Big Stories

TRS Damination : 12కు 12.. నల్గొండ టీఆర్ఎస్ అడ్డా.. కాంగ్రెస్ ఇక చరిత్రేనా?

TRS Damination : రాజకీయంగా ఒక జిల్లాను మొత్తం స్వీప్ చేయడమంటే మామూలు విషయం కాదు. అలాంటిది కాంగ్రెస్ కు కంచుకోటలాంటి ఉమ్మడి నల్గొండ అంటే మాటలు కానేకాదు. మొదట్లో కామ్రేడ్లకు, ఆ తర్వాత కాంగ్రెసుకు నల్గొండ ఆయువు పట్టు. హస్తం పార్టీ పెద్ద లీడర్లలో అనేక మంది ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే ఉన్నారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి.. ఇలా హేమాహేమీలకు పుట్టినిల్లు. అలాంటి కాంగ్రెస్ కోటకు బీటలు వారాయి. కంచుకోట కుప్పకూలిపోయింది. కారు పార్టీకి అడ్డాగా మారింది. ఏకంగా 12కు 12 స్థానాలు గులాబీ ఖాతాలోనే. పార్టీకంటే తానే బలవంతుడినని అనుకున్న రాజగోపాల్ రెడ్డికి ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. మునుగోడును టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో.. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా గంపగుత్తగా గులాబీ మయంగా మారిపోయింది. మరి, కాంగ్రెస్ కు పూర్వవైభవం మాటేమో కానీ.. కనీసం ఉనికైనా చాటుకుంటుందా?

- Advertisement -

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో 9 చోట్ల టీఆర్ఎస్ గెలిచింది. మునుగోడు, నకిరేకల్, హుజూర్ నగర్ లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ ను వీడి కారెక్కేశారు. 2019లో ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపిగా గెలవడంతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక వచ్చింది. బై పోల్ లో టీఆర్ఎస్ గెలిచి సైదిరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరి.. ఉప ఎన్నికల్లో ఓడిపోవడంతో.. మునుగోడు సైతం గులాబీ ఖాతాలో చేరింది. ఇలా ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తాన్ని స్వీప్ చేసేసింది టీఆర్ఎస్.

- Advertisement -

బీజేపీకి పెద్దగా పోయిందేమీ లేదు. గతంలోనూ ఆ పార్టీకి నల్గొండలో పట్టు లేదు. ఇప్పుడూ పట్టు చిక్కలేదు. కానీ, కాంగ్రెస్ కే బిగ్ డ్యామేజ్ జరిగిందంటున్నారు. యావత్ తెలంగాణలో నల్గొండ జిల్లాలోనే కాంగ్రెస్ కు మంచి ప్రజాదరణ ఉండేది. బలమైన లీడర్లు ఆ పార్టీకి ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఆ జిల్లాలో హస్తం పార్టీకి ప్రాతినిధ్యమే లేకుండా పోవడంతో కేడర్ లో తీవ్ర నిరుత్సాహం నెలకొంది.

హుజూర్ నగర్ లో ఉత్తమ్ భార్య పద్మావతి ఓడిపోవడం.. నాగార్జున సాగర్ లో జానారెడ్డి సైతం ఓటమి పాలవడం.. మునుగోడులో పాల్వాయి స్రవంతి డిపాజిట్ గల్లంతు కావడం.. హస్తం పార్టీ దారుణ పరిస్థితికి నిదర్శనం అంటున్నారు.

అంతర్గత కలహాలే కాంగ్రెస్ పార్టీ కొంప ముంచుతోందనేది కాదనలేని వాస్తవం. మునుగోడులో సీనియర్లంతా హ్యాండ్ ఇచ్చారని.. తనకు వ్యతిరేకంగా కుట్ర చేశారని స్వయంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే బాధపడ్డారు. మునుగోడులో రేవంత్ ఒంటరి పోరాటం చేశారు. టీఆర్ఎస్, బీజేపీల దూకుడును కాంగ్రెస్ ఫేస్ చేయలేకపోయింది. డిపాజిట్ పోవడంతో.. మూడో స్థానంలో నిలిచామని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. మునుగోడు బై పోల్ తో ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ హవా.. ఇక గత చరిత్ర అనే చెబుతున్నారు. జిల్లా మొత్తం కారు పార్టీ గుత్తాధిపత్యంలోకి రావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపవుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News