BigTV English
Advertisement

INDO PAK War 1971 :మూడు నిమిషాలు.. ముగ్గురు యోధులు.. ఒక కొత్త దేశం…!

INDO PAK War 1971 :మూడు నిమిషాలు.. ముగ్గురు యోధులు.. ఒక కొత్త దేశం…!
INDO PAK War 1971

INDO PAK War 1971 : అది 1971 డిసెంబర్ 14. ఉదయం 10.30 గంటలు. స్థలం.. గువాహటి ఎయిర్ బేస్. తూర్పు పాకిస్థాన్‌ మీద భారత సేనలు యుద్ధంలో బిజీగా ఉన్నాయి.


వింగ్ కమాండర్ బీకే బిష్ణోయ్ అప్పుడే యుద్ధభూమి నుంచి విమానం దిగారు. అక్కడున్న అధికారులతో పిచ్చాపాటీ మాట్లాడుతున్న ఆయనకు గ్రూప్ కెప్టెన్ వోలెన్ నుంచి ఆయనకు ఓ మెసేజ్ వచ్చింది.

అప్పటికి ఓ గంట క్రితమే భారత సేనల రేడియో విభాగం.. ఢాకా గవర్నర్ హౌస్, పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మధ్య జరిగిన రహస్య సంభాషణ తాలూకూ మెసేజ్ అది.
మరో 50 నిమిషాల్లో.. (ఉదయం 11.20 నిమిషాలకు) ఢాకాలోని సర్క్యూట్ హౌస్‌లో తూర్పు పాకిస్తాన్ గవర్నర్, పాకిస్థాన్ పాలకులు, సైన్యం కలిసి ఓ పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారని తెలిసింది.


ఆ భేటీ ప్రారంభం కాగానే, వారంతా బిత్తరపోయేలా ఆ సర్క్యూట్ హౌస్ మీద వైమానిక దాడి చేసి, ఆ భేటీని ఆపాలనేదే ఆ మెసేజ్.

సర్క్యూట్ హౌస్ లొకేషన్ గురించి ఆపరేషన్ రూంలో ఎలాంటి మ్యాప్ లేకపోవటంతో భిష్ణోయ్.. ఓ టూరిస్ట్ మ్యాప్ జేబులో పెట్టుకొని ఒక్క క్షణం ఆలోచించారు.

అప్పటికి సమయం.. ఉదయం 10.56 అయింది. అంటే ఇంకా భేటీకి 24 నిమిషాలు మాత్రమే ఉంది. మరి.. గువాహటి నుంచి ఢాకాకు విమానంలో 21 నిమిషాలు పడుతుంది. అంటే దాడికి మిగిలింది.. 3 నిమిషాలు.

భిష్ణోయ్ మిగ్ 21 విమానం ఇంజన్ స్టార్ట్ చేసి దాని హుడ్ మూయబోతుండగా.. ఓ ఆఫీసర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఓ కాగితం చేతిలో పెట్టిపోయాడు. భేటీ.. స్థలం సర్క్యూట్ హౌస్ కాదు.. గవర్నమెంట్ హౌస్ అనేది దాని సారాంశం. ‘అదెక్కడుంది’ అని భిష్ణోయ్ అనగా.. ‘ఏమో.. అది మీరే కనుక్కోవాలి’ అంటూ ఆ ఆఫీసర్ వెనక్కి వెళ్లిపోయాడు.

క్షణంలో మిగ్ 21 విమానం ఢాకా వైపు బయలుదేరింది. కానీ.. టార్గెట్ మారిందని భిష్ణోయ్ ఎవరికీ చెప్పలేదు. వైర్‌లెస్‌లో చెబితే ఆ మెసేజ్ లీకవుతుందని ఆగిపోయాడు.

సరిగ్గా.. ఇదే టైంకి గువాహటికి 150 కి.మీ దూరాన భారత వైమానిక దళం.. వింగ్ కమాండర్ ఆర్వీసింగ్, 37వ స్క్వాడ్రన్ వింగ్ కమాండర్ ఎస్కే కౌల్‌ను పిలిచి.. దాడిలో భిష్ణోయ్‌కు సాయం చేయాలని ఆదేశించారు.

3 నిమిషాల్లో భిష్ణోయ్ విమానం ఢాకాకు చేరబోతోందనగా.. భిష్ణోయ్ అసలు ప్లాన్‌ను కౌల్ తమ అసలు టార్గెట్ ఎంటో చెప్పి.. అదెక్కడుందో చూడమని ఆదేశించాడు.
వెంటనే మూడో నంబరు పైలెట్ వినోద్ భాటియా అదెక్కడుందో గుర్తించాడు. అయితే.. గవర్నర్ గారి భేటీకి ఇంకా 2 నిమిషాల టైమ్ ఉంది.

ఇక.. ఆ గవర్నమెంట్ హౌస్‌లో…గవర్నర్ డా. ఎ.ఎం. మలిక్ తన మంత్రులతో మాట్లాడుతుండగా, ఐక్యరాజ్యసమితి ప్రతినిధి జాన్ కేలీ అక్కడకు చేరుకున్నారు. ఆయనను గవర్నర్ మలిక్ కడు వినయంగా రిసీవ్ చేసుకున్నాడు.

(ఒకవేళ ఈ యుద్ధంలో ఓడిపోయే పరిస్థితి వస్తే.. ఐక్యరాజ్యసమితి సాయంతో భారత్ మీద ఒత్తిడి పెంచాలన్నది పాక్ పాలకుల యోచన).

గవర్నర్.. కేలీతో ‘పరిస్థితి ఎలా ఉంది?’ అన్నాడు. ‘మీమీద, మీ మంత్రుల మీద ఏ క్షణంలోనైనా ముక్తివాహిని దాడిచేయొచ్చనిపిస్తోంది. అయినా.. భయంలేదులే.. దగ్గర్లోని ఇంటర్ కాంటినెంటల్ హోటల్లో దాక్కోవచ్చులే’ అన్నాడు.

దానికి గవర్నర్.. ‘ అలా పారిపోతే.. చరిత్ర మమ్మల్ని అసహ్యించుకోదూ.. అంటూనే కనీసం నా భార్య, కూతురిని పంపక తప్పేలా లేదు’ అన్నాడు. దానికి కేలీ వెంటనే కల్పించుకుని.. ‘ అదే జరిగితే అంతర్జాతీయ ప్రెస్ అంతటికీ అది తెలిసిపోతుంది. గవర్నర్ గారు చేతులెత్తేశారనే పుకార్లూ వ్యాపించొచ్చు’ అన్నాడు.

ఆయన మాట పూర్తయిందో లేదో.. రెప్పపాటులో ఆ గవర్నమెంట్ హౌస్ మీద 16 రాకెట్లు వచ్చి పడ్డాయి. భవనం భూకంపం వచ్చినట్లు ఊగిపోయింది. దీంతో బతుకు జీవుడా అంటూ.. భేటీ నుంచి జాన్ కేలీ, ఆయన అసిస్టెంట్ వీలర్‌లు పరారై.. ఓ జీపుకింద దాక్కున్నారు. ఆయన వెంటే.. చీఫ్ సెక్రటరీ ముజఫర్ హుస్సేన్‌, మేజర్ జనరల్ రావ్ ఫర్మాన్ అలీ తలో దిక్కుకు పారిపోయారు.

మరో క్షణంలో భిష్ణోయ్ నేతృత్వంలోని మరో నాలుగు మిగ్ విమానాలు క్షణాల వ్యవధిలో రెండు దఫాలుగా 192 రాకెట్లతో దాడి చేశాయి. దాడి ఆగగానే.. కేలీ, ఆయన అసిస్టెంట్ ఇద్దరూ అక్కడికి మైలుదూరంలో ఉన్న ఐక్యరాజ్యసమితి కార్యాలయానికి పోయారు.

మరో 5 నిమిషాలకి వారి కార్యాలయానికి లండన్ అబ్జర్వర్ ప్రతినిధి గావిన్ యంగ్ పరిగెత్తుకుంటూ వచ్చి.. ‘దాడి ఆగింది కదా.. భారత విమానాలు ఇంధనం నింపుకుని మళ్లీ ఢాకా రావటానికి గంట పడుతుంది. కనుక ఈలోగా మనం వెళ్లి గవర్నర్ సంగతెలా ఉందో చూసొద్దాం’ అనగానే.. కేలీ ఆయనతో కలసి బయలుదేరాడు.

అక్కడ గవర్నర్ మలిక్, ఆయన మంత్రులు బంకర్‌లో దాక్కొని ‘రాజీనామా’పై చర్చిస్తున్నారు. ఇంతలో కేలీ, గావిన్‌లు వారి వద్దకు వెళ్లారు. రెప్పపాటులో గవర్నమెంట్ హౌస్‌పై మూడవ దాడి మొదలైంది.

ఈసారి రాకెట్ దాడికి బదులు బుల్లెట్ల వర్షం కురుస్తోంది. గవర్నర్ గారు, మంత్రులు గడగడలాడిపోతున్నారు. మరుక్షణంలో గవర్నర్ మలిక్ ‘ఇప్పుడు మనమూ శరణార్ధులమే’ అంటూ.. వణుకుతున్న చేతులతోనే జేబులోంచి పెన్నుతీసి పాకిస్థాన్ అధ్యక్షుడు యాహ్యాఖాన్‌కి తన రాజీనామా లేఖ రాసి సంతకం పెట్టాడు.

దాడి ఆగకపోవటంతో గవర్నర్.. తన బూట్లు, సాక్సులు తీసి, పక్కనే ఉన్న టాయిలెట్‌లో కాళ్లూ చేతులు కడుక్కుని తలపై రుమాలు వేసుకుని బంకర్లోని ఓ మూలన కూర్చుని నమాజు ప్రారంభించాడు.

ఆ కాసేపటికే ఆయన, తన మంత్రులు గవర్నమెంట్ హౌస్ వదిలేసి సమీపంలోని ఇంటర్ కాంటినెంటల్ హోటల్‌కి వెళ్లి దాక్కున్నారు. అక్కడి విదేశీ పాత్రికేయుల ద్వారా పాకిస్థాన్ చేతులెత్తేసిందనే వార్త అందరికీ తెలిసిపోయింది.

ఈలోగా ఢాకా వీధుల్లోకి భారత సైన్యమూ చొచ్చుకువచ్చింది. సరిగ్గా రెండు రోజుల తర్వాత తూర్పు పాకిస్థాన్‌లోని 93 వేల సైనికులు భారత సైన్యాధికారులకు లొంగిపోయారు.

నాడు.. భారత వైమానిక దళం చేసిన ఆ చివరి మూడు నిమిషాల దాడితో ఎలాంటి ప్రాణనష్టం లేకుండా తూర్పు పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌గా మారింది.

ఈ యుద్ధంలో అసాధారణ ధైర్యసాహసాలు కనబరచిన వింగ్ కమాండర్ ఎస్కే కౌల్‌కు మహావీరచక్ర, వింగ్ కమాండర్ బీకే బిష్ణోయ్‌, హరీశ్ మసంద్‌కు వీరచక్ర పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రదానం చేసింది.

ఆ యుద్ధ సమయంలో పాకిస్థాన్ పిలుపు మేరకు ఢాకాలో ఉండి, ఈ పరిణామాలను దగ్గరగా చూసిన ఐక్యరాజ్య సమితి ప్రతినిధి కేలీ దీనిపై ‘జాన్ కేలీ త్రీడేస్ ఇన్ ఢాకా’ అనే పుస్తకంలో ఇదంతా పూసగుచ్చినట్లు రాసుకొచ్చారు.

Related News

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ బైపోల్‌.. బీఆర్ఎస్‌కు కవిత గండం

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Jubilee Hills Bypoll: కాంగ్రెస్ మైలేజ్ తగ్గిందా? ప్రచారంపై అధిష్టానం నిఘా

Rajamohan Reddy: మేకపాటి మాటలు.. జగన్ చెవిలో పడేనా?

Big Stories

×