AP Power Charges: రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా వీలైతే తగ్గిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే నిలబెట్టుకున్నామన్నారు. ఆదివారం అమరావతిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో పెంచిన ట్రూ అప్ ఛార్జీలను ట్రూ డౌన్ చేసే కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ప్రస్తుతం యూనిట్‌కు 13 పైసలు చొప్పున ఛార్జీలు తగ్గించామన్నారు. రానున్న రోజుల్లో ఛార్జీలు మరింతగా తగ్గే అవకాశం ఉందన్నారు. .
నవంబర్ నుంచి యూనిట్‌కు 13 పైసలు చొప్పున విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నాయని మంత్రి గొట్టిపాటి తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో 2023 – 24లో ప్రొవిజినల్ కలెక్షన్ పేరుతో యూనిట్ 40 పైసలు ఫిక్స్ చేసిందన్నారు. దీనిపై 13 పైసలు తగ్గించామని మంత్రి పేర్కొన్నారు. అలాగే 17 శాతం ఉన్న షార్ట్ టర్మ్ విద్యుత్ కొనుగోళ్లను 6.8 శాతానికి తగ్గించామన్నారు. స్వాపింగ్ విధానంలో హర్యానా, పంజాబ్ తో విద్యుత్ ఇచ్చి పుచ్చుకునే దిశగా పనిచేస్తున్నామని చెప్పారు.
జగన్ ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారం మోపిందని, ఆ భారాన్ని కూటమి ప్రభుత్వం తగ్గిస్తోందని మంత్రి గొట్టిపాటి చెప్పారు. నవంబర్ నెల నుంచి ప్రతి యూనిట్‌పై 13 పైసలు తగ్గిస్తున్నామని, రానున్న రోజుల్లోనూ మరింత భారం లేకుండా చేస్తామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిందన్నారు. 2019లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా చంద్రబాబు తీర్చిదిద్దారని, కానీ జగన్ వచ్చాక 5 ఏళ్లలో విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారన్నారు. రూ.1.25 లక్షల కోట్ల మేర అప్పులు ఊబిలోకి నెట్టారని మంత్రి వివరించారు.
‘5 ఏళ్లు సీఎంగా ఉండి జెన్కో, ట్రాన్స్‌కో వ్యవస్థలను జగన్ నాశనం చేశారు. వీటీపీఎస్, కృష్ణపట్నంలో విద్యుత్ తయారు చేసుకునే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. బయటి రాష్ట్రాల నుంచి ఎక్కువ ఖర్చు చేసి విద్యుత్ కొనుగోలు చేశారు. 2019కు ముందు రెన్యువబుల్ ఎనర్జీలో ఏపీ ముందుంది. 7 నుంచి 9 వేల మెగావాట్ల పై చిలుకు విద్యుత్ ఉత్పత్తి చేశాం. కానీ జగన్ వచ్చాక కక్ష సాధింపులతో పీపీఏలు రద్దు చేశారు. ఒప్పందం చేసుకున్న విద్యుత్‌ను వాడకపోవడంతో రూ.9 వేలకోట్లు ఆ సంస్థలకు అప్పనంగా చెల్లించాల్సి వచ్చింది. ఆ భారమంతా ప్రజలపైనే పడింది’- మంత్రి గొట్టిపాటి రవికుమార్
‘కేంద్రం ఇచ్చే రాయితీ పథకాలను కూడా వినియోగించుకోలేదు. వీటీపీఎస్ కు బొగ్గు సరఫరా చేసి నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తి చేయాలని 70 శాతం వినియోగంలోకి తెచ్చాం. 90 శాతం మేర విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రయత్నం చేస్తాం. కృష్ణపట్నం, కడపలోని ప్లాంట్లను కూడా వినియోగంలోకి తెస్తాం. విద్యుత్ కొనుగోలు తగ్గించాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం. గత ప్రభుత్వంలో 17 శాతం పైన ఉండే షార్ట్ టర్మ్ విద్యుత్ కొనుగోలును 6.8 శాతానికి తగ్గించాం. విద్యుత్ రంగంలో సీఎం చంద్రబాబుకు అపారమైన అనుభవం ఉంది. దేశంలో మొదటిసారి సంస్కరణలు తెచ్చిన వ్యక్తి సీఎం చంద్రబాబు’ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
రాష్ట్రంలో పీఎం సూర్యఘర్ పథకం కింద 20 లక్షల రూఫ్‌టాప్ ఏర్పాటు లక్ష్యాన్ని సీఎం చంద్రబాబు నిర్దేశించారని మంత్రి గొట్టిపాటి తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
‘కేంద్రం ఇచ్చే రాయితీ కాకుండా బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల సబ్సిడీ ఇస్తుంది. పీఎం కుసుమ్ కింద 12 కేవీ లైన్స్ నుంచే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను పగటి పూటే ఇస్తున్నాం. పెద్ద ఎత్తున సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నాం. జెన్ కో నుంచి ట్రాన్స్‌కో లైన్స్, ఉత్పత్తి చేపట్టాం. 400 కేవీ, 200 కేవీ, 33/11కేవీ విద్యుత్ స్టేషన్లు నిర్మిస్తున్నాం. ప్రతి ఏటా 6 నుంచి 8 శాతం విద్యుత్ వినియోగం పెరుగుతోంది. దానికి అనుగుణంగా లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ఉత్పత్తి, సరఫరా చేస్తున్నాం’ అని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.
రాష్ట్రంతో పాటు అమరావతి రాజధాని భవిష్యత్‌ను దృష్టిపెట్టుకుని సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాయలసీమలో విండ్, సోలార్ పవర్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. బ్యాటరీ స్టోరేజీకి (BESS)కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. పగటిపూట విద్యుత్ ఉత్పత్తి చేసి బ్యాటరీల ద్వారా నిల్వ చేసి రాత్రిపూట పీక్ సమయాల్లో వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. వీటి ఏర్పాటుకు సంబంధించి టెండర్లు కూడా పూర్తయ్యాయి. పీఎస్పీలకు ప్రకాశం జిల్లాలో టెండర్లు కూడా పిలిచామన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను ఆదాయ వనరుగా మార్చుకుందిని మంత్రి విమర్శలు చేశారు.
‘జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 2021-22లో రూ.3 వేల కోట్లు, 2022-23లో రూ.6,073 కోట్లు, 2023-24లో ప్రొవిజనల్ కలెక్షన్ అంటూ రూ.9,300 కోట్లు భారం వేశారు. ప్రతి యూనిట్‌పై అదనంగా 40 పైసలు భారం వేశారు. మొత్తం మీద ఐదేళ్లలో ప్రజల నెత్తిన రూ.18 వేల కోట్లకు పైగా విద్యుత్ భారం మోపారు. ప్రస్తుతం ట్రూడౌన్ ద్వారా 13 పైసలు తగ్గించాం. 2019లో మేం దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ ఉంచాం. కానీ జగన్ దిగిపోయే నాటికి విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారు’ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
Also Read: GST Relief To Farmers: జీఎస్టీ తగ్గింపుతో రైతులకు భారీ ఊరట.. వేటిపై ధరలు తగ్గనున్నాయంటే?
గత ప్రభుత్వం సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నా రాజస్థాన్ నుంచి 9 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసిందని మంత్రి తెలిపారు. దీంతో బిల్లుల రూపంలో ప్రజలపై భారం పడిందన్నారు. గత ప్రభుత్వం విధించిన ట్రూ అప్ ఛార్జీలతో చిన్న పరిశ్రమలు చాలా ఇబ్బందులు పడ్డాయన్నారు. ప్రతి 10 రోజులకు ఒకసారి సీఎం చంద్రబాబు విద్యుత్ శాఖపై సమీక్ష చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఛార్జీల భారం తగ్గుతుందని చెప్పారు. ఈ తగ్గింపులు ప్రజలకు భారం లేకుండా చేయడంతో పాటు పరిశ్రమల రాకకు ఊతమిస్తాయని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.