతో ఒకటో తేదీ నుంచి ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి.