Bandi Sanjay : ఓడిపోతే కుంగిపోం.. గెలిస్తే పొంగిపోం.. ప్రజా తీర్పును గౌరవిస్తాం.. మునుగోడు ఓటమిపై సమీక్షించుకుంటాం.. అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఓడిపోలేదని.. మునుగోడులో 40 శాతం ఓట్లను సాధించామని చెప్పారు. తెలంగాణ అంతటా బీజేపీ వ్యాపించి ఉందని అన్నారు. బెదిరింపులు, ప్రలోభాలకు లొంగని బీజేపీ కార్యకర్తలను కొనియాడారు బండి సంజయ్.
అంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మోహరించినా.. టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది కేవలం 10 వేల మెజార్టీ మాత్రమేనని ఎద్దేవా చేశారు. మునుగోడు ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ 15 రోజుల్లో నెరవేర్చాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ను గెలిపించి.. తప్పు చేశామని.. ఇప్పుడు మునుగోడు ప్రజలు బాధపడుతున్నారని బండి సంజయ్ అన్నారు.
బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ కు టీఆర్ఎస్ పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చిందని ఆరోపించారు బండి సంజయ్. మునుగోడులో టీఆర్ఎస్ డబ్బులు ఒక్క రూపాయి కూడా దొరకలేదని.. ఆ పార్టీ మీద ఒక్క కేసు కూడా బుక్ కాలేదని.. అదెలా సాధ్యమని ప్రశ్నించారు. మునుగోడులో పోలీసు వాహనాలు, మంత్రుల కాన్వాయ్ లలోనే డబ్బులు తరలించారని బండి విమర్శించారు. దమ్ముంటే, ఇతర పార్టీల నుంచి లాగేసిన 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. ఉప ఎన్నికకు సిద్ధపడాలంటూ సవాల్ చేశారు బండి సంజయ్.