CP Sajjanar: ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన.. హైదరాబాద్ సిటీ పోలీస్ అన్యువల్ ప్రెస్ మీట్ 2025లో సీపీ సజ్జనార్ నగర భద్రత, నేరాల నియంత్రణ, సాంకేతిక వినియోగం, ప్రజల భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై సమగ్రంగా వివరించారు. ఇది తొలిసారి డిజిటల్ ఫార్మెట్‌లో నిర్వహించామని, ఈ ఏడాది హైదరాబాద్ ప్రజల సహకారం పోలీస్ విభాగానికి ప్రధాన బలంగా నిలిచిందని ఆయన తెలిపారు.
హైదరాబాద్ సిటీ పోలీస్ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో ప్రజలు చురుకుగా పాల్గొని మద్దతుగా నిలిచారని, ముఖ్యంగా పండగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించగలిగామని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో కూడా ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించారని సీపీ ప్రశంసించారు. హోమ్ గార్డ్ స్థాయి నుంచి అడిషనల్ సీపీ వరకు ప్రతి ఒక్కరు నిబద్ధతతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
విజిబుల్ పోలీసింగ్ అమలు చేయడం ద్వారా నగరంలో మొత్తం నేరాలు.. సుమారు 15 శాతం తగ్గాయని వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత మెరుగైన సేవలు అందించామని, వచ్చే ఏడాది పోలీసింగ్‌లో డ్రోన్ల వినియోగం ప్రారంభించనున్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో డ్రోన్ల పనితీరును పరిశీలించామని, అదే అనుభవాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ వ్యవస్థలో వినియోగిస్తామని స్పష్టం చేశారు.
నగరవ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల ఇతర రాష్ట్రాల నేరగాళ్ల గ్యాంగులు.. హైదరాబాద్‌కు రావడానికి వెనుకాడుతున్నాయని చెప్పారు. సైబర్ క్రైమ్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో.. 8 శాతం సైబర్ నేరాలు తగ్గాయని తెలిపారు. ఈ ఏడాది మొత్తం 526 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇన్వెస్ట్‌మెంట్, స్టాక్ మార్కెట్, ఓటీపీ, జాబ్, మ్యాట్రిమోని, వాట్సాప్ డీపీ పేర్లతో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర లింకులు ఓపెన్ చేయకూడదని సూచించారు.
మహిళల పట్ల నేరాలు 6 శాతం పెరిగాయని, పిల్లలపై నేరాలు, ముఖ్యంగా పోక్సో కేసులు 27 శాతం పెరిగాయని తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపడతామని, షీ టీమ్స్‌ను మరింత బలోపేతం చేస్తామని అన్నారు. బాధిత మహిళలకు భరోసా కల్పించే విధంగా పోలీస్ వ్యవస్థ ముందుకు సాగుతుందన్నారు.
మహిళలు, యువతులు తమ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు ఎవరికీ పంపకూడదని సీపీ సజ్జనార్ స్పష్టంగా హెచ్చరించారు. ఒకసారి ఫోటోలు ఇతరుల చేతుల్లోకి వెళ్తే అవి ఎలా, ఎక్కడ, ఏ విధంగా దుర్వినియోగం అవుతాయో తెలియదని అన్నారు. సోషల్ మీడియా, ఆన్‌లైన్ పరిచయాల విషయంలో మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అదే విధంగా పిల్లలకు ఇంటర్నెట్ వినియోగంపై తల్లిదండ్రులు తప్పనిసరిగా అవగాహన కల్పించాలి అని సీపీ సూచించారు. సోషల్ మీడియాలో ఏర్పడే ప్రతి పరిచయం నిజమైనది కాదని, పిల్లలు ఏమి చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయాలపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని అన్నారు. పిల్లల భద్రత కోసం కుటుంబం, సమాజం, పోలీస్ వ్యవస్థ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సజ్జనార్ స్పష్టం చేశారు.
డ్రగ్ ఫ్రీ సొసైటీ లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ నిరంతరం పని చేస్తోందని తెలిపారు. గత ఏడాది 322 డ్రగ్ కేసులు నమోదైతే, ఈ ఏడాది 368 కేసులు నమోదు చేసి, 6.45 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసినట్లు చెప్పారు. ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించి డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.
ట్రాఫిక్ నేరాలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని, 49,732 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపొద్దని హెచ్చరించారు. ఫ్యామిలీతో ఉంటారా లేక జైలులో ఉంటారా అనేది మీరే నిర్ణయించుకోవాలి అంటూ ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. డేంజరస్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్‌ను ఎవరూ ప్రోత్సహించకూడదన్నారు.
భవిష్యత్తులో AI డ్రివెన్ పోలీసింగ్, స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా.. మరింత బెటర్ పాలసింగ్ అందిస్తామని చెప్పారు. కల్తీ ఆహారాన్ని నియంత్రించేందుకు యాంటీ ఫుడ్ అడల్టరేషన్ టీమ్స్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెడతామన్నారు. తెలంగాణ పోలీస్ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని గర్వంగా పేర్కొన్నారు.
Also Read: నిజామాబాద్‌లో ఏటీఎం దొంగల బీభత్సం.. ఒకేరోజు రెండు చోట్ల చోరీ..
ప్రజలకు ఏ సమస్య వచ్చినా డయల్ 100 ద్వారా సంప్రదించవచ్చని, హైదరాబాద్ ప్రజల కోసం పోలీసులు 24/7 అందుబాటులో ఉంటారని సీపీ సజ్జనార్ భరోసా ఇచ్చారు. ప్రజల సహకారంతో రానున్న రోజుల్లో మరింత సురక్షితమైన, శాంతియుతమైన హైదరాబాద్‌ను నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు.