ప్రజల అనుమానాలకు సమాధానం
ఫ్యూచర్ సిటీకి సంబంధించి పలు ఆరోపణలు, కుట్రలు జరుగుతున్నాయని సీఎం అన్నారు. ‘నా వ్యక్తిగత లాభం కోసం కాదు.. భవిష్యత్ తరాల కోసం ఈ నగరాన్ని నిర్మిస్తున్నాం. ఎవరి భూములను అన్యాయం చేసి తీసుకోవడం జరగదు. కోర్టుల మార్గంలో కాకుండా ప్రభుత్వ సహకారంతో సమస్యలను పరిష్కరిస్తాం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి
ఫ్యూచర్ సిటీని కేవలం ఒక కొత్త ప్రాజెక్టుగా కాకుండా లండన్, దుబాయ్, సింగపూర్ వంటి మహానగరాలకు సమానమైన స్థాయిలో నిర్మించాలనే లక్ష్యాన్ని ఆయన వివరించారు. ‘‘నాకు 10 ఏళ్లు అవకాశం ఇవ్వండి.. న్యూయార్క్‌లో ఉన్నవారు కూడా ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడేలా చేస్తాను అని సీఎం పేర్కొన్నారు.
ఫార్చున్ 500 కంపెనీలు – ఉద్యోగావకాశాలు
ఫ్యూచర్ సిటీ లో ఫార్చున్ 500 కంపెనీలను తీసుకురావాలని, ప్రపంచ స్థాయి మల్టీనేషనల్ సంస్థలను ఆకర్షించే వసతులు కల్పిస్తామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టుతో లక్షల ఉద్యోగాలు, గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్ రాష్ట్రానికి రాబోతున్నాయని చెప్పారు.
రవాణా విప్లవం – బుల్లెట్ ట్రైన్లు, గ్రీన్ రేడియల్ రోడ్డు
ఈ ప్రాజెక్టులో భాగంగా ఫ్యూచర్ సిటీ నుండి.. మచిలీపట్నం పోర్ట్ వరకు 12 లైన్ల గ్రీన్ రేడియల్ రోడ్డు నిర్మిస్తామని ఆయన తెలిపారు. అలాగే ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరు, చెన్నై, అమరావతి దిశగా బుల్లెట్ ట్రైన్‌లు రాబోతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలు జరిగి సానుకూల సంకేతాలు వచ్చాయని వెల్లడించారు.
ప్రజల సహకారం – సమస్యల పరిష్కారం
ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రక్రియలో కొందరికి ఇబ్బందులు రావొచ్చని సీఎం అంగీకరించారు. చిన్న సమస్యలు ఉంటే ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎవరి ఆస్తులు కోల్పోవాల్సి వచ్చినా న్యాయం చేస్తాం. ప్రజల సహకారం లేకుండా ఈ స్థాయి ప్రాజెక్టులు సాధ్యం కావు అని ఆయన అన్నారు.
విద్యా, పరిశోధన కేంద్రాలు
ప్రాజెక్టులో భాగంగా డిసెంబర్ నెలలోనే స్కిల్ యూనివర్సిటీ ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. సింగరేణి సంస్థకు ఫ్యూచర్ సిటీ లో 10 ఎకరాలు కేటాయించి, వారి గ్లోబల్ కార్పొరేట్ ఆఫీస్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
భవిష్యత్ తరాల కోసం సంకల్పం
నిజాం కాలంలో హైదరాబాద్, సికింద్రాబాద్ అభివృద్ధి చెందాయి. ఇప్పుడు మన భవిష్యత్ తరాల కోసం కొత్త పునాదులు వేయాలి. ఇది నా కోసం కాదు.. మన పిల్లల పిల్లల కోసం చేస్తున్న పని అని రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు
ఫ్యూచర్ సిటీ కేవలం ఒక అభివృద్ధి ప్రాజెక్టు కాదు.. తెలంగాణ భవిష్యత్‌కు కొత్త దిశ చూపే మహత్తర సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజల సహకారం, గ్లోబల్ పెట్టుబడులు, అధునాతన రవాణా సదుపాయాలతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటే.. తెలంగాణ అంతర్జాతీయ స్థాయిలో నిలుస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
రాబోయే పదేళ్లలో ఫార్చ్యూన్ 500 కంపెనీలు భారత్ ఫ్యూచర్ సిటీలో ఉండాలన్నదే నా లక్ష్యం
– సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/48beqbDoDy
— BIG TV Breaking News (@bigtvtelugu) September 28, 2025